మారనున్న రాజకీయ సమీకరణాలు

ABN , First Publish Date - 2020-10-13T06:47:36+05:30 IST

నిజామాబాద్‌ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు, మాజీ ఎంపీ కవిత గెలుపొందడంతో జగిత్యాల జిల్లాలో రాజకీయ సమీకరణాలు

మారనున్న రాజకీయ సమీకరణాలు

16 మాసాల తర్వాత శాసనమండలికి ఎంపికైన కవిత

శాసనమండలిలో కలువనున్న రాజకీయ ప్రత్యర్థులు జీవన్‌ రెడ్డి, కవిత

ఎమ్మెల్సీగా కవిత విజయంతో జిల్లావ్యాప్తంగా సంబరాలు

కవితకు మంత్రి పదవి వస్తుందంటూ పార్టీలో చర్చ


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల)

నిజామాబాద్‌ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు, మాజీ ఎంపీ కవిత గెలుపొందడంతో జగిత్యాల జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయనే చర్చ జోరందుకుంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోకి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో నిజామాబాద్‌ ఎంపీగా గెలుపొందిన కవిత జగిత్యాల జిల్లాపై తనదైన ముద్ర వేసుకుంది. ఓవైపు రాజకీయ నేతలు, మరోవైపు అధికారులు ఆమె కనుసన్నల్లోనే పని చేస్తూ వచ్చారు. 2018లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాలపై ప్రత్యేక దృ ష్టి పెట్టిన కవిత కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడైన జీవన్‌రెడ్డిని ఓడించడమే కంకణం కట్టుకుని పని చేయగా, జీవన్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్ని కల్లో జీవన్‌రెడ్డి ఆచితూచి వ్యవహరించి కవిత ఓటమికి వ్యూహాలు పన్ని సక్సెస్‌ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి విజయం సాధించి శాసనమండలిలో అడుగు పెట్టారు. ఇప్పుడు మాజీ ఎంపీ కవిత ఎమ్మెల్సీగా గెలుపొంది అదే శాసన మండలిలో అడుగుపెట్టడంతో రాజకీయంగా కొత్త చర్చ సాగుతోంది.


శాసన మండలికి రాజకీయ ప్రత్యర్థులు..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డికి మాజీ ఎంపీ కవిత మధ్య రాజకీయం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉంటుంది. అయితే వీరిద్దరు ప్రత్యక్షంగా ఎన్నికల్లో తలపడనప్పటికీ పరోక్షంగా ఒకరిపై ఒకరు పైచేయి నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ కురువృద్ధుడు జీవన్‌రెడ్డిని జగిత్యాలలో ఓడించేందుకు అప్పుడు నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న కవిత సర్వశక్తులూ ఒడ్డారు. జగిత్యాలలో అన్నీ తానై రాజకీయం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్‌ కుమార్‌ అభ్యర్థి అయినప్పటికీ నియోజకవర్గంలో కవిత సుడిగాలి పర్యటన చేస్తూ జీవన్‌ రెడ్డి ఓటమిలో ముఖ్యపాత్ర పోషించారు. సంజయ్‌ కుమార్‌ గెలుపుతో ఈ ప్రాంతంలో కవిత గెలిసినట్లుగానే కార్యకర్తలు భావించారు. జీవన్‌రెడ్డి కూడా 60 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలు కావడం జీర్ణించుకోలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ బరిలో నిలిచారు.


జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గంలో జీవన్‌ రెడ్డి తనదైన శైలిలో పావులు కదిపారు. కొంతమేరకు ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండగా, జీవన్‌ రెడ్డి ఆ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి కవిత ఓటమికి వ్యూహాన్ని పన్నారు. ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అర్వింద్‌ విజయం సాధించగా, జీవన్‌ రెడ్డి మాత్రం పరోక్షంగా విజయం సాధించారని రాజకీయంగా చర్చ సాగింది. అయితే రాజకీయ ప్రత్యర్థులైన ఇద్దరు ఇప్పటివరకు ప్రత్యక్షంగా తలపడనప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వీరు ఇప్పుడు శాసన మండలిలో కలవబోతున్నారు. ఒకరు ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి, మరొకరు నిజామాబాద్‌ ఎంపీగా ఓసారి గెలిచి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొంది పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రస్తుతం నిజామాబాద్‌ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు. ఇలా రాజకీయ ప్రత్యర్థులైన జీవన్‌ రెడ్డి, కవితలు మళ్లీ శాసన మండలిలో కలువనుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


జగిత్యాల జిల్లాలో మారనున్న రాజకీయం..

నిజామాబాద్‌ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందిన కవిత శాసన మండలిలో అడుగు పెట్టనుండగా జగిత్యాల జిల్లాలో రాజకీయ పరిస్థితులు మారుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కవిత అంటే మంచి క్రేజ్‌ ఉంది. కవిత ఓటమిపాలు అయినప్పటికీ ఈ రెండు నియోజకవర్గాల్లో కార్యకర్తలు అనేక కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఇప్పటికీ కవిత ఫొటోలు ఫ్లెక్సీల్లో పెడుతూనే ఉంటారు. జీవన్‌ రెడ్డిని ఓడించాలనే ఆలోచనతో జగిత్యాల నియోజకవర్గంలోని చాలా మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను అలాగే టీటీడీపీ అధ్యక్షుడైన ఎల్‌.రమణ ముఖ్య అనుచరులను కవిత టీఆర్‌ఎస్‌లోకి వ్యూహాత్మకంగా ఆహ్వానించి గులాబీ కండువాలు కప్పింది. టీఆర్‌ఎస్‌లో చేరిన చాలా మంది కాంగ్రెస్‌, టీడీపీ సీనియర్‌ నాయకులపై ఇప్పటికీ కవిత అనుచరులు అనే ముద్ర ఉంది.


అయితే నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కవిత ఓటమిపాలు కాగా, ఆమె ఆహ్వానం మేరకు పార్టీలో చేరిన చాలా మంది సీనియర్లు 16 మాసాలుగా కవితకు పదవి లేదంటూ మౌనంగానే ఉండిపోయారు. కవిత ముద్ర పడిన కొందరు నాయకులకు ఎమ్మెల్యే వద్ద కొంత భంగపాటు ఎదురైందనే వాదనలు కూడా వినిపించాయి. పార్టీలో కూడా ఈ అంశంపై అంతర్గతంగా చర్చ కూడా సాగింది. ఇప్పుడు కవిత నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందడంతో పాటు రాబోవు రోజుల్లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతుందని ప్రచారం జోరందుకోవడంతో జగిత్యాల జిల్లాలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతాయనే చర్చ మొదలైంది.

Updated Date - 2020-10-13T06:47:36+05:30 IST