ఫ్యాషన్‌తో మార్పు తెస్తోంది!

ABN , First Publish Date - 2021-03-03T05:38:52+05:30 IST

దుస్తులను చూడచక్కగా మలిచే ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆమె. ఆ ఒక్కటే కాదు పాత ఫ్యాషన్ల కొత్త మెరుగులు దిద్దుతూ, సమాజంలో మార్పు సందేశాన్ని గట్టిగా వినిపిస్తున్న అభ్యుదయవాది కూడా. మగవాళ్ల దుస్తుల తయారీలో తనదైన ముద్ర వేస్తున్న ప్రియా

ఫ్యాషన్‌తో మార్పు తెస్తోంది!

దుస్తులను చూడచక్కగా మలిచే ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆమె. ఆ ఒక్కటే కాదు పాత ఫ్యాషన్ల కొత్త మెరుగులు దిద్దుతూ, సమాజంలో మార్పు సందేశాన్ని గట్టిగా వినిపిస్తున్న అభ్యుదయవాది కూడా. మగవాళ్ల దుస్తుల తయారీలో తనదైన ముద్ర వేస్తున్న  ప్రియా అహ్లూవాలియా ఈమధ్యే ‘క్వీన్‌ ఎలిజబెత్‌ 2 బ్రిటిష్‌ డిజైన్‌’ అవార్డు అందుకున్నారు. అంతేకాదు బ్రిటిషు ఫ్యాషన్‌ కౌన్సిల్‌ తాజాగా ‘‘అభ్యుదయ భావాలున్న నాయకురాలు, మార్పుకి వారధి’’ అని ఆమెకు  కితాబునిచ్చింది. ఫ్యాషన్‌ దుస్తుల డిజైన్‌లో ‘సుస్థిరత, భిన్నత్వానికి బాటలు వేస్తున్న యువతరంగం’గా ఆమెను గుర్తించడం బ్రిటన్‌లో మార్పు దిశగా పడుతున్న అడుగులకు నిదర్శనం. 


చాలామంది విదేశాలకు చెందిన దుస్తులు, 2012 లండన్‌ మారథాన్‌ కోసం రూపొందించిన టీ షర్ట్స్‌ ధరించడం చూశాను. సంవత్సరాలుగా పాత దుస్తులు వాడుకలో ఉండడం చూసి నాకు ఒకింత ఆశ్చర్యంతో పాటు ఆసక్తి పెరిగింది.


మార్కెట్‌ లక్ష్యంగా కొత్త స్టయిల్స్‌ తీసుకొచ్చే ఫ్యాషన్‌ డిజైనర్లకు ప్రియా అహ్లూవాలియాకు అస్సలు పోలిక ఉండదు. ఎందుకంటే ఆమె మార్పు లక్ష్యంగా దుస్తులు రూపొందిస్తారు. ప్రియ తండ్రి నైజీరియన్‌, తల్లి భారతీయురాలు కావడంతో భిన్న సంప్రదాయాలున్న కుటుంబ వాతావరణంలో పెరిగారు. ఫ్యాషన్‌ రంగంలో ఉన్న తల్లి ప్రభావం ఆమెపై పడింది. ఆమెకు భారతీయ రంగుల అద్దకం, పూసల డిజైన్లు, ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రియాకు ఫ్యాషన్‌ ప్రపంచం తప్ప మరే రంగంపై మనసు పోలేదు. అందుకే ప్రియ డిజైన్‌ చేసే దుస్తులు ఆమె బ్రిటిష్‌, ఇండియా, నైజీరియా మూలాలను ప్రతిబింబిస్తాయి. అంతేకాదు పర్యావరణానికి నష్టం చేయకూడదనే ఆలోచనతో పాత దుస్తులకే కొత్త హంగులు అద్దుతారామె. 


