Abn logo
Sep 19 2021 @ 15:47PM

జీఎస్‌టీఆర్ దాఖలు ప్రక్రియలో మార్పులు

హైదరాబాద్ : జీఎస్‌టీ రిటర్న్ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపినా... ఆ తర్వాతి నెలకు జీఎస్టీఆర్-1 విక్రయాల రిటర్న్స్‌ను దాఖలు చేసే వీలుండబోదు. జనవరి ఒకటి నుండి ఈ ప్రక్రియ అమలుకానుంది. ప్రస్తుతం జీఎస్టీఆర్-3Bని రెండు నెలల పాటు దాఖలు చేయకుంటే జీఎస్టీఆర్-1 ను సమర్పించేందుకు అవకాశం లేదు. కాగా... వచ్చే ఏడాది నుండి దీనిని ఒక నెలకు పరిమితం చేయనున్నారు. ఇందుకు కేంద్ర జీఎస్టీ నిబంధనల్లోని 59(6)ను సవరణ చేయబోతున్నారు. ఒక నెలలో చేసిన విక్రయాల వివరాలతో జీఎస్టీఆర్-1 ను మరుసటి నెల 11 వ తేదీ వరకు వ్యాపారులు దాఖలు చేస్తారు.


జీఎస్‌టీ వివరాలతో జీఎస్టీఆర్-3B ను మరుసటి నెల 20-24 రోజుల మధ్య సమర్పించి, జీఎస్‌టీని చెల్లిస్తారు. మరోవైపు, జీఎస్టీ రిఫండ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి, రద్దు చేసుకున్న రిజిస్ట్రేషన్‌ను పునరుద్దరించుకోవడానికి, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ కార్డు ధృవీకరణను కౌన్సిల్ తప్పనిసరి చేసింది. కిందటేడాది ఆగస్టు 21 న కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్(సీబీఐసీ) జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు... జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ ధృవీకరణకుగాను వ్యాపారులు ఇవ్వనిపక్షంలో... వ్యాపారం జరిగే ప్రాంతాన్ని భౌతికంగా చూసి, నిర్దారించుకున్న తర్వాత రిజిష్టర్ చేస్తున్నారు. ఇప్పుడు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌తో ఆధార్‌ను తప్పనిసరిగా లింక్ చేసే నిబంధనకు కౌన్సిల్ ఆమోదించింది.