ఉద్యోగాల పేరిట మోసం

ABN , First Publish Date - 2021-04-08T05:25:56+05:30 IST

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటుచేశానని, ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ యువతీయువకులను మోసగించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను వీఎంబంజర్‌ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని సత్తుపల్లి కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు సత్తుపల్లి రూరల్‌ సీఐ తాటిపాముల కరుణాకర్‌ తెలిపారు.

ఉద్యోగాల పేరిట మోసం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ కరుణాకర్‌, ఎస్‌ఐ నాగరాజు

యువతీయువకుల నుంచి రూ.లక్షల వసూలు

నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

పెనుబల్లి, ఏప్రిల్‌ 7: సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటుచేశానని, ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ యువతీయువకులను మోసగించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను వీఎంబంజర్‌ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని సత్తుపల్లి కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు సత్తుపల్లి రూరల్‌ సీఐ తాటిపాముల కరుణాకర్‌ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ నాగరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. కల్లూరు మండలం పేరువంచకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అంకిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి కల్లూరు, పెనుబల్లి మండలాలతోపాటు కృష్ణాజిల్లా విస్సన్నపేట, విజయవాడ తదితర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యవకులకు తాను నేరాసాఫ్ట్‌, సిగ్నోటెక్‌ కంపెనీలను ఏర్పాటు చేశానని, వాటల్లో ఉద్యోగాలిస్తానని లక్షలాదిరూపాయలను వసూలు చేసి మొఖం చేటేశాడు. ఈనేపథ్యంలో విసన్నపేటకు చెందిన తిరుమల జయరాం అనే బాధితుడు పెనుబల్లి మండలం లంకాసాగర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15లక్షలు తీసుకున్నట్లు వీఎంబంజర్‌ పోలీస్‌స్టేషన్‌లో నరేష్‌కుమార్‌రెడ్డిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నరేష్‌కుమార్‌రెడ్డి ఆచూకీ కోసం లుక్‌అవుట్‌ నోటీసు జారీచేశారు. అలాగే తన పాస్‌పోర్టును కూడా సీజ్‌చేశారు. దేశంలోని అన్నిరాష్ట్రాల పోలీసులు అతడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈనెల 4వతేదీన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచానపల్లి ఎయిర్‌పోర్టు అథార్టీ పోలీసులు నరేష్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆమేరకు సమాచారాన్ని వీఎంబంజర్‌ పోలీసులకు అందించటంతో ఎయిర్‌పోర్టు పోలీసులు అక్కడి కోర్టులో హాజరుపరిచారు. వీఎంబంజర్‌ ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలో తిరుచానపల్లి వెళ్లిన పోలీసు బృందం అతడిని అదుపులోకి తీసుకొని సత్తుపల్లి కోర్టు రిమాండ్‌కు పంపించారు. నరేష్‌కుమార్‌రెడ్డిపై తదుపరి విచారణ జరిపి ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు.

Updated Date - 2021-04-08T05:25:56+05:30 IST