చాట్‌ ఫటాఫట్‌

ABN , First Publish Date - 2022-01-29T05:30:00+05:30 IST

మన దేశంలో ఎక్కడైనా ఫేమస్‌ స్నాక్‌... చాట్‌. ఇది అందరి ఫేవరెట్‌. కానీ ఇది కరోనా కాలం. బయటకు వెళ్లి తినాలంటే భయం. అందుకే ఇంట్లోనే సులువుగా చేసుకొనే కొన్ని చాట్‌ రెసిపీలు మీ కోసం...

చాట్‌ ఫటాఫట్‌

మన దేశంలో ఎక్కడైనా ఫేమస్‌ స్నాక్‌... చాట్‌. ఇది అందరి ఫేవరెట్‌. కానీ ఇది కరోనా కాలం. బయటకు వెళ్లి తినాలంటే భయం. అందుకే ఇంట్లోనే సులువుగా చేసుకొనే కొన్ని చాట్‌ రెసిపీలు మీ కోసం... 


ఆలు టోక్రీ చాట్‌ 

తయారీ విధానం: 

 ఆలుగడ్డని 15 నుంచి 20 నిమిషాలపాటు ఉడకబెట్టాలి. తరువాత వాటిని సగానికి కట్‌ చేసి, తొక్కు తీయాలి. 

 శనగపిండిలో నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. అందులో ఆలుగడ్డ ముక్కలు ముంచి తీయాలి. దానికి భుజియా కోట్‌ వేయాలి. పాన్‌లో నూనె వేసి, కోట్‌ వేసిన ఆలుగడ్డ ముక్కల్ని డీప్‌ ఫ్రై చేసి, ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. 

 మిక్చర్‌ కోసం: ఒక బౌల్‌లో కొద్దిగా ఉడికించిన ఆలుగడ్డ, కట్‌ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కిస్మిస్‌, నిమ్మ రసం, చాట్‌ మసాలా, బ్లాక్‌ సాల్ట్‌, తేనె వేసి బాగా కలిపి, పక్కన పెట్టుకోవాలి. 

 చట్నీ: చింతపండు, మామిడి అల్లం రసం కలిపి... ఓ పాన్‌లో వేసి మిశ్రమం దగ్గరగా వచ్చేవరకు ఉడికించాలి. 

 స్వీట్‌ కర్డ్‌ చట్నీ: ఒక వస్త్రంలో యోగర్ట్‌ వేసి, మూటలా కట్టి, అందులో నీళ్లన్నీ పోయేలా అరగంట పక్కన పెట్టాలి. తరువాత యోగర్ట్‌ను మెత్తగా చేసుకోవాలి. తీపి కోసం తేనె జోడించాలి. 

 ఇప్పుడు ప్లేట్‌లో వేగించి పెట్టుకున్న ఆలు పెట్టి, దానిపై మిక్చర్‌, ఆ తరువాత స్వీట్‌ కర్డ్‌,చట్నీ వేయాలి. దానిమ్మ గింజలు, గ్రీన్‌ ఆపిల్‌ ముక్కలు, కొత్తిమీర రెబ్బలతో గార్నిష్‌ చేసి వడ్డించుకోవాలి. 


కావల్సినవి

ఆలుగడ్డ(మీడియ్‌)- 2, తరిగిన ఉల్లి- 30 గ్రా., తరిగిన అల్లం- 1/2 టేబుల్‌ స్పూన్‌, తరిగిన పచ్చిమిర్చి- 1 టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర రెబ్బలు- కొద్దిగా, నిమ్మ రసం- 1/2 టేబుల్‌ స్పూన్‌, దానిమ్మ గింజలు- 1 టేబుల్‌ స్పూన్‌, కిస్మిస్‌- 5, గ్రీన్‌ ఆపిల్‌- 50 గ్రా., యోగర్ట్‌- 50 గ్రా., మామిడి అల్లం- 30 గ్రా., చింతపండు- 50గ్రా., భుజియా- 100 గ్రా., బ్లాక్‌ సాల్ట్‌- 1 టేబుల్‌ స్పూన్‌, శనగపిండి- 50 గ్రా., చాట్‌ మసాలా- 1 టేబుల్‌ స్పూన్‌. 



