గిట్టుబాటు లేక.. ముందుకురాక

ABN , First Publish Date - 2022-01-21T05:23:18+05:30 IST

గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్వీర్యమవుతోంది. గిరి జనులకు దళారుల నుంచి రక్షణ కల్పించాలన్న ఆశయంతో ప్రారంభించిన సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్ల వారికి దూరమవుతోంది.

గిట్టుబాటు లేక.. ముందుకురాక
సీతంపేటలో జీసీసీ ఏర్పాటు చేసిన నిత్యావసరాల సరుకుల దుకాణం


 దళారులకే అటవీ ఉత్పత్తులు విక్రయిస్తున్న గిరిజనులు


 నిర్వీర్యమవుతున్న జీసీసీ


సీతంపేట:
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్వీర్యమవుతోంది. గిరి జనులకు దళారుల నుంచి రక్షణ కల్పించాలన్న ఆశయంతో ప్రారంభించిన సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్ల వారికి దూరమవుతోంది. ప్రధానంగా గిరిజను లు సేకరించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను జీసీసీ కల్పించకపోవడంతో దళారులకే అటవీఉత్పత్తులను విక్రయిస్తున్నారు. గతంలో నరమామిడి చెక్క, ఉసిరికి, కొండచీపుర్లు, నల్లజీడి, చింతపండు, తిప్పతీగ, నేలవేము, పాతాల గిరిడి వంటి అటవీ ఉత్పత్తులు పెద్దఎత్తున గిరిజనులు సేకరించేవారు. ప్రస్తుతం జీసీసీ చింతపండు, కొండచీపుర్లు మాత్రమే సేకరించడం, అవి కూడా మార్కెట్‌ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో గిరి జనులు వాటిని కూడా జీసీసీకి అమ్మడానికి మొగ్గుచూప డంలేదు. దీంతో జీసీసీ అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు దూరమవుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ మనుగడకు సబ్బులు, తేనెలు, కాపీపొడి వంటి ఉత్పత్తులను పెద్దఎత్తున తయారుచేసి వాటి విక్రయాలపైనే దృష్టిసారిస్తోంది. అటవీ ఉత్పత్తులు కొనుగోలు తగ్గడంతో సిబ్బంది నియామకానికి సంస్థ మొగ్గు చూపడం లేదు. పలు డీఆర్‌ డిపోలకు కూడా శాశ్వత భవనాలు లేవు. దీంతో శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు.


  సిబ్బంది నియామకాలు లేక...



గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రానురాను అటవీ ఉత్పత్తుల సేకరణలో జీసీసీ పాత్ర తగ్గిపోతోంది. గతంలో గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను పెద్దఎత్తున కొనుగోలు చేసి వాటిని మైదాన ప్రాంతాల్లో జీసీసీ విక్రయించేది. వాటి ద్వారా వచ్చే ఆదా యంతో సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకొంది. ఆ ఆదాయంతోనే ఉద్యోగుల జీతభత్యాల కింద చెల్లించేవారు. ప్రస్తుతం సంస్థ లావాదేవీలు తగ్గడంతో పరిస్థితి తలకిందులైంది. దీనికితోడు రెండు దశాబ్దాలుగా సిబ్బంది నియామ కాలు లేవు. దీంతో ఉన్న కొద్దిమంది సిబ్బందితోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జీసీసీ ఏర్పాటు చేసిన డీఆర్‌ డిపోల్లో నిత్యావసర సరుకులు పంపిణీచేసేవారు. ప్రస్తుతం మొబైల్‌ డిస్పాన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ద్వారా గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం సరకులు పంపిణీ చేస్తోంది. దీం తో జీసీసీకి గిరి జనుల నుంచి ఆదరణ లేకుండా పోయింది. పాతపట్నం,
సీతంపేట జీసీసీ సొసైటీల పరిధిలో గతంలో 54 డీఆర్‌ డిపోలు ఉండేవి. ప్రస్తుతం ఎండీయూ వాహనాల అందు బాటులోకి రావడంతో 24 స్టాక్‌ పాయింట్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. పసుపు, జీడి, ధాన్యం పంట ఉత్పత్తుల కొనుగోలుపై జీసీసీ దృష్టిసారించక పోవడంతో గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

 వారానికి రెండుసార్లే...


జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌గా సహకార శాఖ చెందిన ఉద్యోగిని   నియ మించారు. ఆమె పాతపట్నం, సీతంపేట సొసైటీ పరిధిలో ఉన్న డీఆర్‌ డిపోలను బలోపేతం చేసి సంస్థ ఆర్ధిక అభివృద్ధికి తోట్పాటు అందించాల్సి ఉంది. అలా కాకుండా వారానికి రెండు రోజులే వచ్చి మిగతా రోజులు ముఖం చాటేస్తున్నారన్న విమర్శలున్నాయి.

చింతపండు కొనుగోలుపై సందేహాలు


జీసీసీ ద్వారా గతంలో చింతపండును కొనుగోలు చేసేవారు. కిలో రూ.36కు గత ఏడాది కొనుగోలు చేశారు. అప్పట్లో కొనుగోలు చేసిన చింతపండు నిల్వలు పెద్దఎత్తున కోల్డ్‌స్టోరేజ్‌ల్లో నిల్వలు పేరుకుపోయాయి. ఈ ఏడాది రూ.32కే కిలో చింతపండు కొనుగోలుకు జీసీసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చింతపండు కొనుగోలుపై సందేహాలు నెలకొన్నాయి.

అటవీ ఉత్పత్తుల సేకరణకు ప్రత్యేక దృష్టి


జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల సేకరణకు ప్రత్యేక దృష్టిసారించామని గిరిజన సహకార సంస్థ జనరల్‌ మేనేజర్‌ చిన్నబాబు ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఈ మేరకు లక్ష్యాలు నిర్దేశించినట్లు చెప్పారు. చింతపండు మద్దతు ధర ఈ ఏడాది కిలో రూ.32 కొనుగోలు చేయడానికి పునరాలోచనలో ఉన్నట్లు తెలిపారు.


Updated Date - 2022-01-21T05:23:18+05:30 IST