మారనున్న విశాఖ రూపురేఖలు

ABN , First Publish Date - 2022-01-27T06:15:41+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించడంతో విశాఖ జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోనున్నది.

మారనున్న విశాఖ రూపురేఖలు

జిల్లాలో సమూల మార్పులు

కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు

పాడేరు కేంద్రంగా అల్లూరి జిల్లా

అనకాపల్లి ఇకపై జిల్లా కేంద్రం

చిన్న జిల్లాగా విశాఖపట్నం

భీమిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు 

విశాఖ రూరల్‌, మహారాణిపేట మండలాలు కొత్త డివిజన్‌లో విలీనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించడంతో విశాఖ జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోనున్నది. ప్రస్తుతం ఉన్న విశాఖ జిల్లాలో అదనంగా మరో రెండు కొత్త జిల్లాలు వస్తున్నాయి. అందులో ఒకటి అనకాపల్లి కాగా, మరొకటి పాడేరు కేంద్రంగా ఏర్పాటయ్యే అల్లూరి సీతారామరాజు జిల్లా. నాలుగు జిల్లాల్లో విస్తరించి వున్న అరకులోయ పార్లమెంటు నియోజకవర్గంలోని అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలను, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో గల రంపచోడవరాన్ని కలిపి పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయనున్నారు. దీనికి ‘అల్లూరి సీతారామరాజు జిల్లా’ అని నామకరణం చేశారు. అరకు పార్లమెంటు నియోజకవర్గంలో మిగిలిన సాలూరు, కురుపాం, పాలకొండ, పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ‘మన్యం’ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికి పార్వతీపురం కేంద్రంగా ఉండనుంది. ఇక అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలతో అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లాను ప్రకటించారు. 


కొత్తగా మరో రెవెన్యూ డివిజన్‌

విశాఖ జిల్లాలో ప్రస్తుతం నాలుగు రెవెన్యూ డివిజన్లు (విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు) ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో భీమిలి కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానున్నది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతో పాటు విశాఖపట్నం రూరల్‌, మహారాణిపేట మండలాలను కలిసి ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు. విశాఖ రూరల్‌ మండలం భీమిలి ప్రాంతాలను ఆనుకొని వుండడం వల్ల ఇబ్బంది లేదు. అయితే విశాఖ నగర నడిబొడ్డున వున్న మహారాణిపేట మండలాన్ని తీసుకువెళ్లి భీమిలి రెవెన్యూ డివిజన్‌లో కలపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మహారాణిపేట మండలంలోనే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా పరిషత్‌ వంటివి ఉన్నాయి.  


పెందుర్తి విభజనపై అభ్యంతరాలు

పెందుర్తి మండలం పూర్తిగా విశాఖపట్నం నగరంలో కలిసిపోయి ఉంది. ఇప్పుడు దీనిని విశాఖ జిల్లా నుంచి పూర్తిగా విడదీసి అనకాపల్లి జిల్లాలో విలీనం చేశారు. దీనిపై అక్కడి వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ మండలాన్ని విశాఖపట్నం జిల్లాలోనే వుంచాలని కోరుతున్నారు. 


చిన్న జిల్లాగా విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లాను మూడు జిల్లాలుగా విడదీయడంతో కొత్తగా ఏర్పాటయ్యే అల్లూరి జిల్లా విస్తీర్ణంలో 12,251 చ.కి.మీ.తో పెద్దదిగా ఆవిర్భవించనుంది. జనాభాపరంగా అనకాపల్లి 18.73 లక్షలతో పెద్దదిగా ఉంటుంది. విస్తీర్ణంలో (928 చ.కి.మీ.) విశాఖపట్నం జిల్లా చిన్నదిగా మారిపోతోంది. అనకాపల్లి జిల్లాలో 25 మండలాలు, అల్లూరి జిల్లాలో 22 మండలాలు వస్తుండగా, విశాఖ జిల్లాలో కేవలం 10 మండలాలే ఉండనున్నాయి. ఆ విధంగా విశాఖ జిల్లా చిన్నదిగానే ఉంటుంది.


కొత్త జిల్లాల స్వరూపం...

----------------------------------------------------------------------------------------------

విశాఖపట్నం జిల్లా

జిల్లా కేంద్రం: విశాఖపట్నం

విస్తీర్ణం: 928 చ.కి.మీ

జనాభా: 18.13 లక్షలు

రెవెన్యూ డివిజన్లు: 2 (విశాఖపట్నం, భీమిలి)

మండలాలు: 10

అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక)


నూతన జిల్లాల ఏర్పాటు చరిత్రాత్మకం

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

సింహాచలం, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వున్న పదమూడు జిల్లాలను 26 జిల్లాలు చేయాలని తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. 98వ వార్డులోని ఎస్సీ కాలనీలో నవయువ దళిత సేవా సంఘం ఏర్పాటుచేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను బుధవారం ఆయన కార్పొరేటర్‌ పిసిని వరాహ నరసింహంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల విభజనను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొలుసు ఈశ్వరరావు, ఎర్ర వరంబాబు, పీతల అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు. 


పెందుర్తిని విశాఖలోనే ఉంచాలి 

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి 

పరవాడ, జనవరి 26: పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లి జిల్లాలో కలపడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. బుధవారం వెన్నెలపాలెంలోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ పెందుర్తి నియోజవర్గానికి చెందిన ఎనిమిది వార్డులు జీవీఎంసీ పరిధిలో ఉన్నాయని, అయినప్పటికీ అనకాపల్లిలో కలపాలని చూడడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ నియోజకవర్గ ప్రజలకిచ్చే బహుమతి ఇదేనా అని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధికోసం నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కలపాలని చూస్తే ఉద్యమం చేపట్టడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించారు. దీనిపై న్యాయ పోరాటానికీ సిద్ధంగా ఉన్నామన్నారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనను పక్కదారి పెట్టించేందుకే ముఖ్యమంత్రి కొత్త జిల్లాల ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు.

Updated Date - 2022-01-27T06:15:41+05:30 IST