క్రిస్పీ బీట్‌రూట్‌-క్యారట్‌ ప్యాటీ చాట్‌ 

కావల్సినవి

తురిమిన బీట్‌రూట్‌- 60గ్రా., తురిమిన క్యారట్‌- 100 గ్రా., ఉడికించిన ఆలుగడ్డ- 150 గ్రా., కట్‌చేసిన కొత్తిమీర-10 గ్రా., చాట్‌ మసాలా-10 గ్రా., ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిర్చి- 10 గ్రా., అల్లం-వెల్లుల్లి పేస్ట్‌- 20 గ్రాం., బ్రెడ్‌క్రంబ్స్‌- 250 గ్రా., కార్న్‌ ఫ్లోర్‌- 100 గ్రా., మైదా- 150 గ్రా., దానిమ్మ గింజలు- 20 గ్రా., పెరుగు- 200 గ్రా., క్రీమ్‌- 60 గ్రా., తేనె- 10 మి.లీ., జీర పొడి- 5 గ్రా., సేవ్‌- 30 గ్రా., నిమ్మకాయ రసం- 10 మి.లీ. 

తయారీ విధానం: 

 బౌల్‌లో తురిమిన క్యారట్‌, బీట్‌రూట్‌, ఉడికించిన ఆలు, కట్‌చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి, చాట్‌ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా కలపాలి. తరువాత దాన్ని చిన్న చిన్న ఫ్లాట్‌ ప్యాటీల్లా చేసుకోవాలి.  

 కార్న్‌ఫ్లోర్‌, మైదా, ఉప్పు వేసి, నీళ్లు పోస్తూ బాగా కలుపుకోవాలి. 

 ఈ మిశ్రమంలో ప్యాటీలను ముంచి, తరువాత బ్రెడ్‌క్రంబ్స్‌లో వేయాలి. 

 ఇప్పుడు బ్రెడ్‌క్రంబ్స్‌ కోటింగ్‌ ఉన్న ప్యాటీలను ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఎయిర్‌ ఫ్రయర్‌లో గానీ, పాన్‌లో కొద్దిగా నూనె వేసి గానీ ప్యాటీలను దోరగా వేగించుకోవాలి. 

 బౌల్‌లో పెరుగు, క్రీమ్‌, తేనె, కొద్దిగా చాట్‌ మసాలా వేసి కలపాలి. క్రిస్పీ ప్యాటీలపై ఈ మిశ్రమాన్ని పోయాలి. 

 సేవ్‌, దానిమ్మ గింజలు, నిమ్మ రసం, చాట్‌ మసాలా, జీర పొడి, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వడ్డించుకోవాలి. 


హెల్దీ మిక్స్‌డ్‌ మిల్ల్‌డ్‌ భేల్‌ 

కావల్సినవి: 

రాత్రంతా నానబెట్టిన జొన్న గింజలు, సజ్జలు- 1/3 కప్పు చొప్పున, బార్లీ, పల్లీ, స్వీట్‌ కార్న్‌ - 1/4 కప్పు చొప్పున, సింగాడ (వాటర్‌ చెస్ట్‌నట్‌)- 1/4 కప్పు, కట్‌ చేసిన టమాటా- 1/4 కప్పు, పచ్చి మామిడి ముక్కలు- 1 టేబుల్‌ స్పూన్‌, సన్నగా తరిగిన ఉల్లి, కొత్తిమీర- 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, స్వీట్‌ చట్నీ- 1/3 కప్పు, కొత్తిమీర చట్నీ- 1/3 కప్పు, చాట్‌ మసాలా- 1 టేబుల్‌ స్పూన్‌, కారం, జీర పొడి, రాక్‌సాల్ట్‌- 1/2 టేబుల్‌ స్పూన్‌ చొప్పున, సేవ్‌, దానిమ్మ గింజలు- గార్నిష్‌ కోసం, ఉప్పు తగినంత. 

