బలహీనపడుతున్న ‘కరోనా’!!

ABN , First Publish Date - 2020-05-07T14:41:39+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైర్‌సలో ఇప్పటివరకు ఇంచుమించు 200 జన్యుమార్పులు జరిగినట్లు బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌(యూసీఎల్‌)

బలహీనపడుతున్న ‘కరోనా’!!

లండన్‌/వాషింగ్టన్‌, మే 6 : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైర్‌సలో ఇప్పటివరకు ఇంచుమించు 200 జన్యుమార్పులు జరిగినట్లు బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌(యూసీఎల్‌) శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19తో తీవ్రంగా ప్రభావితమైన పలు దేశాలకు చెందిన 7,500 శాంపిళ్లలోని కరోనా వైరస్‌ జన్యువుల విశ్లేషణ అనంతరం ఈవిషయాన్ని వెల్లడించారు. ఏ మాత్రం మార్పులు జరగకుండా ఉన్న జన్యువుల్లోని భాగాలు లక్ష్యంగా ఔషధాలు, వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు ముమ్మర అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు.


కరోనాలో చోటుచేసుకున్న ఈ మార్పులన్నీ మానవాళి మంచికేనని అమెరికాలోని అరిజోనా స్టేట్‌ వర్సిటీకి చెందిన బయోడిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. వర్సిటీకి చెందిన డాక్టర్‌ ఎఫ్రెం లిమ్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం జరిపిన అధ్యయనంలో కరోనా ఉనికిపై ఓ కొత్త విషయం తెలిసింది. ‘నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌’ పరిజ్ఞానంతో 382 మంది కరోనా రోగుల ముక్కు స్రావాల శాంపిళ్లను విశ్లేషించగా, ఒక్క శాంపిల్‌లో భిన్నమైన జన్యుమార్పులు గుర్తించారు. సాధారణంగానైతే కరోనా వైరస్‌ జన్యువుల్లో 30వేల కెమికల్‌ లెటర్స్‌ ఉంటాయి. కానీ ఆ ఒక్క శాంపిల్‌లో మాత్రం 81 కెమికల్‌ లెటర్స్‌ జాడ కనిపించలేదు. కొవిడ్‌-19 బలహీనపడుతోంది అనేందుకు వైర్‌సలోని కెమికల్‌ లెటర్స్‌ జాడ గల్లంతవడం ఓ నిదర్శనమని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Updated Date - 2020-05-07T14:41:39+05:30 IST