గ్రానైట్‌కు చార్జీల గుదిబండ

ABN , First Publish Date - 2021-08-01T05:49:00+05:30 IST

కరోనా ప్రారంభం నుంచి మొదలైన గ్రానైట్‌ మార్కెట్‌ కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.

గ్రానైట్‌కు చార్జీల గుదిబండ
చీమకుర్తి వద్ద ఉత్పత్తి నిలిచిపోయి ఉన్న గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీ (ఇన్‌సెట్‌లో) ఫ్యాక్టరీలో పేరుకుపోయిన గ్రానైట్‌ స్లాబులు

సంక్షోభంలో స్లాబు మార్కెట్‌

భారీగా పెరిగిన సముద్ర రవాణా చార్జీలు

డీజిల్‌ ధర, అదనపు పన్నుల భారం

కొనుగోలుకు ముందుకురాని బయ్యర్లు

రోజురోజుకూ పడిపోతున్న ధర 

ఫ్యాక్టరీల్లో మూలుగుతున్న సరుకు

ఉత్పత్తి ప్రక్రియలోనూ మందగమనం

ఫ్యాక్టరీలు నడపలేక యజమానులు విలవిల

కరోనా ప్రారంభం నుంచి మొదలైన గ్రానైట్‌ మార్కెట్‌ కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. అధిక గిరాకీ, ఇటీవల ప్రభుత్వం విధించిన అదనపు పన్నులతో ముడిరాయి ధర పెరిగింది. అలాగే  డీజిల్‌ రేట్లు భారమయ్యాయి.  వీటితోపాటు జగన్‌ పాదయాత్ర నాటి రాయితీ హామీలు అమలుకు నోచుకోకపోవటం, ఉత్పత్తి ఖర్చులు పెరిగి కష్టాల సుడిగుండంలో ఉన్న స్లాబు మార్కెట్‌కు ఇటీవల భారీగా పెరిగిన సముద్ర రవాణా చార్జీలు శారాఘాతంలా మారాయి.  ఇదే సమయంలో స్లాబుల ధర అడుగుకు రూ.20 క్షీణించింది.  వచ్చిన ధరకు అమ్ముకోవాలని చూసినా బయ్యర్లు ముందుకు రావడం లేదు. దీంతో స్లాబులు ఫ్యాక్టరీల్లో మూలుగుతున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీలో లక్షల విలువ చేసే సరుకు ఉండిపోవడంతో ఉత్పత్తి ప్రక్రియకు బ్రేక్‌  పడుతోంది. కిస్తీలు కట్టలేక, ఫ్యాక్టరీలు నడపలేక యజమానులు విలవిల్లాడుతున్నారు. అదేసమయంలో ముడిరాయి రవాణా కూడా కొద్దిరోజులుగా నిలిచిపోయింది. 

చీమకుర్తి, జూలై 31 : ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్‌ పరిశ్రమకు అనుబంధంగా కటింగ్‌ అండ్‌ పాలిషింగ్‌ ఫ్యాక్టరీలు జిల్లావ్యాప్తంగా విస్తరించాయి. క్వారీల నుంచి ముడిరాళ్లను కొనుగోలు చేసి పాలిషింగ్‌ ఫ్యాక్టరీల్లో ప్రాసెసింగ్‌ చేస్తారు. అనంతరం స్లాబులను కంటైనర్ల ద్వారా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఎగుమతి చేసి ఫ్యాక్టరీ ఓనర్లు లాభాలు గడిస్తుంటారు. బ్యాంకు రుణాలు విరివిగా ఇవ్వటం, మంచి లాభసాటి వ్యాపారంగా కనిపించటంతో, యువత పెద్దఎత్తున ఈ అనుబంధ పరిశ్రమ వైపు మొగ్గారు. ఉద్యోగాలు మానుకొని వచ్చి ఫ్యాక్టరీలు నిర్మించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉన్నారు. దీంతో ఇబ్బడిముబ్బడిగా ఫ్యాక్టరీలు వెలిశాయి. చీమకుర్తి, బూదవాడ, ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌, గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌, బల్లికురవ, మార్టూరు తదితర ప్రాంతాల్లో 1,800కుపైనే కటింగ్‌ ఫ్యాక్టరీల్లో గ్రానైట్‌ స్లాబుల ఉత్పత్తి జరుగుతుంది. ఇరవై వేల మందికిపైగా కార్మికులకు ఉపాధి లభిస్తుంది.


సముద్ర రవాణా చార్జీలు భారీగా పెంపు

ఫ్యాక్టరీల నుంచి బయ్యర్లు కొనుగోలు చేసిన గ్రానైట్‌ స్లాబులను కంటైనర్లలో నింపి వాటిని ట్రాలీలపై కృష్ణపట్నం, చెన్నై పోర్టులకు తరలిస్తారు. అక్కడ నుంచి ఈ కంటైనర్లలో ఉన్న సరకును ఓడల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎక్కువగా వియత్నాం, గల్ఫ్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఈజిప్ట్‌, యూరప్‌ దేశాలకు గ్రానైట్‌ శ్లాబులు జిల్లా నుంచి ఎగుమతి అవుతాయి. ఎక్కువగా రవాణా అయ్యే వియత్నాంలో కరోనా కల్లోలంతో డిమాండ్‌ భారీగా తగ్గి బయ్యర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మరోవైపు కంటైనర్లకు డిమాండ్‌ పెరిగి కొరత ఏర్పడింది. సముద్ర రవాణాను కంటైనర్ల ద్వారా గతంలో ఆరు సంస్థలు వరకు నిర్వహించేవి. ప్రస్తుతం రెండే సంస్థలు మిగలటం, అవి రెండూ కలిసిపోయి రవాణా చార్జీలను భారీగా పెంచటంతో బయ్యర్లు ముందుకు రావడం లేదు. దీంతో కొనుగోళ్లలో మందగమనం ఏర్పడింది. సరుకు ఫ్యాక్టరీల్లోనే ఉండిపోయి ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.

 

అడుగుకు రూ.50పైన భారం

ఒక్కో కంటైనర్‌లో 4,200 అడుగుల గ్రానైట్‌ శ్లాబులను రవాణా చేస్తారు. దగ్గరలోనే ఉన్న వియత్నాం దేశంకు ఒక్కో కంటైనర్‌ రవాణాకు కృష్ణపట్నం, చెన్నై పోర్టు నుంచి వంద డాలర్లను గతంలో వసూలు చేస్తుండగా ఇపుడు 500 డాలర్ల దాకా పెంచారు. ఇక మిగతా దేశాలకు రవాణా చార్జీలు భారీగానే వసూలు చేస్తున్నారు. గతంలో 700 డాలర్లు ఉన్న చార్జీని ఏకంగా 3,700 డాలర్లకు పెంచేశారు. అంటే ఒక్కో కంటైనర్‌కు 3వేల డాలర్లు (మన నగదులో రూ.2.30లక్షలు) అదనంగా భారం పడుతోంది. అంటే అడుగుకు రూ.50పైగా భారం పడుతున్న పరిస్థితుల్లో స్లాబులను కొనుగోలు చేయటానికి బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా జిల్లా నుంచి గతంలో నెలకు దాదాపు 3500 కంటైనర్లు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం ఈ సంఖ్య వెయ్యికిలోపు పడిపోయింది. 


బ్లాక్‌ల పరిస్థితీ అంతే

గ్రానైట్‌ బ్లాక్‌లు (ముడిరాళ్ల)కు గతంలో రవాణా చార్జి టన్నుకు 16 డాలర్లు ఉండగా, ఇప్పుడు  46డాలర్లకు పెంచారు. ఒక క్యూబిక్‌ మీటర్‌కు 8 టన్నులు ఉంటుంది. ఆ ప్రకారం క్యూబిక్‌ మీటర్‌కు 250 డాలర్ల వరకూ పెరిగింది. దీంతో దాదాపు రూ.18,500 వరకూ భారం పడుతోంది. దీంతో బియ్యర్లు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. రవాణా చార్జీలు విపరీతంగా పెరగటానికి, కంటైనర్ల కొరతకు చైనా తీరు ప్రధాన కారణంగా ఉంది. కరోనా పరిస్థితులు ఆ దేశంలో చక్కపడటంతో మన దేశం నుంచి ముడిరాళ్లను దిగుమతి చేసుకొని పెద్ద ఎత్తున నిల్వ చేసి గ్రానైట్‌ స్లాబులను అక్కడి ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటన్నింటినీ ఇతర దేశాలకు ఎగుమతి చేయటానికి కంటైనర్లను, సముద్ర రవాణాను తన ఆధీనంలోకి తీసుకోవటంతో మనకు కొరత ఏర్పడింది. 





Updated Date - 2021-08-01T05:49:00+05:30 IST