బీజేపీకి ఎదురు తిరిగిన చార్‌ధామ్ పూజారులు

ABN , First Publish Date - 2021-11-19T00:38:48+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ దేవాలయాల పూజారులు

బీజేపీకి ఎదురు తిరిగిన చార్‌ధామ్ పూజారులు

హృషీకేశ్ : ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ దేవాలయాల పూజారులు బీజేపీకి ఎదురు తిరిగారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. 2,500 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని ధిక్కరించి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసిందని, దీనికి వ్యతిరేకంగా తాము ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. చార్‌ధామ్ తీర్థ్ పురోహిత్ హక్ హకూక్‌ధారీ మహాపంచాయత్ సమితి గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను తెలిపింది. 


ఈ సంఘం అధ్యక్షుడు కృష్ణకాంత్ కోటియాల్ మాట్లాడుతూ, రానున్న ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికల్లో 15 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను నిలుపుతామని చెప్పారు. మిగిలినవాటిలో చాలా స్థానాల్లో తాము ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన దేవస్థానం బోర్డుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. 2,500 సంవత్సరాలనాటి సంప్రదాయాలకు బీజేపీ ఏ విధంగా తెర దించిందో వివరిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ హక్కులను అతిక్రమించిందన్నారు. గైర్‌సైన్‌లో జరిగే శాసన సభ సమావేశాల సమయంలో తాము శాసన సభను ముట్టడిస్తామని తెలిపారు. 


పూజారులకు ఆగ్రహం ఎందుకు?

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ పని చేసిన కాలంలో చార్‌ధామ్ దేవస్థానం బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు పరిధిలోని దేవాలయాలు, పుణ్య క్షేత్రాలను  నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని ఆమోదింపజేశారు. ఈ బోర్డుకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రంలోని 51 దేవాలయాలపై ఈ బోర్డుకు నియంత్రణాధికారాలు కల్పించారు. కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి కూడా ఈ బోర్డు పరిధిలోకి వచ్చాయి. దేవాలయాలకు వచ్చే నిధులు, ఆదాయం, ఆస్తులపై పూర్తి స్థాయిలో నియంత్రణ సాధించేందుకు ఈ బోర్డును ఏర్పాటు చేశారు. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను క్రమబద్ధీకరించడం దీని ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటి. 


ఈ బోర్డు ఏర్పాటును మొదటి నుంచి చార్‌ధామ్ పూజారులు వ్యతిరేకిస్తున్నారు. ఇది తమ సంప్రదాయ హక్కులను అతిక్రమిస్తోందని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దేవాలయాల్లో చాలావాటిని తీర్థ పురోహితులు నిర్వహించేవారు. ఈ దేవాలయాలకు వచ్చే ఆదాయం, నిదులపై వీరికే నియంత్రణ ఉండేది. భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన, ఆధునికీకరణ వంటివాటి కోసం వీరే ఈ నిధులను వినియోగించేవారు. కొత్తగా బోర్డు రావడంతో వారి అధికారాలకు గండిపడింది. హుండీ ద్వారా లభించే సొమ్ములో పూజారులకు వాటా ఇవ్వడాన్ని ఈ చట్టం నిషేధించింది. అదే సమయంలో వారికి జీతాలు చెల్లించేందుకు ఎటువంటి నిబంధనను చేర్చలేదు. పూజారులకు బోర్డు ఆదేశాలు ఇస్తుందని, వాటిని పాటించని పూజారులను విధుల నుంచి తొలగించవచ్చునని ఈ చట్టం చెప్తోంది. దేవాలయ భూములు, ఆస్తులపై ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్న ఈ చట్టం వల్ల భవిష్యత్తులో తమ పూర్వీకుల ఇళ్ళ నుంచి తమను ఖాళీ చేయించే అవకాశం ఉందని పూజారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-11-19T00:38:48+05:30 IST