పోషక లోపాలకు చెక్‌

ABN , First Publish Date - 2022-01-20T05:01:20+05:30 IST

చిన్నారుల్లో పోషక లోపాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీల వ్యవస్థ ద్వారా బాలామృతాన్ని అందిస్తున్నది.

పోషక లోపాలకు చెక్‌
జిల్లా కేంద్రంలోని ఇందిరకాలనీలో బాలింతలకు, చిన్నారులకు గుడ్లు, బాలామృతం పంపిణీ చేస్తున్న టీచర్‌ (ఫైల్‌)

- చిన్నారుల్లో పోషక లోపాలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ

- ఆర్‌బీఎస్‌కే, ఐసీడీఎస్‌ ఉమ్మడి ప్రణాళికతో మూడు నెలల డ్రైవ్‌ నిర్వహణ


వనపర్తి టౌన్‌, జనవరి 19 : చిన్నారుల్లో పోషక లోపాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీల వ్యవస్థ ద్వారా బాలామృతాన్ని అందిస్తున్నది. ఈ ప్రక్రియ జిల్లాలోని వనపర్తి, ఆత్మకూర్‌, పెబ్బేరు ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు బాలామృతం అందిస్తున్నారు. అయితే, బాలామృతం ద్వారా సంపూర్ణ పోషకాలు అందడం లేదని గుర్తించిన ప్రభుత్వం మరిన్ని అధిక పోషక గుణాలు ఉన్న ఆహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వం కొత్తగా ‘బాలామృతం ప్లస్‌’ను ప్రవేశపెట్టింది. ఇందులో చిన్నారుల ఎదుగుదలకు కావల్సిన పాలపొడి, పల్లీనూనె, రైస్‌, గోధుమలు, శనగపప్పు, చక్కెరతో పాటు, కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిశ్రమాలతో తయారుచేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జోగులాంబ గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో బాలామృతం ప్లస్‌ను అంగన్‌వాడీల ద్వారా చిన్నారులకు పంపిణీ చేస్తోంది. త్వరలోనే బాలామృతం ప్లస్‌ను వనపర్తి జిల్లాలోను ప్రారంభించి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందజేసేందుకు మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. 


 రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌

చిన్నారుల్లో పోషక లోపాలను గుర్తించి అరికట్టడంలో వనపర్తి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టు నుంచి మూడునెలల పాటు కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీడబ్ల్యూవో సూచనలతో ఆర్‌బీఎస్‌కే, ఐసీడీఎస్‌ ఉమ్మడి ప్రణాళికతో జిల్లాలోని 0 నుంచి 6 సంవత్సరాలలోపు చిన్నారులకు పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రైవ్‌ నిర్వహణ ద్వారా జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో 1100 మంది చిన్నారులను గుర్తించి, పౌష్టికాహార లోపం 31.2శాతం ఉందని అధికారులు గుర్తించారు. వీరిని ఆర్‌బీఎస్‌కే డాక్టర్లు, ఐసీడీఎస్‌ అధికారుల బృందం ప్రతిరోజు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఇంటింటికి తిరిగి ఆహార నియమాలపై అవగాహన కల్పించారు. పోషకలోపంతో ఉన్న చిన్నారులు ప్రతి రెండు గంటలకు ఒకసారి పౌష్టికాహారం తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతీరోజు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించడం ద్వారా 31.2 శాతం ఉన్న లోప పోషణను ప్రస్తుతం 1.71కు తగ్గించి స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి చేత జిల్లా అధికారులు ప్రశంసలు పొందారు. త్వరలో జిల్లాలోను పంపిణీకి సిద్ధం కానున్న బాలామృతం ప్లస్‌తో 1.71 పోషకలోప శాతాన్ని కూడా పూర్తిగా తగ్గించి పోషకలోప రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు ఉత్సాహం చూపుతున్నారు. 


 ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ 

చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన అధికారులు పౌష్టికాహార లోపాలను వెలికితీయడం కోసమే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వారి బరువు, ఎదుగుదలను ఆర్‌బీఎస్‌కే డాక్టర్లచే హెల్త్‌ చెకప్‌ చేయించారు. జిల్లాలో ప్రస్తుతం వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూర్‌ మూడు ప్రాజెక్టుల పరిధిలో కలిపి 589 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, అందులో 545 ప్రధాన కేంద్రాలుగా, 44 మినీ అంగన్‌వాడీ కేంద్రాలుగా పని చేస్తున్నాయి. మూడు ప్రాజెక్టులలో కలిపి 7 నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులు 14,949 మంది, 3 నుంచి 6 సంవత్సరాల బాలబాలికలు 10,138 మంది, 2,492 మంది గర్భిణీలు, 2,422 మంది బాలింతలు జిల్లాలో ఉన్నారు. ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయి లబ్ధిదారులకు అందింది, లేనిదీ తెలుసుకోవడం, అమలులో పారదర్శకతను పెంపొందించడం కోసం జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో గల 589 అంగన్‌వాడీ కేంద్రాలలో ఎస్‌ఎస్‌ఏఏటీ అనే సంస్థ ద్వారా సామాజిక తనిఖీలు జరిపి ఎదుగుదలే లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి సఫలీకృతం అయ్యారనే చెప్పాలి. 

 మూడు నెలలు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాం..

- పుష్పవతి, సంక్షేమ అధికారి, వనపర్తి జిల్లా

కరోనా సమయంలో గత ఏడాది ఆగస్టు మా సంలో పాఠశాలలు మూతపడినప్పటికీ అంగన్‌ వాడీల ద్వారా పోషక లోపాలను పారదోలడం కోసం ఆర్‌బీఎస్‌కే, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాం. అంగన్‌వాడీ పరిధిలో నమోదైన చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఎదుగుదలపై దృష్టి పెట్టి పోషక లోపాలను గుర్తించి, పౌష్టికాహారం అందించాం. 31.2 శాతం ఉన్న పౌషికాహార లోపాన్ని ప్రస్తుతం 1.71 శాతానికి తగ్గించాం. రానున్న రోజుల్లో అది కూడా అధిగమించి పౌష్టికాహార లోప రహిత జిల్లా గా మార్చేందుకు కృషి చేస్తాం. 



Updated Date - 2022-01-20T05:01:20+05:30 IST