మగవాళ్ల దుస్తుల డిజైనిగ్‌ వైపు

కాలేజీ రోజుల్లో ప్రియ ఆడవాళ్ల దుస్తుల డిజైన్‌ చేసేవారు. కానీ మగవాళ్ల ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయాలనే ఆసక్తితో మెన్స్‌వేర్‌ డిజైనర్‌గా మారారు. మూడేళ్ల క్రితం తన పేరుతోనే సొంత బ్రాండ్ల తయారీ మొదలెట్టిన ప్రియ తన ఫొటో బుక్‌ ‘స్వీట్‌ లస్సీ’తో అందరినీ ఆకర్షించారు. మగవాళ్ల దుస్తుల అంశంపై మాస్టర్‌ డిగ్రీ అందుకున్న ప్రియా ఆ పుస్తకంలో నైజీరియా, ఇండియాలో చూడదగ్గ ప్రదేశాల గురించి కూడా రాసుకొచ్చారు. మూలన పడి ఉన్న వస్త్రాలకు వన్నె తేవడం, పాత  ఫ్యాషన్‌కు కొత్త సొబగులు అద్దడంలో నిపుణురాలైన ప్రియ లాగోస్‌లో ఉంటున్న తన కుటుంబాన్ని చూడటానికి వెళ్లినప్పుడు తనకు సుస్థిర డిజైన్ల మీద ఆసక్తి పెరిగిందని చెబుతారు. అప్పుడే నా దృష్టి భారతదేశంలో దుస్తుల రీసైక్లింగ్‌కు పేరొందిన పానిపట్టు మీద పడింది. అక్కడికి వెళ్లాక మనం కొత్త డిజైన్ల పేరుతో ఎంత వస్త్రాన్ని వృథా చేస్తామో కళ్లారా చూసి ఆందోళన చెందాను. పానిపట్టును సందర్శించడం నా జీవితాన్ని మార్చేసింది. అప్పుడే సుస్థిర విధానాలతో సొంత బ్రాండ్‌కు రూపమివ్వాలనే నిర్ణయానికి వచ్చాను’’అని తన ప్రయాణం మొదలైన తీరును వివరిస్తారు ప్రియ. 


మార్పుకి వారధిగా నిలవాలనే

సస్టెయినబుల్‌ సూత్రానికి కట్టుబడి, వివిధ వర్గాల ప్రజల వేషధారణను ప్రతిబింబిస్తూ సమాజంలో మార్పుకి నాంది పలుకుతున్న డిజైనర్లను అభినందించాలనే ఉద్దేశంతో ఎలిజబెత్‌ రాణి 2 ‘బ్రిటిషు డిజైన్‌’ అవార్డును నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. విజేతలకు ఇచ్చే ట్రోఫీని రాణి వ్యక్తిగత డిజైనర్‌ అంగేలా కెల్లీ రూపొందించారు. ఈ అవార్డుకు ప్రియను ఎంపిక చేయడానికి కారణం....అమ్ముడుపోని దుస్తులను, పాతకాలం నాటి వస్త్రాన్ని ప్రియ ప్రస్తుత ఫ్యాషన్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దుతారు. పదేళ్లలో మీ బ్రాండ్‌ ఎంతటి స్థాయిలో ఉండబోతుంది అనే ప్రశ్నకు ‘‘నేను మగవాళ్ల దుస్తులను డిజైన్‌ చేస్తాను. అయితే ఇంకా చాలా విషయాల్లో నేను అడుగుపెట్టాల్సి ఉంది. మహిళల దుస్తులు, అలంకరణ సామగ్రి, ఇంటివద్ద ధరించే దుస్తులు అంటే నాకు చాలా ఇష్టం. అయితే నేను ఎప్పుడూ సమాజంలో వివిధ వర్గాల ప్రజల ఆశలకు వారధిగా నిలిచే ఆసక్తికరమైన ప్రాజెక్టులు, పుస్తకాలు, సినిమాలు తేవాలనుకుంటా! ఫ్యాషన్‌ రంగంలో సానుకూల మార్పు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటాను. అదే సమయంలో నవ్వుతూ నా పని నేను చేసుకుంటూ పోతాను’’ అంటున్న ఈ యంగ్‌ డిజైనర్‌ నిజంగానే కొత్తదారి చూపుతున్నారు.

Updated Date - 2021-03-03T05:38:52+05:30 IST