విద్యార్థిని ఆత్మహత్య కేసులో అనూహ్య మలుపు.. కాల్, చాటింగ్ లిస్ట్ చూస్తే..

ABN , First Publish Date - 2020-06-20T20:49:01+05:30 IST

జంషెడ్‌పూర్‌ నిట్‌లో మెటలాజికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయ్‌తండాకు చెందిన తేజావత్‌ సంధ్య(19) గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేయగా..

విద్యార్థిని ఆత్మహత్య కేసులో అనూహ్య మలుపు.. కాల్, చాటింగ్ లిస్ట్ చూస్తే..

ఉపాధ్యాయుడి వేధింపుల కారణంగానే సంధ్య బలవన్మరణం?

అతడిని అప్పజెప్పాలంటూ మృతురాలి బంధువుల ధర్నా..

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన.. 

పోలీసుల అదుపులో విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వ్యక్తి?


నేలకొండపల్లి(ఖమ్మం) : జంషెడ్‌పూర్‌ నిట్‌లో మెటలాజికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయ్‌తండాకు చెందిన తేజావత్‌ సంధ్య(19) గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేయగా.. ప్రాథమిక విచారణలో కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆ విద్యార్థిని మొబైల్‌ కాల్‌ డేటా ఆధారంగా వెలుగులోకి వచ్చిన విషయాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. సదరు విద్యార్థిని భద్రాచలం స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో పదో తరగతి చదివే సమయంలో ఆమెకు ఇంగ్లీష్‌ తరగతులు బోధించిన ఓ వ్యక్తి.. తరచుగా వేధిస్తుండటం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. గురువారం ఆ విద్యార్థిని సదరు వ్యక్తితో మాట్లాడిన తర్వాతే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అయితే ఆమె మొబైల్‌ కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. 


పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా.. 

సంధ్య ఆత్మహత్యకు ఆ ఉపాధ్యాయుడు కారణమని, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న అజయ్‌తండా వాసులు శుక్రవారం ఉదయం నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అదుపులో ఉన్న వ్యక్తిని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఖమ్మం-కోదాడ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయ ఏర్పడింది. ధర్నా సమయంలో మృతురాలి బంధువులు వాహనాల కిందకు వెళ్లి.. తమకు న్యాయం జరిగే వరకు బయటకు వచ్చేది లేదంటూ భీష్మించారు. దీంతో వారిని శాంతింపజేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మృతురాలి తండ్రి రామారావు ఎస్‌ఐ అశోక్‌రెడ్డి కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని కంట తడి పెట్టారు. దీంతో నిందితులెవరైనా వదిలేది లేదని, చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఎస్‌ఐ హామీ ఇవ్వటంతో వారంతా ధర్నా విరమించారు.


నా బిడ్డ ఆత్మ హత్యకు ఉపాధ్యాయుడే కారణం: రామారావు, మృతురాలి తండ్రి

తన కుమార్తె చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేదని, నేలకొండపల్లిలో 5వ తరగతి వరకు చదివించిన అనంతరం గురుకుల పాఠశాలలో సీటు రావటంతో ఇల్లెందులో చేర్చామని, అక్కడ మెరిట్‌ భధ్రాచలం స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీకి పంపారని మృతురాలి తండ్రి తేజావత్‌ రామారావు విలేకరులకు తెలిపారు. అయితే తన కూతురు అక్కడి వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదివే సమయంలో.. ఇంగ్లీష్‌ పాఠాలు బోధించిన సదరు ఉపాధ్యాయుడు ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు తీశాడని వివరించాడు. అప్పటి నుంచి ఫోన్‌లో తరచుగా బెదిరిస్తున్నాడని వాపోయాడు. సంధ్య ప్రస్తుతం జంషెడ్‌పూర్‌లోని నిట్‌లో మెటలాజికల్‌ ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసిందని, తన బిడ్డ ఆత్మహత్యకు కారణమైన సదరు ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాడు.


ప్రాథమిక ఆధారాలు దొరికాయి : ఎస్‌ఐ అశోక్‌రెడ్డి

సంధ్య ఆత్మహత్య విషయమై అనుమానాస్పద కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ జరిపామని, ఈ క్రమంలో సంధ్య, సదరు ఉపాధ్యాయుడి మధ్య జరిగిన ఫోన్‌ ఛాటింగ్‌, కాల్‌లిస్ట్‌ లభ్యమైందన్నారు. ఆ లిస్టుల ఆధారంగా తదుపరి విచారణ జరుపుతున్నామని, సదరు ఉపాధ్యాయుడు స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో పని చేస్తున్నాడన్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని వివరించారు. 

Updated Date - 2020-06-20T20:49:01+05:30 IST