మోసం గురూ!

ABN , First Publish Date - 2022-01-19T06:31:38+05:30 IST

రివర్స్‌ పీఆర్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల నినాదాలు హోరెత్తాయి.ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రతులను మంటల్లో తగులబెట్టి నిరసన తెలిపారు.ఇంత అధ్వానమైన పీఆర్సీ ఏ ప్రభుత్వ హయాంలో చూడలేదంటూ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన నెల్లాళ్లలోపే మెరుగైన పీఆర్సీని ప్రకటిస్తానని, సీపీఎస్‌ రద్దు చేస్తానని మాటిచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇలా వంచించడం దారుణమని వాపోయారు.

మోసం గురూ!
మదనపల్లెలో పీఆర్సీ జీవోలను దహనం చేస్తున్న ఫ్యాఫ్టో ప్రతినిధులు

చిత్తూరు జిల్లావ్యాప్తంగా పీఆర్సీ వ్యతిరేక నినాదాల హోరు


ఫ్యాప్టో ఆధ్యర్వంలో పలుచోట్ల జీవోల దహనం


చిత్తూరు కలెక్టరేట్‌/తిరుపతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రివర్స్‌ పీఆర్సీ  నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల నినాదాలు  హోరెత్తాయి.ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రతులను మంటల్లో తగులబెట్టి నిరసన తెలిపారు.ఇంత అధ్వానమైన పీఆర్సీ ఏ ప్రభుత్వ హయాంలో చూడలేదంటూ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన నెల్లాళ్లలోపే మెరుగైన పీఆర్సీని ప్రకటిస్తానని, సీపీఎస్‌ రద్దు చేస్తానని మాటిచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇలా వంచించడం దారుణమని వాపోయారు. ఇప్పుడు ఇచ్చిన పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేసి, మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని, దానితోపాటు హెచ్‌ఆర్‌ఏ, ఫిట్‌మెంట్‌ విషయంలో కూడా న్యాయం చేయాలని డిమాండు చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.సోమవారం రాత్రి విడుదలైన పీఆర్సీ ఉత్తర్వులపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నిరాశగా చర్చించుకోవడం కన్పించింది.ప్రభుత్వం ఇచ్చిన  షాక్‌తో జిల్లాలోని 50676 మంది ఉద్యోగులతో పాటు 30461 మంది పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారన్న ఆందోళన వారిలో వ్యక్తమైంది. 75-80యేళ్ల మధ్య వయసున్న పెన్షనర్లకు గత ప్రభుత్వం కల్పించిన అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ సౌకర్యంలో కోత విధించడం దారుణమని రిటైర్డ్‌ కాలేజీ టీచర్ల జిల్లా సంఘ కార్యదర్శి సుబ్రహ్మణ్యం నాయుడు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవులు ఆవేదన వ్యక్తం  చేశారు.  కుప్పం అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఫ్యాప్టో ఆధ్యర్వంలో పీఆర్సీ జీవోలను దహనం చేశారు. వెదురుకుప్పంలో ఫోర్టో  జిల్లా అధ్యక్షుడు దొడ్డా ఉమామహేశ్వర్‌ ఆధ్వర్యంలో పీఆర్సీ పత్రాలను దహనం చేశారు.వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులంతా నిరసన వ్యక్తం చేశారు. ములకలచెరువులో ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎంపీడీవో కార్యాలయం ముందు పీఆర్సీ పత్రాలను దహనం చేశారు. అలాగే తమకు జీతాలు తగ్గాయని వైద్య సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రి ముందు నిరసన తెలిపారు. కార్వేటినగరం మండలంలోని కత్తిరిపల్లి జడ్పీ హైస్కూల్‌ వద్ద ఫ్యాప్టో నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అలాగే కార్వేటినగరం మండల విద్యావనరుల శాఖ ఆఫీస్‌ ముందు పీఆర్సీ కాపీలను దహనం చేశారు. పీలేరు ఎమ్మార్సీ కార్యాలయం ముందు ఫ్యాప్టో ఆధ్వర్యంలో పీఆర్సీ పత్రాలను దహనం చేశారు. మదనపల్లె జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.చిత్తూరు బస్టాండ్‌లో, ఆర్సీపురంలో ఎమ్మార్సీ ఆఫీస్‌ ముందు పీఆర్సీ పత్రాలను దహనం చేశారు. వరదయ్యపాలెం మండలం ఎమ్మార్సీ కార్యాలయం ముందు పీఆర్సీ కాపీలను దగ్ధం చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోనూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.  బి.కొత్తకోట ఎంఈవో కార్యాలయ సమీపంలో పలువురు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వడమాలపేట మండలం ఎస్బీఆర్‌ పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో కూడా నిరసన వ్యక్తం చేశారు.యాదమరిలో ఆరోగ్యశాఖ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సదుం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో పీఆర్సీని వ్యతిరేకించారు. కేవీబీపురంలోనూ ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఐరాల మండలం చిగరపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలోనూ వైద్య సిబ్బంది పీఆర్సీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కలకడ ఆదర్శ పాఠశాలలో, పులిచెర్లలో, చిన్నగొట్టిగల్లు జడ్పీ ఉన్నతపాఠశాలలో, రామకుప్పంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. సత్యవేడు ఎంఈవో కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో, పుంగనూరు ఎమ్మార్సీ కార్యాలయం వద్ద పీఆర్సీ పత్రాలను కాల్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 




Updated Date - 2022-01-19T06:31:38+05:30 IST