వెంటాడుతున్న కరోనా!

ABN , First Publish Date - 2022-01-25T06:33:55+05:30 IST

ఒకసారి కరోనా సోకినా, రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నా, ఇంకా చెప్పాలంటే బూస్టర్‌ డోసు కూడా వేయించుకున్నా...జాగ్రత్తగా లేకుంటే వైరస్‌ బారినపడక తప్పదంటున్నారు.

వెంటాడుతున్న కరోనా!

అజాగ్రత్తగా ఉంటే రెండోసారి, మూడోసారి కూడా వచ్చే అవకాశం ఉందంటున్న వైద్యులు

రెండు డోసులు తీసుకున్నా వైరస్‌ బారినపడే ప్రమాదం

ఒమైక్రాన్‌ బాధితుల్లో బూస్టర్‌ డోసు తీసుకున్నవారు కూడా ఉన్నట్టు వెల్లడి


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం) 


‘‘ఒకసారి కరోనా వచ్చింది. కాబట్టి, మళ్లీ వైరస్‌ సోకే అవకాశమే లేదు. అందువల్ల, ఎలా ఉన్నా పర్వాలేదు. మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదు, భౌతికదూరం పాటించనక్కర్లేదు...’ 

...ఇదీ కొంతమంది భావన. 

‘‘రెండు డోసులు వ్యాక్సినేషన్‌ వేయించుకున్నాం. కాబట్టి, ఏ వేరియంట్‌ అయినా దగ్గరకు రావాలంటే భయపడాల్సిందే. వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత ఎలా ఉన్నా ఏమీ కాదు’’ 

...ఇది మరికొంతమంది నోటి వెంట వినిపించే మాట. 


...అయితే, ఈ రెండు ఆలోచనలు పూర్తిగా తప్పు అని వైద్యులు పేర్కొంటున్నారు. ఒకసారి కరోనా సోకినా, రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నా, ఇంకా చెప్పాలంటే బూస్టర్‌ డోసు కూడా వేయించుకున్నా...జాగ్రత్తగా లేకుంటే వైరస్‌ బారినపడక తప్పదంటున్నారు. వైరస్‌ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకున్నామనో, ఒకసారి కొవిడ్‌ బారినపడ్డామనో...నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. 


వైరస్‌ సోకడం వల్ల గానీ, వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల గానీ శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఈ యాంటీబాడీలు శరీరంలో ప్రవేశించే కరోనా వైరస్‌పై పోరాడతాయి. అయితే, రకరకాలుగా రూపాంతరం చెందుతున్న వైరస్‌ను ఈ యాంటీబాడీలు గుర్తించకపోవడం వల్ల కొంతమంది రెండోసారి, మూడోసారి కూడా కరోనా బారినపడుతున్నారు. ఒకసారి కొవిడ్‌ వైరస్‌ సోకిన తరువాత మళ్లీ ఇన్నాళ్లపాటు సోకదని చెప్పడానికి వీలులేదని వైద్యులు పేర్కొంటున్నారు. అజాగ్త్రగా ఉంటే ఎప్పుడైనా వైరస్‌ బారినపడవచ్చునంటున్నారు. 


ఇమ్యునిటీ ఎస్కేప్‌.. 

సాధారణంగా ఒకసారి వైరస్‌ సోకినా, వ్యాక్సిన్‌ తీసుకున్నా శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. దీన్నే వ్యాధి నిరోధక శక్తిగా కూడా చెబుతారు. అయితే, ఇమ్యూనిటీ నుంచి తప్పించుకుని...శరీరంపై ప్రభావం చూపగలిగే సామర్థ్యాన్ని కొవిడ్‌ వైరస్‌కు చెందిన కొన్ని మ్యుటెంట్లు కలిగి ఉంటున్నాయి. అటువంటి వాటిలో తాజాగా వ్యాప్తి చెందుతున్న ఒమైక్రాన్‌, గతంలో డెల్టా, డెల్టా ప్లస్‌ వున్నాయని వైద్యులు చెబుతున్నారు. యాంటీబాడీల కన్నుగప్పి...ఇవి శరీరంలో విస్తరిస్తున్నాయి. దీన్నే, ఇమ్యూనిటీ ఎస్కేపింగ్‌గా పేర్కొంటున్నారు.


రీ ఇన్‌ఫెక్షన్‌.. 

సాధారణంగా ఒకసారి కరోనా వస్తే...మళ్లీ 90 రోజుల వరకు వైరస్‌ సోకే అవకాశం ఉండదు. అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న మూడు నుంచి ఆరు నెలల పాటు యాంటీబాడీల రక్షణగా సమృద్ధిగా ఉంటుంది. ఆ తరువాత నుంచి యాంటీబాడీలు క్షీణిస్తాయి. అంటే, వైరస్‌ సోకేందుకు వున్న అవకాశాలను ఎక్కువ చేస్తాయి. సాధారణంగా ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ సోకిన 90 రోజులు కంటే..ముందుగానే మరోసారి వైరస్‌ సోకిన్టయితే...దాన్ని కొవిడ్‌ వైరస్‌ రీ ఇన్‌ఫెక్షన్‌గా పేర్కొంటారు. అంతకంటే ఎక్కువ రోజుల తరువాత అయితే..దాన్ని సాధారణ ఇన్‌ఫెక్షన్‌గానే పేర్కొంటున్నారు. 


