ఈ టమాటాతో ప్రొస్టేట్‌ కేన్సర్‌కు చెక్‌!

ABN , First Publish Date - 2021-03-01T14:03:20+05:30 IST

ప్రొస్టేట్‌ కేన్సర్‌కు చెక్‌ పెట్టేందుకు సరికొత్త ఆవిష్కరణతో ముందుకొస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఈ కేన్సర్‌ను నియంత్రించేందుకు ఓ టమాటాను అభివృద్ధి చేస్తున్నారు. ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అడ్డుకునే శక్తి లైకోపిన్‌ అనే పోషక పదార్థంలో పుష్కలంగా ఉంటుంది. ఈ లైకోపిన్‌..

ఈ టమాటాతో ప్రొస్టేట్‌ కేన్సర్‌కు చెక్‌!

సాధారణ టమాటాలో కంటే మూడింతల ఎక్కువ  లైకోపిన్‌

హెచ్‌సీయూలో పదేళ్ల పరిశోధన ఫలితం


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి28 (ఆంధ్రజ్యోతి): ప్రొస్టేట్‌ కేన్సర్‌కు చెక్‌ పెట్టేందుకు సరికొత్త ఆవిష్కరణతో ముందుకొస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఈ కేన్సర్‌ను నియంత్రించేందుకు ఓ టమాటాను అభివృద్ధి చేస్తున్నారు. ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అడ్డుకునే శక్తి లైకోపిన్‌ అనే పోషక పదార్థంలో పుష్కలంగా ఉంటుంది. ఈ లైకోపిన్‌.. టమాటాలో ఎక్కువగా దొరుకుతుంది. నాలుగైదు సాధారణ టమాటల్లో ఉండే లైకోపిన్‌.. కేవలం ఒక్క టమాటాలోనే దొరికేలా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం.. విజయవంతమైంది. సాధారణంగా కూరగాయాల్లో పోషక పదార్థాన్ని పెంచాలంటే జన్యు మార్పిడి చేయడం ఒక్కటే మార్గం. అందుకు మొక్కలోని జన్యువులను వేరే జన్యువులతో కలిపి మరో కొత్త వంగడాన్ని సృష్టిస్తారు. కానీ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని లైఫ్‌ సైన్సెస్‌ విభాగానికి చెందిన ఆర్‌టీజీఆర్‌ సారథ్యంలోని ప్రొఫెసర్ల బృందం.. టమాటా మొక్కలో ఉండే జన్యువులను ఇతర జన్యువులతో కలుపకుండా కేవలం రసాయన పద్ధతుల్లో మార్పు తీసుకొచ్చింది. 


ప్రపంచంలో తొలిసారిగా.. జన్యుమార్పిడి చేయకుండా ఉన్న జన్యువు నుంచే సరికొత్త వంగడాన్ని హెచ్‌సీయూ తీసుకొచ్చింది. ప్రొఫెసర్‌ ఆర్‌పీ శర్మ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎల్లమరాజు శ్రీలక్ష్మి సారథ్యంలోని పరిశోధకుల బృందం.. స్థానికంగా పండించే టమాటాలపై సుమారు పదేళ్లకు పైగా పరిశోధనలు చేసింది. టమాటాలో నాణ్యతను పెంచడంతో పాటు పోషకాలను మరింత పెంచేందుకు చేసిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయి. ఇందులో భాగంగా ఆర్కా వికాస్‌ అనే టమాటా విత్తనాలను సేకరించి వాటిని రసాయనంలో కలిపి.. ప్రయోగం చేశారు. దీంతో.. క్రమంగా ఆ విత్తనాల జన్యువుల్లో మార్పులు మొదలయ్యాయి. అది కూడా సాధారణ మార్పు కాదు. దాదాపు వెయ్యి రెట్లు పెరుగుదల కనిపించింది. ఈ విత్తనాలన్నింటినీ స్ర్కీనింగ్‌ చేసి.. హైదరాబాద్‌ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం చేశారు.


ఇటీవల చేతికొచ్చిన సరికొత్త టమాటాలు

టమాటా సాగుకు మెరుగైన సీజన్‌.. అక్టోబర్‌-ఫిబ్రవరి. హెచ్‌సీయూలో సరికొత్తగా జన్యు మార్పు చేసి తీసుకొచ్చిన టమాటా విత్తనాలను సాగు చేయగా.. 75రోజుల్లోనే పంట చేతికొచ్చింది. ఈ టమాటలో పోషకాలు అధికంగా ఉండడంతో పాటు మంచి నాణ్యత కలిగి ఉన్నాయి. టమాటాలు పండిపోయిన తర్వాత కూడా సుమారు 10 నుంచి 15 రోజుల వరకు పాడవకుండా ఉన్నాయి. లైకోపిన్‌ స్థాయి గణనీయంగా పెరిగింది. 


రెండేళ్లలో అందుబాటులోకి రావచ్చు..!

ఈ టమాటా.. రైతుల కంటే ప్రజలకు ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే ఇందులో ఉండే లైకోపిన్‌ పోషక పదార్థం మగవారికి ప్రొటేస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది. బెంగుళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రీసెర్చ్‌ పరిశీలించిన తర్వాత ఏడాది, రెండేళ్లలో అందుబాటులోకి రావచ్చు. ఈ సరికొత్త టమాటా పంటను హెచ్‌సీయూలో సాగు చేశాం. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో రైతులు పండించేందుకు ముందుకొస్తే సహకారం అందిస్తాం.


- హెచ్‌సీయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎల్లమరాజు శ్రీలక్ష్మి

Updated Date - 2021-03-01T14:03:20+05:30 IST