Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్షర సైనికులు

వారాంతంలో బస్తీల్లో సేవలు

ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు

పేదల కోసం ఆరోగ్య శిబిరాలు

వసుధైక కుటుంబమే లక్ష్యంగా స్టూడెంట్‌ సోషల్‌ సర్వీస్‌


హైదరాబాద్/బంజారాహిల్స్‌: చదువు, ఎంజాయ్‌ కాలేజీ డేస్‌లో కుర్రాళ్లు అవలంబించే తీరు. ప్రస్తుతం పరిస్థితి మారింది. చదువుకు అర్థం ఉండాలని యువత భావిస్తోంది. మానవ సేవే మాధవసేవ అన్న  వివేకానందస్వామి సూక్తిని ఆశయంగా తీసుకొని ముందడుగువేస్తున్నారు. మేం బాగుండాలి.. చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉండాలనే భావనతో కుర్ర దుర్గారావు స్టూడెంట్‌ సోషల్‌ సర్వీస్‌ పేరిట సంస్థను స్థాపించాడు. లీడ్‌ వరల్డ్‌ 2050 పేరిట కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. బస్తీల్లో జీవన శైలిని మార్చే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్కడితో మొదలై ఇప్పుడు సంస్థలో అనేక మంది ప్రతినిధులు వచ్చి చేరారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పడం, పేదల ఆరోగ్యం బాగు కోసం ఉచిత వైద్య శిబిరాలు, బస్తీల్లో సమస్యలను పరిష్కరిస్తూ సేవలు అందిస్తున్నారు సంస్థ ప్రతినిధులు.


అంతా చదువుకున్న వారే

ప్రస్తుత సమాజంలో ఎంతమంది ప్రతినిధులు వచ్చినా.. ఎన్ని విరాళాలు సేకరించినా బస్తీలో జీవన పరిస్థితులు మార్చాలంటే ఇంకా శ్రమించాల్సిందేనని గుర్తించాడు. ఈ క్రమంలో సంస్థలో ప్రతినిధుల సంఖ్య పెంచే దిశగా యువతలో స్ఫూర్తి కలిగించారు. బీటెక్‌ పూర్తయింది.. ఇక ఉద్యోగమే.. ఆ వెంటనే పెళ్లి ఇదే జీవితం కాదన్న సత్యాన్ని సంస్థ ప్రతినిధులు తెలుసుకున్నారు. ఉద్యోగం చేసుకుంటూ సేవ బాట పడ్డారు. బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ పూర్తి చేసిన అనేక మంది దుర్గారావు భావాలకు అండగా ఉంటూ తమ వంతు సహాయం చేస్తున్నారు.


 పేదలకు చదువు

నిరక్షరాస్యత పోతే జీవన చిత్రాలు మారతాయనే సూత్రాన్ని నమ్మిన స్టూడెంట్‌ సోషల్‌ సర్వీస్‌ ప్రజల్లో అక్షర చైతన్యం తీసుకువచ్చే బాధ్యతను తీసుకుంది. 2012లో రాత్రి స్కూల్స్‌ నిర్వహించింది. కొద్ది రోజులకు దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతుండటంతో తమ విజన్‌ మార్చుకోలేదు. విద్యావంతులైన యువకులు స్వయంగా ఇళ్లకు వెళ్లి పేదలకు చదువు చెప్పారు. సంతకాలు పెట్టడం, పేర్లు చదవడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా విధానంలో లోపాన్ని గ్రహించారు. వారే ఉపాధ్యాయులుగా మారి  ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు కొత్త తరహా పాఠాలు బోధించారు. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, భవిష్యత్‌ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై వివరిస్తున్నారు. ఆంగ్లం, గణితం, కంప్యూటర్‌ తదితర అంశాల గురించి వీకెండ్‌లో తరగతులు నిర్వహిస్తారు. బస్తీ వాసుల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని కార్పొరేట్‌ ఆస్పత్రులను సంప్రదించి ప్రతి ఆదివారం వైద్యులతో పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేస్తున్నారు. 