తయారీ విధానం:  జొన్నలు, సజ్జలు, పల్లీలను కుక్కర్‌లో వేసి నాలుగు విజల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. విడిగా బార్లీని కూడా బాగా ఉడకబెట్టాలి. చల్లారిన తరువాత వీటన్నిటినీ బౌల్‌లో తీసుకొని, స్వీట్‌ కార్న్‌, చస్ట్‌నట్స్‌, మామిడి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, సిద్ధంగా పెట్టుకున్న పొడులన్నీ వేసి కలపాలి. తరువాత కొత్తిమీర, స్వీట్‌ చట్నీలను జోడించాలి. 

 కొత్తిమీర, సేవ్‌, దానిమ్మ గింజలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. 


లోటస్‌ స్టెమ్‌ చాట్‌ 

కావల్సినవి

కట్‌ చేసిన లోటస్‌ స్టెమ్స్‌- 30, రిఫైన్డ్‌ గోధుమ పిండి- 2 టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ ఫ్లోర్‌- 2 టేబుల్‌ స్పూన్లు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు- అర కప్పు, జీర పొడి- 1 టేబుల్‌స్పూన్‌, చాట్‌ మసాలా- 1 టేబుల్‌ స్పూన్‌, బ్లాక్‌ సాల్ట్‌- ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, రౌండ్‌గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- 20, కారం- 1 టేబుల్‌ స్పూన్‌, యోగర్ట్‌- ఒక కప్పు, తురిమిన బీట్‌రూట్‌- పావు కప్పు, పంచదార- 2 టేబుల్‌ స్పూన్లు, తరిగిన టమాటా- ఒక కప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర- ఒక కప్పు, నైలాన్‌ సేవ్‌- పావు కప్పు, చాట్‌ మసాలా- 1 టేబుల్‌ స్పూన్‌, తగినంత ఉప్పు. 

తయారీ విధానం: బౌల్‌లో లోటస్‌ స్టెమ్స్‌, గోధుమ పిండి, కార్న్‌ ఫ్లోర్‌, ఉప్పు వేయాలి. లోటస్‌ స్టెమ్స్‌కు అతికేలా మిశ్రమాన్ని కలపాలి. పాన్‌లో నూనె వేసి మీడియమ్‌ ఫ్లేమ్‌లో లోటస్‌ స్టెమ్స్‌ను దోరగా వేగించి, పక్కన పెట్టుకోవాలి. 

 మరో బౌల్‌లో ఆలుగడ్డ ముక్కలు, జీర పొడి, చాట్‌ మసాలా, బ్లాక్‌ సాల్ట్‌ వేసి కలియతిప్పాలి. బంగాళదుంప ముక్కలంతటికీ మసాలా పట్టేలా చూసుకోవాలి. అదే విధంగా ఉల్లిపాయ రింగ్‌లకు కూడా కారం, ఉప్పు కోటింగ్‌లా పట్టించాలి. 

 తురిమిన బీట్‌రూట్‌ను పిండి, జ్యూస్‌ తీయాలి. దానికి యోగర్ట్‌, ఉప్పు, పంచదార జత చేసి బాగా కలిపి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 

 ఒక ప్లేట్‌లో బీట్‌రూట్‌ మిశ్రమాన్ని బేస్‌లా వేయండి. ఆ బేస్‌పై ఆలుగడ్డ మిక్స్‌ స్ర్పెడ్‌ చేయాలి. దానిమీద టమాటా ముక్కలు, గ్రీన్‌ చట్నీ చల్లాలి. 

ఈ బేస్‌పై క్రిస్పీ లోటస్‌ స్టెమ్స్‌, ఉల్లిపాయ రింగ్స్‌ని వరుసగా పెట్టాలి. చాట్‌ మసాలా, బ్లాక్‌ సాల్ట్‌ చల్లి, కొత్తిమీర, నైలాన్‌ సేవ్‌తో గార్నిష్‌ చేసుకుని, గర్ట్‌ చల్లగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకోవాలి. 


Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST