బినామీ కొనుగోళ్లకు చెక్‌!

ABN , First Publish Date - 2021-10-18T06:23:21+05:30 IST

గత వానాకాలం, యాసంగి సీజన్‌లలో అక్రమాల అనుభవాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించింది. బినామీల ద్వారా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్న అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈసారి వానాకాలం సీజనల్‌లో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి

బినామీ కొనుగోళ్లకు చెక్‌!

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ముకుతాడు 

ఆధార్‌, పట్టాపాస్‌ పుస్తకం, బ్యాంక్‌ అకౌంట్‌తో కొనుగోళ్లఅనుసంధానం 

ఈ వానాకాలం సీజన్‌ నుంచి పకడ్బందీ కార్యాచరణ

వ్యవసాయ శాఖ రికార్డుల ఆధారంగానే రైతుల గుర్తింపు 

గన్నీ సంచుల కొరత నివారణకుఅధికారుల ప్రత్యేక చర్యలు

అందుబాటులో తొమ్మిది లక్షల గన్నీ సంచులు

జిల్లా వ్యాప్తంగా185 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు

ఈ సారైనా అంతా సాఫీగా సాగేనా?!

నిర్మల్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): గత వానాకాలం, యాసంగి సీజన్‌లలో అక్రమాల అనుభవాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించింది. బినామీల ద్వారా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్న అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈసారి వానాకాలం సీజనల్‌లో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుం డా చేసేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. గతానికి భిన్నంగా ఇక నుంచి ధాన్యం కొనుగోలు వ్యవహారమంతా పారదర్శకంగా చేపట్టబోతున్నారు. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న వరి సాగు రైతుల జాబితా ప్రకారమే ఇక నుంచి ధాన్యం కొనుగోలు జరపనున్నారు. దీని కోసం గానూ రైతుల పట్టాదార్‌ పాస్‌ పుస్తకంతో పాటు ఆధార్‌ కార్డు, వారి బ్యాంకు అకౌంట్‌లను అనుసంధానం చేయనున్నారు. దీంతో ధాన్యం పండించిన రైతుల ఖాతాల్లోకే నేరుగా కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు జమ కానున్నాయి. కొద్దిరోజుల నుంచి రైతుల బ్యాంకు ఖాతాలు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డుతో సంబంధం లేకుండా ట్రక్‌ షీట్‌ల ఆధా రంగా చెల్లింపులు జరుపుతున్నారు. దీని కారణంగా కొనుగోలు కేంద్రా ల్లో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చాలా చోట్ల అక్రమాలు వెలుగులోకి రావడం, రైతు లు ఆందోళనలు చేసిన ఉదంతాలున్నాయి. మరి కొన్నిచోట్ల అవకతవకల కు సంబందించి రికవరీలు కూడా జరిగాయి. ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు వ్యవసాయ, మార్కె టింగ్‌ శాఖలు ఉమ్మడిగా ఈసారి వానాకాలం సీజన్‌ కోసం పకడ్బందీ యాక్షన్‌ ప్లాన్‌ను తెరపైకి తెస్తున్నాయి. అలాగే కొనుగోలు జరిగిన తరువాత ధాన్యం నిల్వలు, రైస్‌మిల్లులకు తరలింపు లాంటి చర్యలను కూడా పకడ్బందీగా చేపట్టనున్నారు. 

ఈసారి ధాన్యం అధిక దిగుబడులు

జిల్లాలో ఈసారి వానాకాలం సీజన్‌ కోసం గానూ 185 కొనుగోలు కేంద్రాలను జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నారు. గతానికి కన్నా ఈసారి వరి ధాన్యం 30 శాతం అధిక దిగుబడులు రానున్నట్లు అఽధికారులు భావిస్తున్నారు. ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలిరాకుండా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. దీని కోసం గానూ గ్రామాల వారీగా రైతు సమన్వయ సమితిలు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలకు కూడా సమన్వయ బాధ్యతలు అప్పజెప్పనున్నన్నారు.  అలాగే జిల్లాలో ప్రతీసారి సమస్య గా మారిన గన్నీ సంచుల కొరతను కూడా నివారించేందు కు చర్యలు చేపడుతున్నారు. జిల్లాకు మొత్తమ్మీద 15లక్షల గన్నీ సంచులు అవసరం ఉండగా.. ప్రస్తుతం తొమ్మిది లక్షల గన్నీ సంచులు ఉన్నాయి. అలాగే, జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్న 185 కేంద్రాలకు మిగతా ఆరు లక్షల గన్నీ బ్యాగులను సైతం అధికారులు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.

అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట!!

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతీసారి జరుగుతున్న అవినీతి, అక్రమాలకు ఇక ముకుతాడు భిగించాలన్న ఉద్దేశంతో ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, కొంతమంది సిబ్బంది మిలాఖత్‌ అయ్యి ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. రైతులు అవకతవకలపై చాలా చోట్ల ఆందోళనలు కూడా నిర్వహించారు. నాణ్యత పేరిట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను మోసం చేశారన్న ఆరోపణలున్నాయి. ఇందులో కొంతమంది రైస్‌మిల్లు యాజమాన్యాల హస్తం కూడా ఉన్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పొరుగు జిల్లాల్లోని కొన్ని రైస్‌మిల్లుల యాజమాన్యాలు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తో మిలాఖత్‌ అయ్యి అవకతవకలకు పాల్పడినట్లు సంబంధిత యంత్రాంగం గుర్తించింది. దీంతో ఇక నుంచి అలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే బినామీ వ్యవహారాలకు చెక్‌ పెట్టనున్నారు. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న సాగు రైతుల జాబితా ఆధారం గానే వారి ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాన్ని అనుసంధానం చేసి బినామీ వ్యవహారాలకు తావు లేకుండా చర్యలు చేపట్టనున్నారు. 

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రభుత్వం ప్రస్తుత వానాకాలం సీజన్‌ కోసం గానూ ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని రకాల చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీసీ, డీసీఎంఎస్‌ల  ఆధ్వర్యంలో అనుకూలత ఉన్న అన్నిచోట్ల ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఏ-గ్రేడ్‌ వరికి క్వింటాలుకు రూ. 1960, బి-గ్రేడ్‌ వరికి క్వింటాలుకు రూ.1940గా ధరలను నిర్ణయించింది. అలాగే ఆరు లక్షల గన్నీ బ్యాగులను సైతం అందుబాటులో ఉంచనుంది.   ఎలక్ర్టానిక్‌ కాంటాలు, తేమ శాతాన్ని నిర్ధారించే మ్యాయిచర్‌ మీటర్లు, ధాన్యం ఆరబెట్టేందుకు టార్పాలిన్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈసారి గతానికి కన్నా 30 శాతం అధికంగా ధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలున్నందున.. దానికి అనుగుణంగానే కొనుగోలు ప్రక్రియను చేపట్టబోతున్నారు. 

అధికారులకు కత్తిమీద సాము

ధాన్యం కొనుగోలు వ్యవహారం సంబంధాత యంత్రాంగానికి కత్తిమీద సాములా మారనుంది. ప్రతీసారి వానాకాలం, యాసంగి సీజన్‌లలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారుతుండడమే కాకుండా రైతుల ఆందోళనకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. కొనుగోలు కేంద్రాలకు ఒకేసారి కుప్పలు తెప్పలుగా ధాన్యం తరలిరావడంతో కొనుగోలు ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాగే అకాల వర్షాలు కురవడం, నాణ్యత విషయంలో సంబంధిత కేంద్రాల నిర్వాహకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం లాంటి అంశాలతో పాటు గన్నీ బ్యాగుల కొరత, కొనుగోలు చేసిన ఽధాన్యం నిల్వ చేయడం లాంటి అంశాలు అధికారులకు సవాలుగా పరిణమిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు అధికారులు అపసోపాలు పడుతుండడం, దీనికి తోడు రాజకీయ కారణాలు కూడా ఈ ప్రక్రియను వెంటాడుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు మిలాఖతవుతుండడంతో పాటు కొన్నిచోట్ల రవాణా గుత్తేదారుల నిర్వాహకం సైతం కొనుగోలు ప్రక్రియ పై సందేహాలను లేవనెత్తుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అన్నింటినీ అధిగమిస్తూ ఈ వానాకాలం కొనుగోలు ప్రక్రియను అధికార యంత్రాంగం పకడ్బందీగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుండ డం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - 2021-10-18T06:23:21+05:30 IST