సిరిధాన్యాలతో మధుమేహానికి చెక్‌

ABN , First Publish Date - 2021-07-30T16:56:25+05:30 IST

వరి అన్నానికి బదులు సిరిధాన్యాలను(మిల్లెట్స్‌) ఆహారంగా తీసుకోవడం వల్ల టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయని, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది.

సిరిధాన్యాలతో మధుమేహానికి చెక్‌

క్రమం తప్పకుండా తింటే రోగం రివర్స్‌

ఉడికించినా గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ పెరగదు


హైదరాబాద్‌, జూలై 29: వరి అన్నానికి బదులు సిరిధాన్యాలను(మిల్లెట్స్‌) ఆహారంగా తీసుకోవడం వల్ల టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయని, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. మధుమేహ వ్యాధిగ్రస్థులు, వ్యాధి అంచున ఉన్న వాళ్లు, రాకుండా జాగ్రత్త పడాలనుకున్న వాళ్లు సిరిధాన్యాల భోజనంపై దృష్టి సారించాలని ఈ అధ్యయనం సూచిస్తోంది. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌ ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. 11 దేశాల్లో అధ్యయనం చేశారు. ఫ్రాంటియర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్‌ పేరుతో అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. ప్రతీ రోజూ ఆహారంగా సిరిధాన్యాలను తీసుకున్న మధుమేహ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలు 12-17 శాతం, ప్రీ-డయాబెటిస్‌ వారికి 17 శాతం మేర తగ్గినట్లు అధ్యయనంలో తేలింది.


సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మధుమేహ రోగులు ప్రీ-డయాబెటిక్‌ స్థాయికి, ప్రీ-డయాబెటిక్‌ స్థాయిలో ఉన్న వారు సాధారణ వ్యక్తుల స్థాయికి వచ్చినట్లు గుర్తించారు. ఈ ఆహారంతో గ్లైసీమిక్‌ స్పందనలు కూడా బాగున్నట్లు తేలింది. వెయ్యి మందిపై దీర్ఘకాలంపాటు జరిగిన ఈ అధ్యయనాన్ని మధుమేహం మీద జరిగిన అతిపెద్ద క్రమబద్ధమైన సమీక్షగా ప్రకటించారు. మళ్లీ సిరిధాన్యాలను భారతీయుల దైనందిన ఆహారంలో భాగం చేయాలని ఈ అధ్యయనం సూచించింది. మొత్తం 11 రకాల సిరి ధాన్యాలను అధ్యయనం చేశారు. ఉడికించిన తర్వాత కూడా వీటి గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ పెరగడం లేదని గుర్తించారు. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలను సిరిధాన్యాలుగా పరిగణిస్తారు. 

Updated Date - 2021-07-30T16:56:25+05:30 IST