పుట్టుమచ్చల్లో మార్పులు స్కిన్‌ కేన్సర్‌కు సంకేతాలు!

ABN , First Publish Date - 2021-07-20T05:30:00+05:30 IST

స్త్రీపురుషులు ఇద్దరూ, ప్రత్యేకించి పురుషులు కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడం కోసం చేయించుకోవలసిన ముందస్తు పరీక్షలు ఉన్నాయి.

పుట్టుమచ్చల్లో మార్పులు స్కిన్‌ కేన్సర్‌కు సంకేతాలు!

స్త్రీపురుషులు ఇద్దరూ, ప్రత్యేకించి పురుషులు కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడం కోసం చేయించుకోవలసిన ముందస్తు పరీక్షలు ఉన్నాయి. చర్మ కేన్సర్‌; నోటి కేన్సర్‌, పెద్దపేగు, ప్రోస్టేట్‌ కేన్సర్లను వైద్య పరీక్షలతో ముందుగానే గుర్తించే వీలుంది. 


స్త్రీపురుషులు చేయించుకోవలసిన పరీక్షలు!

చర్మ కేన్సర్‌: చర్మాన్ని తరచుగా పరిశీలించి ఈ కేన్సర్‌ను కనిపెట్టవచ్చు. ముఖ్యంగా పుట్చుమచ్చలను, ఎ, బి, సి, డి, ఇ పద్ధతి ప్రకారం పరీక్షించుకోవాలి. 


ఎ,బి,సి,డి,ఇ పద్ధతి!

ఎ: పుట్టుమచ్చలను మధ్యకు విడదీసి చూసినప్పుడు అవి రెండు అర్థభాగాలుగా కనిపించకూడదు.

బి: పుట్టుమచ్చల అంచులు గరుకుగా, అస్పష్టంగా ఉండ కూడదు.

సి: పుట్టుమచ్చ రంగులో మార్పు రాకూడదు. అవి ముదురు రంగులోకి మారడం, పలుచబడటం సరికాదు.

డి: పుట్టుమచ్చ వ్యాసం 1/4 అంగుళం కన్నా ఎక్కువ ఉండకూడదు

ఇ: పుట్టుమచ్చ చర్మం మీద ఉబ్బెత్తుగా, వాచినట్టు ఉండకూడదు.


పెద్దపేగుల్లో కేన్సర్‌

మొదట చిన్న గుల్లలుగా మొదలై, క్రమంగా కేన్సర్‌ కణుతులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి కేన్సర్‌ను కొన్ని లక్షణాల ద్వారా గుర్తించే ప్రయత్నం చేయాలి. అవేంటంటే..


మలద్వారం వద్ద రక్తస్రావం, మలంలో రక్తం పడడం

డయేరియా, మలబద్ధకం వారాల తరబడి వేధించడం

పొత్తికడుపు భాగంలో నొప్పి లేదా పట్టేసినట్టు ఉండడం

ఆకస్మికంగా బరువు తగ్గడం

పూర్వం కేన్సర్‌ వచ్చి కోలుకున్నవారు

అల్సరేటివ్‌ కొలైటిస్‌ ఉన్నవారు

రక్తసంబంధీకుల్లో (తల్లి తండ్రులు, సోదరి, సోదరులు, పిల్లలు) ఎవరికైనా కేన్సర్‌ ఉన్నట్లయితే...

ప్రతి ఐదేళ్లకోసారి ఎఫ్‌ఒబిటి మరియు ఫ్లెక్సిబుల్‌ సిగ్మాయిడోస్కోపీ పరీక్షలు చేయించుకోవాలి.


నోటి కేన్సర్‌

నోటి కేన్సర్‌ ఎక్కువగా ఉన్న మనలాంటి దేశాల్లో కేన్సర్‌ స్ర్కీనింగ్‌ అనేది ఎంతో ముఖ్యం. మిగతా శరీర భాగాలలాగా కాకుండా నోరు అనేది కంటికి కనపడేది. కాబట్టి ప్రాథమిక స్ర్కీనింగ్‌ అనేది సులువు. నోట్లో తలెత్తే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పొగాకు నమిలేవాళ్లు, ఆ అలవాటు మానుకోవాలి.  మానుకున్నవాళ్లు కూడా నోట్లో కలిగే మార్పులను గమనిస్తూ ఉండాలి. 


మగవారికి స్ర్కీనింగ్‌ పరీక్షలు

ప్రోస్టేట్‌ కేన్సర్‌: మగవారికి వచ్చే కేన్సర్లలో ప్రోస్టేట్‌ కేన్సర్‌ కూడా ఒకటి. భారతదేశంలో ప్రోస్టేట్‌ కేన్సర్‌ అసహజమేమీ కాదు. కానీ చాలామంది పురుషులకు దీని గురించి అవగాహన లేదు. 50 ఏళ్లు పైబడిన పురుషులు ప్రతి ఏడాదీ ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ రక్తపరీక్ష, డిజిటల్‌ రెక్టల్‌ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా (తల్లితండ్రులు, సోదరుడు, కొడుకు) కేన్సర్‌ ఉంటే, మిగతా పురుషులు 40 ఏళ్ల వయసు నుంచే ప్రోస్టేట్‌ స్ర్కీనింగ్‌ చేయించుకోవాలి. 


డాక్టర్‌ మోహన వంశీ,

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421

Updated Date - 2021-07-20T05:30:00+05:30 IST