రోజుకో రూపాయి

సేవ అనగానే కొంత డబ్బు అవసరమవుతుంది. రంగారావు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. మనసుంటే మార్గం ఉంటుందని భావించిన ఆయన రోజుకో రూపాయికి ప్రచారం కల్పించారు. ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాలలకు తిరిగి రోజుకో రూపాయి చొప్పున వారానికి ఐదు రూపాయలు విరాళంగా ఇస్తే బస్తీ పేదల్లో చిరునవ్వులు చూడవచ్చని చెప్పారు. దీనికి విద్యార్థులంతా అంగీకరించారు. సంస్థ తరఫున ఓ లీడర్‌ను పెట్టి విరాళాలు సేకరించి వచ్చిన వాటితో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులు, పెన్సిల్స్‌, పెన్నులు, యూనిఫారాలు, షూస్‌ ఇలా కావాల్సిన వస్తువులు కొనిస్తారు. 


బస్తీల్లో సమస్యలపై..

తమ సేవలను మరింత అర్థవంతంగా తీర్చిదిద్దాలని భావించిన లీడ్‌ వరల్డ్‌ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో బెనోవెలెంజ్‌ సంస్థను ఏర్పాటు చేసింది. వసుధైక కుటుంబం పేరిట ప్రతి శని, ఆదివారాల్లో బస్తీల్లో తిరుగుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఓ నివేదికగా రూపొందించి వాటిని పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తారు. అధికారులు, ప్రజా ప్రతినిఽధులతో సంప్రదించి సమస్యలను కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులనే బస్తీలకు తీసుకువచ్చి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ఆస్కారం కలిగిస్తున్నారు. 


సేవలో అందరూ భాగస్వాములు కావచ్చు

సమాజ సేవ చేయాలనే ఆలోచన ఉన్న యువత ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా స్టూడెంట్‌ సోషల్‌ సర్వీ్‌సలో చేరవచ్చు. సేవలో అందరూ భాగస్వాములు కావచ్చు. రూపాయి నినాదానికి మరింత విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. నగరంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలే కాకుండా జిల్లాల్లో విద్యార్థుల నుంచి రోజుకో రూపాయి విరాళంగా సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అనేక బస్తీలు చీకట్లో ఉండిపోతున్నాయి. అక్కడ వెలుగులు ప్రసరింపచేసేలా చదువుకున్న వారు చొరవ తీసుకుంటే బాగుంటుంది. 

- కుర్ర దుర్గాప్రసాద్‌ 


సేవ చేయడం తృప్తినిస్తోంది 

వీకెండ్‌లో సినిమాలు, షికార్లు అని కాకుండా బస్తీలో సేవ చేసేందుకు  వెళ్లడం తృప్తినిస్తోంది. తన చదువును పంచడం వల్ల ఎంతోమంది ప్రయోజకులను చేసే అవకాశం కలుగుతోంది. బస్తీ జీవన చిత్రం మారాల్సి ఉంది. అక్షరాస్యులంతా ఏకం అయితేనే సాధ్యపడుతుంది. 

- రేణు మండలి


సదా మీ సేవలో..

చీకటి జీవితంలో అందరూ కోరుకునేది వెలుగు. ఆ వెలుగు నీడలో పదిమందినీ ఆహ్వానించే వారు కొందరుంటారు. అలాంటి వారు ఎందరో హృదయాల్లో పదిలంగా ఉంటారు. సదా మీ సేవలో అంటూ నేను ఐదేళ్లుగా ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నా. బస్తీలో ఉంటున్న వారి గురించి తెలియని విషయాలు కూడా తెలుసుకున్నా. ఇది నిజంగా నా చదువుకో అర్థం.

- తన్మయి

Advertisement
Advertisement