ప్రభావం తక్కువ.. 

ఒమైక్రాన్‌ వ్యాప్తి తీవ్రంగా వుండడంతో వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఇందులో ఇప్పటికే ఒకసారి వైరస్‌ సోకినవారితోపాటు రెండు డోసులు, బూస్టర్‌ డోసు తీసుకున్నవాళ్లు కూడా వుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకోని వారితో పోలిస్తే..రెండు డోసులు, బూస్టర్‌ డోసు తీసుకున్న వారిలో ఈ వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగానే వున్నట్టు పేర్కొంటున్నారు. అసలు, వ్యాక్సిన్‌ తీసుకోని వారితో పోలిస్తే, తీసుకున్న వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకోని వారికి వైరస్‌ సోకితే..జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనీసం వారం రోజులపాటు వేధిస్తే...వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఈ లక్షణాలు అతి స్వల్పంగా ఉంటున్నాయి. రెండు, మూడు రోజుల తరువాత పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. బూస్టర్‌ డోసు తీసుకున్న వారిలో జలుబు, దగ్గు రెండు రోజులు కనిపించి..వెంటనే తగ్గుముఖం పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.


వైరస్‌ సోకే ముప్పు పొంచే ఉంటుంది.. 

- డాక్టర్‌ రాంబాబు, విమ్స్‌ డైరక్టర్‌

వ్యాక్సిన్‌ తీసుకున్నా, గతంలో కొవిడ్‌ సోకినా...మళ్లీ వైరస్‌ సోకే ముప్పు వుంటుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. వ్యాక్సిన్‌ తీసుకున్నామనో, ఇప్పటికే ఒకసారి వైరస్‌ సోకిందనో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే...కొన్ని సందర్భాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒమైక్రాన్‌ బారినపడిన వారిలో అత్యధికశాతం మంది ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నవారు, మొదటి, సెకండ్‌వేవ్‌లలో వైరస్‌ బారినపడిన వారు కూడా ఉన్నారు. కొందరు బూస్టర్‌ డోసు తీసుకున్న తరువాత కూడా వైరస్‌కు ఇన్‌ఫెక్ట్‌ అయ్యారు. కాబట్టి, ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. 


మరో 1,728 కేసులు నమోదు

విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 1,728 మందికి కొవిడ్‌ వైరస్‌ సోకినట్టు సోమవారం నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,79,839కు చేరింది. ఇందులో 1,62,287 మంది కోలుకోగా, మరో 16,424 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒకరు మృతిచెందడంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 1128కు చేరింది. 


అనకాపల్లి ఎమ్మెల్యే అమర్‌కు కరోనా

అనకాపల్లి టౌన్‌: అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌కు కరోనా సోకింది. సోమవారం పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. వైద్యుల సూచన మేరకు ఆయన హోమ్‌ ఐసోలేషన్‌లో వున్నారు.


ఏపీఆర్‌ స్కూల్లో కరోనా కలకలం

ఒక టీచర్‌, 20 మంది విద్యార్థులకు పాజిటివ్‌

27 వరకు సెలవులు ప్రకటించిన ప్రిన్సిపాల్‌


నర్సీపట్నం, జనవరి 24: స్థానిక మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో వున్న ఏపీ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా వైరస్‌ విజృంభించింది. 20 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు వైరస్‌ బారినపడ్డారు. పాఠశాలలో గురువారం పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు శనివారం రాత్రి వచ్చాయి. ప్రిన్సిపాల్‌ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు 27వ తేదీ వరకు సెలవులు ప్రకటించి, విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. వచ్చే శుక్రవారం నుంచి తరగతులు యథావిధిగా నిర్వహిస్తామని ప్రిన్సిపాల్‌ తెలిపారు.


నాతవరం మండలంలో ఆరుగురు టీచర్లు, 

నలుగురు విద్యార్థులకు...

నాతవరం, జనవరి 24: మండలంలో వివిధ పాఠశాలల్లో ఆరుగురు టీచర్లు, నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఎంఈవో అమృతకుమార్‌ తెలిపారు. మూడు రోజుల క్రితం పరీక్షలు చేయించుకోగా సోమవారం రిపోర్టులు వచ్చాయని చెప్పారు. వైబీ అగ్రహారం ప్రాఽథమిక పాఠశాలలో ముగ్గురు టీచర్లు, ఇద్దరు విద్యార్థులు, మన్యపురట్ల పాఠశాలలో ఇద్దరు టీచర్లు, గన్నవరం పాఠశాలలో ఒక టీచర్‌, చెర్లోపాలెం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు వైరస్‌ బారిన పడినట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2022-01-25T06:33:55+05:30 IST