తొలిరోజు చవితి పోటు

ABN , First Publish Date - 2021-04-17T06:12:25+05:30 IST

తొలిరోజు చవితి పోటు

తొలిరోజు చవితి పోటు
ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం

కార్పొరేషన్‌ నామినేషన్ల దాఖలుకు ఆసక్తిచూపని అభ్యర్థులు

నామపత్రాలు అందజేసింది నలుగురే.. 

నేడు ప్రధానపార్టీల అభ్యర్థుల జాబితాలు 

ఖమ్మం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : కార్పొరేషన్‌ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ప్రారంభమవగా.. శని, ఆదివారాలు మాత్రమేగడువుంది. కానీ తొలిరోజైన శుక్రవారం చవితి కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. కేవలం నలుగురు మాత్రమే రిటర్నింగ్‌ అధికారులకు నామపత్రాలు అందజేశారు. అందులో సీపీఎం నుంచి ఒకరు, కారంగ్రెస్‌నుంచి ఇద్దరు, టీఆర్‌ఎస్‌ నుంచి ఒకరు నామినేషన్లు వేశారు. అయితే వీరికి ఆయా పార్టీలు బీఫారాలు మాత్రం అందజేయలేదు. చవితి కావడంతో రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల జాబితాలు ప్రకటించలేదు శని, ఆదివారాల్లో ముమ్మరంగా నామినేషన్లు పడనున్నాయి.

బలమైన అభ్యర్థులను రంగంలోకి దించనున్న పార్టీలు..

ప్రధానపార్టీలు ఆయాడివిజన్లలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు జాబితాలు సిద్ధంచేశాయి. టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాలు శనివారం తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నాయి. కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా చివరిరోజైన ఆదివారం నాడే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జిల్లాలో 60 డివిజన్లకు సంబంధించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. అయితే సీపీఐతో పొత్తు విషయం దాదాపు కొలిక్కి రావడంతో ఆ పార్టీకి కేటాయించే డివిజన్లకు టీఆర్‌ఎస్‌ నుంచి అభ్యర్థులు బరిలో ఉండరు. ఇక సీపీఎం తన పొత్తు వ్యవహారంపై శుక్రవారం రాత్రి వరకు సమాలోచనలు చేసింది. కొందరు టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీచేయాలని, మరికొందరు కాంగ్రెస్‌తో కలిసి నడవాలని సూచించిన క్రమంలో 25డివిజన్లలో పోటీకి నిర్ణయించారు. ఇక అన్ని డివిజన్లలో ఒంటరిగానే పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. జిల్లాలో ముఖ్యనాయకులతోపాటు ఆయా డివిజన్లలో బలమున్న నాయకులు బరిలో దిగబోతున్నారు. అభ్యర్థుల జాబితాను అధి కారికంగా ప్రకటించకపోయినా అనధి కారికంగా సంకేతాలు ఇవ్వడంతో ఎవరికి వారు నామినేషన్లకు రంగం సిద్ధం చేసుకుం టున్నారు. టీఆర్‌ఎస్‌లో మాజీ కార్పొరేటర్లకు పలువురికి అభ్యర్థిత్వాలు దక్కబోతున్నాయి. రిజర్వేషన్లు ఇబ్బంది ఉన్నచోట నాయకుల సతీమణులకు టికెట్లు కేటాయించారు. సీపీఐ ఐదుగురు డివిజన్లు అడుగుతున్నా ఎన్ని డివిజన్లు ఇచ్చేది టీఆర్‌ఎస్‌నుంచి అధికారికంగా ప్రకటన వెల్లడికాలేదు. టీడీపీ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని పోటీకి సిద్ధమవుతుంది. మొత్తంమీద పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఖరారుపై శనివారం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2021-04-17T06:12:25+05:30 IST