వైభవంగా రథోత్సవం

ABN , First Publish Date - 2021-04-17T06:24:23+05:30 IST

అమ్మవారి నామస్మరణతో కొటిపి పురవీధులు మార్మోగాయి. వేలాది మంది భక్తుల మధ్య అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని జనం మధ్యలో ఊరేగింపుగా తీసుకొచ్చి రథోత్సవంపై కూర్చొబెట్టారు.

వైభవంగా రథోత్సవం
భక్తుల నడుమ ముందుకు సాగుతున్న రథం

-చౌడేశ్వరి నామస్మరణతో మార్మోగిన కొటిపి 

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 16: అమ్మవారి నామస్మరణతో కొటిపి పురవీధులు మార్మోగాయి. వేలాది మంది భక్తుల మధ్య అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని జనం మధ్యలో ఊరేగింపుగా తీసుకొచ్చి రథోత్సవంపై కూర్చొబెట్టారు. అనంతరం పూజారులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతిచ్చిన అనంతరం రథోత్సవాన్ని ముందుకు లాగారు. శుక్రవారం ఉదయం నుంచే అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి నామస్మరణతో వేద మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు లాగారు. ఈ రథోత్సవానికి హిందూపురం ప్రాంతం నుంచేకాక కర్నాటక నుంచి పెద్దఎత్తున తరలి వచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రథోత్సవాన్ని బెంగళూరు నుండి తీసుకొచ్చిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. రథోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం, మజ్జిగ నీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. 

ఘర్షణలో ఇద్దరికి గాయాలు 

కొటిపిలో శుక్రవారం జరిగిన చౌడేశ్వరీదేవి బ్రహ్మరథోత్సవం సందర్భంగా ఒక యువకుడివల్ల ఘర్షణ జరిగింది. కంచనపల్లికి చెందిన ఓ యువకుడు వాటర్‌ ప్యాకెట్‌తో విసరడంవల్ల ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అయితే వీరికి కొటిపికి చెందిన మరికొందరు తోడు కావడంతో కంచనపల్లి, కొటిపికి చెందిన యువకుల మధ్య గొడవజరిగి రాళ్లతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ తోపులాటలో అక్కడే ఉన్న మహిళకు గాయాలయ్యాయి. గమనించిన పోలీసులు గొడవకు కారకులైన వారిని అదుపులోకి తీసుకొని స్టేషనకు తరలించారు. కాగా మద్యం మత్తులో యువకులు గొడవకు దిగినట్లు సీఐ అస్రార్‌ బాష తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.


Updated Date - 2021-04-17T06:24:23+05:30 IST