గిట్టుబాటు కాని ‘ఉపాధి’

ABN , First Publish Date - 2022-04-21T07:10:16+05:30 IST

జిల్లాలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నా.. కూలీలు పనులు చేపడతున్నారు. ఉదయం 6 నుంచి 11గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు ఈ పనులు చేసేందుకు అధికారులు అవకాశం ఇస్తున్నారు.

గిట్టుబాటు కాని ‘ఉపాధి’

జిల్లాలో జోరుగా ఉపాధి హామీ పనులు

ప్రతి రోజూ లక్షకు పైగా కూలీల హాజరు

కూలి గిట్టుబాటుకావడం లేదంటున్న కూలీలు

ఈ దఫా సమ్మర్‌ అలవెన్స్‌ లేవంటున్న అధికారులు

రెండునెలలుగా ఖాతాలో జమకాని వేతనాలు

ఉపాధి కూలీలకు తప్పని ఎదురుచూపులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో  ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నా.. కూలీలు పనులు చేపడతున్నారు. ఉదయం 6 నుంచి 11గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు ఈ పనులు చేసేందుకు అధికారులు అవకాశం ఇస్తున్నారు. అయితే ఎండ తీవ్రతను తట్టుకుంటూ పనులు చేపడుతున్న కూలీలకు మాత్రం కూలి గిట్టుబాటు కావడంలేదని వాపోతున్నారు. గ్రామాల్లో గట్టి పనులు చేపిస్తుండడంతో సగటున కూలీలందరికీ నిర్ణయించిన వేతనం కంటే తక్కువగా వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. చెల్లించాల్సిన వేతనాలు కూడా రెండునెలలుగా ఖాతాల్లో జమకాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 20 వరకు చేసిన పనులకు మాత్రమే వేతనాలు చెల్లించారు.  సాఫ్ట్‌వేర్‌ మారడం, కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించడం వల్ల వేతనాలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పనులు చేసినవిధంగానే వారం లేదా 15 రోజుల్లోపు డబ్బులను ఖాతాల్లో జమచేయాలని కూలీలు కోరుతున్నారు.  

ఫ జిల్లాలో 2,66,382 జాబ్‌కార్డులు..

జిల్లాలో 2లక్షల 66వేల 382 జాబ్‌కార్డులను ఇప్పటి వరకు మంజూరు చేశారు. వేసవిలో పనులు తక్కువగా ఉన్న సమయంలో వీరందరికీ పనులను కల్పిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రామాల్లో చెరువుల్లో పూడిక తీయడం, కాల్వల నిర్మాణం, ట్రెంచ్‌కట్టింగ్‌, పాంపాడ్స్‌ నిర్మాణాలు, నర్సరీలతో పాటు అటవీ ప్రాంతంలో కందకాల నిర్మాణం కూడా కూలీలతో పనులు చేపిస్తున్నారు. జిల్లాలో గడిచిన వారం రోజులుగా లక్షా 5వేల నుంచి లక్షా 15వేల మధ్యన కూలీలు పనులకు హాజరవుతున్నారు. వీరందరికీ ఆయా గ్రామాల పరిధిలో ఎంపిక చేసిన పనులను చేపిస్తున్నారు. జిల్లాలో జాబ్‌కార్డులు ఉన్న వారందరికీ అధికారులు పనులను కల్పిస్తున్నారు. కుటుంబాలకు వందరోజుల పనులను కల్పించేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే గతంలో లాగా వేసవి అలవెన్స్‌ ఈ దఫా ఇవ్వకపోవడం వల్ల కూలీలకు వేతనం ఎక్కువగా రావడంలేదు. గత సంవత్సరం వరకు మార్చి నుంచి జూన్‌ వరకు సమ్మర్‌ అలవెన్స్‌ కింద 30 శాతం అదనంగా కూలీలకు వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పనులు ఎక్కు వగా జరగకపోవడం, సమ్మర్‌ అలవెన్స్‌ లేకపోవడం వల్ల కూలీలకు వేతనాలు తక్కువగా వస్తున్నాయి.

