రాజ్యసభలో రభస

ABN , First Publish Date - 2020-09-21T07:07:25+05:30 IST

కేంద్రం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై ఆదివారంనాడు రాజ్యసభ హోరెత్తిపోయింది. అరుపులు, కేకలు, నినాదాలతో దాదాపు మూడున్నర గంటలపాటు సభ రణరంగాన్ని తలపించింది...

రాజ్యసభలో రభస

  • బిల్లు పత్రాలను చించి.. ఉప సభాపతిపైకి విసిరి
  • రూల్‌ పుస్తకాన్ని విసిరి.. పోడియంపైకి ఎక్కి
  • పెద్దల సభలో సభ్యుల రచ్చ.. రచ్చ
  • అరుపులు, నినాదాలతో హోరెత్తిన సభ
  • హైడ్రామా మధ్య వ్యవసాయ బిల్లులకు ఓకే 
  • మూజువాణి ఓటుతో గట్టెక్కించిన కేంద్రం
  • ప్రతిపక్షాల డిమాండ్లు తిరస్కరణ
  • ఆడియో కట్‌.. కొద్దిసేపు ప్రసారం నిలిపివేత
  • డిప్యూటీ చైర్మన్‌కు రక్షణగా నిలిచిన మార్షల్స్‌
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: విపక్షం
  • డిప్యూటీ చైర్మన్‌పై 12 పార్టీల అవిశ్వాసం
  • ‘అనుచిత సభ్యుల’పై చర్య.. సర్కారు యోచన
  • పరిణామాలపై వెంకయ్య మనస్తాపం


సాగులో పెద్ద మలుపు

దేశ వ్యవసాయరంగ చరిత్రలో ఇదో పెద్ద మలుపు. ప్రతికూలతల నుంచి రైతులను ఈ బిల్లులు విముక్తం చేస్తాయి. కనీస మద్దతు ధర యథాతథంగా ఉంటుంది. సరుకుల కొనుగోలు విధానమూ కొనసాగుతుంది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి దీన్ని ఉద్దేశించాం. 

- ట్విటర్‌లో ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): కేంద్రం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై ఆదివారంనాడు రాజ్యసభ హోరెత్తిపోయింది. అరుపులు, కేకలు, నినాదాలతో దాదాపు మూడున్నర గంటలపాటు సభ రణరంగాన్ని తలపించింది. దేశ వ్యవసాయరంగ రూపురేఖల్ని మార్చే ఈ బిల్లులను తీవ్రంగా నిరసిస్తున్న విపక్షాలు అవి ఆమోదం పొందకుండా అడ్డుకోడానికి శతథా ప్రయత్నించాయి. ప్రభుత్వం ఖాతరు చేయకుండా మూజువాణి ఓటుతో రెండు బిల్లులకు సభామోదం సాధించింది. సంఖ్యాబలం ఉన్నప్పటికీ మూజువాణి ఓటు మార్గాన్నే ఎంచుకుంది తప్ప ఓటింగ్‌కు అనుమతించలేదు. ఇది విపక్షాలకు తీవ్ర ఆగ్రహ కారణమైంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, కాంగ్రెస్‌, సీపీఎం సభ్యులు సభ మధ్యలోకి దూసుకొచ్చి- ఓ దశలో స్పీకర్‌ పోడియంపైకి కూడా ఎక్కడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో సభ నిర్వహిస్తున్న ఉపసభాపతి హరివంశ్‌ దగ్గరకు - తృణమూల్‌ నేత డెరిక్‌ ఒబ్రెయిన్‌ వచ్చి సభా నియమాలకు సంబంధించిన పుస్తకాన్ని అటూ ఇటూ ఊపి- చించి, ఆయనపైకి విసిరేశారు. అది హరివంశ్‌కు తగలకుండా మార్షల్స్‌ అడ్డుకున్నారు. ఇక డీఎంకే సభ్యుడు తిరుచి శివ- బిల్లు పత్రాల్ని చించేసి విసిరేశారు.


ఒబ్రెయిన్‌, శివ, కాంగ్రెస్‌ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌, సీపీఎం సభ్యుడు కే రాగేష్‌ పోడియంలోకి దూసుకెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసించారు. సభాపతి మైక్‌ను విరిచేయడానికి కూడా శివ, మరొకరు ప్రయత్నించినా మార్షల్స్‌ అడ్డుకున్నారు. పోడియం మీదకెక్కిన సభ్యులను బలవంతంగా దింపేశారు. ఈ రభస సాగుతున్నంత సేపూ సభలో ఉన్న సభ్యులంతా లేచి అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు తప్ప సీట్లలో లేరు. 


గొడవ మొదలైందిలా..

