అడుగడుగునా మోసం

ABN , First Publish Date - 2021-10-11T05:53:24+05:30 IST

కరోనా వైరస్‌ మహమ్మారి సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలంచేసింది. కొవిడ్‌ ప్రభావంతో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌తోసహా అన్నిరకాల వస్తువులు, ఆహారపదార్థాలు, పండ్ల ధరలు ఆకాశాన్నంటడంతో నిత్యావసర వస్తువులతోపాటు ఏది కొనుగోలు చేయాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అడుగడుగునా మోసం

- బలవుతున్న వినియోగదారులు

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 10: కరోనా వైరస్‌ మహమ్మారి సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలంచేసింది. కొవిడ్‌ ప్రభావంతో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌తోసహా అన్నిరకాల వస్తువులు, ఆహారపదార్థాలు, పండ్ల ధరలు ఆకాశాన్నంటడంతో నిత్యావసర వస్తువులతోపాటు ఏది కొనుగోలు చేయాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు తూకాల్లో మోసాలు, అధిక ధరలు, కల్తీ వస్తువుల విక్రయాలతో వినియోగదారులను నిలువునా మోసాలకు గురి చేస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌, వాటర్‌బాటిళ్లు, ఇతర పానీయాలు,  కొన్నిరకాల వస్తువులు మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. కిరాణా దుకాణాల నిర్వాహకులు, చికెన్‌, మటన్‌, కూరగాయల విక్రయదారులు వినియోగించే తూకపు రాళ్లను సీల్‌ వేసినవి మాత్రమే వినియోగించాలి. తూనికలు, కొలతలశాఖ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ అక్రమార్కులు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు తెరలేపుతూ వినియోగదారులను దోచుకుంటున్నారు. 

- వివరాలు లేకుండా వస్తువుల విక్రయం

ప్యాకేజీ కమోడిటీ రూల్స్‌ 2011 చట్టం ప్రకారం వ్యాపారులు వారు విక్రయిస్తున్న వస్తువులపై పూర్తి సమాచారం ఉండాలి. ఆ వస్తువు తయారీ తేదీ, గడువు, తయారీ సంస్థ చిరునామా, ఈ మెయిల్‌, ఎమ్మార్పీ, బార్‌కోడ్‌ వంటి వివరాలుండాలి. తూకంలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారిపై ఉక్కుపాదం మోపి వినియోగదారులకు న్యాయం చేయాల్సిన తూనికలు, కొలతల శాక అధికారులు ఈ విషయాన్ని మామూలుగా చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకు వ్యాపారంతో పాటు వ్యాపార సంస్థలు కూడా పెరుగుతున్నప్పటికీ వ్యాపారుల మోసాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన లీగల్‌మెట్రాలజీ డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది సంఖ్య పెరగకపోవటంతో తనిఖీలు నామమాత్రంగానే జరుతున్నాయి. ఇటీవల కరీంనగర్‌ శివారులోని ఒక పెట్రోల్‌బంక్‌లో కల్తీ పెట్రోల్‌ విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో అధికారులు ఆ బంక్‌ను సీజ్‌ విచారణ జరుపుతున్నారు. కొంతకాలం క్రితం కరీంనగర్‌ లీగల్‌ మెట్రాలజీ అధికారులు ఆకస్మికంగా కరీంనగర్‌లోని ప్రముఖ షాపింగ్‌ మాల్స్‌లో తనిఖీలు నిర్వహించి ప్యాకేజి కమాడిటీ కింద 7 కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.  

- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 466 కేసులు నమోదు

ఉమ్మడి జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో తూకంలో మోసం, ప్యాకేజీ కమోడిటీ నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై 466 కేసులు నమోదయ్యాయి. ఇందులో తూకంలో మోసాలకు పాల్పడిన కేసులు 179 ఉండగా, ప్యాకేజీ కమోడిటీ కింద 287 కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి వ్యాపారుల వద్ద నుంచి జరిమానా రూపంలో 21,52,200 రూపాయలు వసూలు చేశారు. తూకం యంత్రాలు, తూకం రాళ్లు ఫీజు (ముద్ర రుసుం) రూపంలో కోటి 16 లక్షల 47 వేల 478 రూపాయలు ఆదాయం సమకూరింది. 

- 2021 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నెల వరకు నిర్వహించిన తనిఖీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 172 కేసులు నమోదు కాగా ఇందులో తూకంలో మోసాలకు పాల్పడిన కేసులు 39 ఉండగా, ప్యాకేజి కమోడిటీ కింద మరో 133 కేసులు ఉన్నాయి. ముద్ర రుసుం ద్వారా 36,61,395 రూపాయలు వసూలు కాగా, జరిమానా రూపంలో 6,23,500 రూపాయలు వసూలు చేశారు. 

- అవగాహనతోనే చెక్‌

- ప్రతి తూనిక అడుగుభాగాన లీగల్‌మెట్రాలజీ అధికారులు వేసిన ముద్ర, సీల్‌ ఉందా?లేదా? గమనించి ముద్ర ఉన్న తూకంతోనే వస్తువులు కొనుగోలు చేయాలి. 

- వంట నూనె, ఇతర నూనెలకు సంబంధించిన కొలత పాత్రలు అడుగు భాగంలో నొక్కులు, సొట్టలు లేకుండా చూసుకోవాలి.

- కర్రత్రాసులపై వీలైనంత వరకు తూకం జరుగకుండా చూసుకోవాలి.

- వంటగ్యాస్‌ను స్ర్పింగ్‌ కాంటా ద్వారా తూకం చూసుకోవాలి.

- పెట్రోల్‌, డీజీల్‌ బంక్‌లలో ‘0’ రీడింగ్‌ నుంచి స్టార్ట్‌ చేయాలి. అనుమానం వచ్చిన సందర్భంలో పెట్రోల్‌బంక్‌ కార్యాలయం నోటీసు బోర్డులో ఉన్న లీగల్‌మెట్రాలజీ అధికారి ఫోన్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 

- తూకంలో మోసాలు, వస్తువులపై చిరునామా, ఇతర వివరాలు లేనప్పుడు, పెట్రోల్‌బంక్‌లో మోసాలపై లీగల్‌మెట్రాలజీ వాట్సప్‌ నంబర్‌ 9490165679కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. 

Updated Date - 2021-10-11T05:53:24+05:30 IST