ఫ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

జిల్లాలో 20 రోజులుగా ఎండలు బాగా పెరిగాయి. ప్రతిరోజూ 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 6 నుంచి 11గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు ఈ పనులు చేసేందుకు అవకాశం ఇస్తున్నారు. ఎక్కువ మంది ఉదయం పూటనే పనులకు వస్తున్నారు. ఎండలు బాగా పెరగడం వల్ల భూములు గట్టిగా ఉండడంతో ఎక్కువగా పనులు జరగడంలేదు.

ఫ తగ్గుతున్న కూలి..

ప్రతిరోజూ పనులకు వెళ్తున్న ఉపాధి కూలీలకు మాత్రం వంద రూపాయల నుంచి 150 దాటడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఉపాధి కూలీలకు ప్రతిరోజూ 256 రూపాయల వరకు వచ్చేవిధంగా అధికారులు చూడాలి. వారం రోజులు పనిచేసినా వెయ్యి రూపాయలు కూడా దాటడంలేదు. గ్రామాల్లో చెరువు పనులకు వెళితే కొంత ఎక్కువగా వస్తున్నా.. మిగతా పనుల్లో ఎక్కువగా రావడంలేదు. నిబంధనల మేరకు పనులను చేయడంతో పాటు వాటి చిత్రాలను కూడా అప్‌లోడ్‌ చేస్తుండడంతో ఆ పరిమాణం ఆధారంగానే కూలీలకు వేతనం వస్తోం ది. జిల్లాల్లో వర్షాలు లేకపోవడం వల్ల కూడా గ్రా మాల పరిధిలో ఉపాధి చేపట్టే ప్రాంతాల్లో భూములు గట్టిగా మారడం వల్ల సమస్యలు వస్తున్నాయని కూ లీలు వాపోతున్నారు. పనులకు అనుకూలంగా ఉండే ప్రాంతాలను చూపించాలని వారు కోరుతున్నారు.

కూలి గిట్టుబాటు కావడంలేదు..

ఫ నర్సు, బడా భీమ్‌గల్‌

రెండు నెలలుగా ఉపాధిహామీ పనులకు వస్తున్నాం. చెరువు పనులతో పాటు అటవీ ప్రాంతంలో పనులు చేస్తున్నాం. ప్రతిరోజూ పనికి వచ్చినా వంద నుంచి 150 రూపాయల్లోపే కూలి వస్తోంది.  మాకు ఇది గిట్టుబాటు కావడం లేదు.

సకాలంలో వేతనాలు రావడంలేదు..

ఫ అంజమ్మ, బడా భీమ్‌గల్‌

గ్రామం పరిధిలో రెండు నెలలుగా పనిచేస్తున్నాం. వేతనాలు మాత్రం ఖాతాల్లో వారంలోపు జమకావడంలేదు. నెల రోజులకు పైగా వేచిచూస్తే తప్ప డబ్బులు రావడంలేదు. పనులు చేసిన విధంగానే వారం నుంచి 15 రోజుల లోపు వేతనాలు వస్తే ఖర్చులకు ఇబ్బందులు ఉండవు. 

వారంలోపు వేతనాలు చెల్లిస్తాం..

ఫ చందర్‌ నాయక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

కూలీలకు వేతనాల చెల్లింపులో కొంతమేర ఆలస్యమైంది. వారంలోపు ఖాతాలో జమచేస్తాం. కూలీలకు ఇబ్బంది లేకుండా పనులు చేపడుతున్నాం. కొన్ని గ్రామాల పరిధిలో పనులు తక్కువగా జరగడం వల్ల వేతనాలు తగ్గాయి. సమ్మర్‌ అలవెన్స్‌ లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది.

Updated Date - 2022-04-21T07:10:16+05:30 IST