నమ్మితే..నిలువునా అమ్మేశాడు

ABN , First Publish Date - 2021-01-14T07:05:45+05:30 IST

నకిలీ పత్రాలు సృష్టించాడు.. కంపెనీ చిరునామా మార్చేశాడు.. వాటితో ప్రైవేట్‌ బ్యాంకులో ఖాతా తెరిచాడు.. డైరెక్టర్లను ముందుపెట్టి.. రూ.7 కోట్ల విలువైన కంపెనీని రూ.81 లక్షలకు అమ్మేశాడు

నమ్మితే..నిలువునా అమ్మేశాడు

చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఘరానా మోసం

డైరెక్టర్‌లను అడ్డంపెట్టుకుని అక్రమం

రూ.7 కోట్ల సంస్థ రూ.81 లక్షలకు విక్రయం

కంపెనీ చిరునామా మార్చి బ్యాంకు ఖాతా

తాను ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త

ప్రత్యేక పార్టీ పోలీసుల దర్యాప్తుతో గుట్టురట్టు


హైదరాబాద్‌ సిటీ, జనవరి 13(ఆంధ్రజ్యోతి): నకిలీ పత్రాలు సృష్టించాడు.. కంపెనీ చిరునామా మార్చేశాడు.. వాటితో ప్రైవేట్‌ బ్యాంకులో ఖాతా తెరిచాడు.. డైరెక్టర్లను ముందుపెట్టి.. రూ.7 కోట్ల విలువైన కంపెనీని రూ.81 లక్షలకు అమ్మేశాడు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) ఘరానా మోసం ఇది. ఆలస్యంగా గుర్తించిన కంపెనీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ సమీపంలోని యానంపేటలో ఎకరన్నర స్థలంలో ఓ వ్యాపారి ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ ఇండియా ప్రై లిమిటెడ్‌ (ఈఈఐపీఎల్‌) పేరుతో కంపెనీ స్థాపించాడు. డ్రైవర్‌, అకౌంటెంట్‌నే డైరెక్టర్లుగా ఉంచాడు.


అతడి వద్ద సీఏగా పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన ఆనంద్‌ వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. డైరెక్టర్‌లుగా ఉన్న డ్రైవర్‌, అకౌంటెంట్‌లు ఆనంద్‌కు సన్నిహితులు. ఈ నేపథ్యంలో ముగ్గురూ కలిసి కంపెనీని మరో వ్యక్తి పేరుతో ఎస్‌పీఏ (స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ ఆటార్నీ) చేశారు. అనంతరం డ్రైవర్‌ సంస్థ డైరెక్టర్‌గా తప్పుకొన్నాడు. ఎస్‌పీఏ చేసుకున్న వ్యక్తి కంపెనీని మరో వ్యక్తికి రూ.81 లక్షలకు విక్రయించాడు. ఆ సందర్భంగా శ్రీనివా్‌సరెడ్డిని సాక్షుల్లో ఒకరిగా చూపారు. ఘట్‌కేసర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆగస్టులో ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ జరిగింది.


నకిలీ బ్యాంకు ఖాతా సృష్టించి

ఎస్‌పీఏ చేసుకున్న వ్యక్తి.. కంపెనీని కొన్న వ్యక్తి మధ్య లావాదేవీలన్నీ యాక్సిస్‌ బ్యాంకులో తీసిన ఖాతా ద్వారా జరిగాయి. ఈ ఖాతా తెరిచేందుకు కంపెనీ ప్రధాన కార్యాలయ చిరునామాను మార్చి.. సైదాబాద్‌లో ఓ షెడ్డు చిరునామా ఇచ్చారు. కొనుగోలుదారు ఇచ్చిన రూ.81 లక్షల చెక్కును ఎస్‌పీఏ చేసుకున్న వ్యక్తి ఖాతాలో వేసి డబ్బు తీసుకున్నారు. కాగా, ఖాళీ అయిన డైరెక్టర్‌ స్థానంలో.. యజమాని మరొకరిని నియమించడంతో డిసెంబరులో అక్రమం వెలుగులోకి వచ్చింది. యజమాని ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


విచారణ జాప్యం కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. స్పెషల్‌ పార్టీ పోలీసులు.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని సేల్‌ డీడ్‌ కాపీల ఆధారంగా కూపీ లాగారు. సాక్షుల్లో ఒకరైన శ్రీనివా్‌సరెడ్డి.. తనతో పాటు మరొకరిని పిలిపించి ఆనంద్‌ సంతకాలు చేయించినట్లు పోలీసులకు తెలిపారు. కాగా, ఆనంద్‌ ఎక్కడా బయటపడకుండా తతంగం నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అతడి కోసం రాచకొండ పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ చిరునామాతో ఖాతా తెరిచినందుకు బ్యాంకు అధికారులు కూడా ఆనంద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-01-14T07:05:45+05:30 IST