ఉదయం రాజ్యసభ మొదలైనపుడే రభస తప్పదన్న సంకేతాలు వచ్చాయి. బిల్లులను వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ ప్రవేశపెట్టాక- అందులో లోపాలు, నష్టాలు ప్రస్తావిస్తూ దాదాపు విపక్ష సభ్యులందరూ వ్యతిరేకించారు. దేశ రైతాంగానికిది మరణ శాసనమేనని, దీనిపై తాము సంతకం చేయదలుచుకోలేదని చర్చ ప్రారంభించిన కాంగ్రెస్‌ సభ్యుడు ప్రతా్‌పసింగ్‌ బజ్వా తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయాధారిత దేశాన్ని కార్పొరేటీకరిస్తున్నారని విపక్ష సభ్యులు మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పినదానికి భిన్నంగా ప్రవర్తిస్తోందని, ఇది ఆ పార్టీ కపట వైఖరిని బయటపెడుతోందని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అనడంతో కాంగ్రెస్‌ సభ్యులు కస్సుమన్నారు. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. అటు  ప్రభుత్వం మాత్రం-   ఈ బిల్లులు దళారీ వ్యవస్థను అంతం చేసి, రైతులకు కష్టాల నుంచి విముక్తి చేస్తాయని, వారి ఆదాయం రెట్టింపు అవుతుందని వాదించింది.


బిల్లులపై అందరూ మాట్లాడేసరికి సభా సమయం మించిపోయింది. బిల్లులను ఆదివారమే నెగ్గించుకొని ఈ తంతు పూర్తిచేయాలన్న సంకల్పంతో ఉన్న అధికార పక్షం - సభా సమయాన్ని కాస్త పెంచాలన్న ప్రతిపాదన తెచ్చింది. దాంతో హరివంశ్‌ సభాసమయాన్ని మరో గంట పెంచారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. పార్టీల ఏకాభిప్రాయం కోరకుండా- ఏకపక్షంగా సమయాన్ని పొడిగించడం నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్‌ పక్ష నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. చర్చను సోమవారానికి వాయిదా వేయాలని పట్టుబట్టాయి. కానీ డిప్యూటీ స్పీకర్‌ హరివంశ్‌ ససేమిరా అన్నారు. 3 గంటలకు లోక్‌సభ సభ్యుల్లో కొందరు వచ్చి రాజ్యసభలో కూర్చోనున్నందున ఈలోగా సభను శానిటైజ్‌ చేయాలని, అందుకు సహకరించాలని ఆయన కోరారు. 


అప్పటికే కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, లెఫ్ట్‌ సభ్యులు - ఈ బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న నోటీసులిచ్చారు. వాటికోసం డిమాండ్‌ చేస్తుండగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్‌ సభను 15 నిమిషాల సేపు వాయిదా వేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులంతా బయటకు వెళ్లకుండా సభలోనే బైఠాయించారు. మధ్యాహ్నం 1:41 గంటలకు సభ మళ్లీ సమావేశమైంది. మళ్లీ అదే తీరు... గందరగోళం. బిల్లులపై వ్యవసాయ మంత్రి తన సమాధానాన్ని సగంలోనే ఆపేశారు. వెంటనే డిప్యూటీ స్పీకర్‌ బిల్లుల ఆమోదాన్ని మూజువాణి ఓటు ద్వారా చేపట్టే పని మొదలెట్టారు.  బిల్లుకు సంబంధించిన క్లాజులు చదువుతుండగానే డెరిక్‌ ఒబ్రెయిన్‌, తిరుచ్చి శివ, కేసీ వేణుగోపాల్‌, కే రాగేష్‌... పోడియంలోకి దూసుకెళ్లారు. టీఆర్‌ఎస్‌, ఎస్పీ, ఆర్జేడీ మిగిలిన సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు. అప్పుడు గొడవ పతాకస్థాయికి చేరింది. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. దాంతో హరివంశ్‌ కాసేపు మైకులన్నీ బంద్‌ చేయించారు. కొద్ది సేపు ప్రసారాలూ ఆగిపోయాయి. అయితే విపక్షాల నిరసనలకు తలొగ్గి ఆయన వెంటనే వాటిని ఆన్‌ చేయించారు. డివిజన్‌ (ఓటింగ్‌) జరపాలని ప్రతిపక్షాలు పదేపదే కోరాయి.  హరివంశ్‌ నో అనడంతో విపక్ష సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్పీకర్‌వైపు, సభాధికారులు కూర్చున్న వైపు దూసుకెళ్లారు. చివరకు ఆ గందరగోళం మధ్యే బిల్లులు మూజువాణి ఓటుకు పెట్టి హరివంశ్‌ వాటికి సభామోదం లభించిందని ప్రకటించేశారు. సభ వాయిదా పడ్డాక కూడా విపక్ష సభ్యులు కాసేపు సభలోనే బైఠాయించారు.


బీజేపీకి మిత్రపక్షాలు దూరం

వ్యవసాయ బిల్లులపై బీజేపీ రెండు మిత్రపక్షాలను దూరం చేసుకుంది. ఈ బిల్లులను బీజేపీ, జనతాదళ్‌ (యు), వైసీపీ మాత్రమే పూర్తిగా సమర్థించాయి. మిత్రపక్షాల్లో ఒకటైన శిరోమణి అకాలీదళ్‌, బీజేపీకి ఇప్పటి వరకూ మద్దతునిస్తున్న అన్నాడీఎంకే తీవ్రంగా వ్యతిరేకించాయి. శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌ సిమ్రత్‌ సింగ్‌ బాదల్‌ తన మంత్రిపదవికి ఇప్పటికే రాజీనామా చేిశారు. తటస్థంగా ఉంటూనే బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న బిజూజనతాదళ్‌ (బీజేడీ) బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపమని కోరింది. అన్నాడీఎంకే  కూడా ఈ బిల్లులను కార్పోరేటీకరణగా అభివర్ణించింది. 

ఇక కాంగ్రెస్‌, ఆర్జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, సిపిఐఎం, టీఆర్‌ఎస్‌, శివసేన, ఆమ్‌ ఆద్మీ పారీ,్ట జేడీ(ఎస్‌), ఎస్పీ  బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆదివారం ఉదయమే ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ప్రఽధాని, జనతాదళ్‌ (ఎస్‌) నేత దేవెగౌడ తొలి ప్రసంగంలోనే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అయితే ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకుని డిప్యూటీ చైర్మన్‌ మరొకరికి అవకాశం ఇచ్చారు. 


నియమాలను ఉల్లంఘించిన ఉపసభాపతి: విపక్షాలు

డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ 12 ప్రతిపక్ష పార్టీలు ఆయనపై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌, డీఎంకే, ఆర్జేడీ, తెలంగాణా రాష్ట్ర సమితి, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, జేడీఎస్‌, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం ఈ నోటీసుపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్‌ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ చెప్పారు. సభా సమయం మించిపోయినా ఏకపక్షంగా గంట పొడిగించడం, ఓటింగ్‌కు కోరినా తిరస్కరించడం దీనికి కారణాలన్నారు. బిల్లుల ఆమోదంలో హరివంశ్‌ అనుసరించిన తీరు సభా నియమాలను ఉల్లంఘించడమేనని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాల్సిన డిప్యూటీ స్పీకరే ఈ విధంగా ప్రవర్తించారని, ఆయన వైఖరికి నిరసనగానే ఈ అవిశ్వాస నోటీసిచ్చామని అహ్మద్‌ పటేల్‌ తెలిపారు. రెండోసారి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన, జేడీయూకు చెందిన హరివంశ్‌ కేవలం వారం కిందటే- 14వ తేదీనే బాధ్యతలు చేపట్టారు. 


రభస చేసిన సభ్యులపై వేటు..?

సభలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించి ఉపసభాపతిపైకి దూసుకెళ్లి ‘అనుచితంగా ప్రవర్తించిన’ ప్రతిపక్ష సభ్యులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  రాజ్యసభ ముగిశాక ఉపసభాపతి హరివంశ్‌, కేంద్రమంత్రులు పీయూశ్‌ గోయల్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, సీనియర్‌ బీజేపీ సభ్యులు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుణ్ణి ఆయన నివాసంలో కలిశారు. జరిగిన పరిణామాలను వివరించారు. దీనిపై వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదనను, మనస్తాపాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉప సభాపతిని హేళన చేస్తూ, ఆయనపైకి కాగితాలు విసిరేసిన ఘటనలకు పాల్పడ్డ విపక్ష సభ్యులపై చర్య తీసుకోవాలని మంత్రులు కోరారు. వెంకయ్య నివాసంలో సమావేశం ముగిశాక వారు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. 12 విపక్షాలు డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాసం ఇవ్వడంతో సోమవారంనాడు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. డెరిక్‌ ఒబ్రెయిన్‌ (తృణమూల్‌), తిరుచ్చి శివ (డీఎంకే), రిపున్‌ బోరా (కాంగ్రెస్‌), సంజయ్‌ సింగ్‌ (ఆప్‌), రాగేశ్‌ (సీపీఎం)లను, పోడియంలోకొచ్చి హరివంశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని సస్పెండ్‌ చేసే అవకాశాలున్నట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-09-21T07:07:25+05:30 IST