సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌

ABN , First Publish Date - 2021-06-11T07:54:12+05:30 IST

అగమ్యగోచర పరిస్థితిలో వున్న సర్పంచుల నిరీక్షణకు తెరపడింది.

సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 10: రెండు నెలల క్రితం పదవిలోకి వచ్చినా చెక్‌ పవర్‌ లేకపోవడంతో నిధుల వినియోగానికి సంబంధించి అగమ్యగోచర పరిస్థితిలో వున్న సర్పంచుల నిరీక్షణకు తెరపడింది. జిల్లాలో 1412 గ్రామ పంచాయతీలుండగా 1369 పంచాయతీలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి.ఏప్రిల్‌ 3వ తేదీన సర్పంచులు కొలువుదీరారు. నెలల తరబడి నిధుల వినియోగానికి సంబంధించి చెక్‌డ్రాయింగ్‌ పవర్‌ రాలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీ నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ డ్రా చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం సర్పంచులకు చెక్‌డ్రాయింగ్‌ పవర్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో పనులు పట్టాలెక్కించేందుకు మార్గం సుగమమైంది. మొత్తం 1369మంది సర్పంచుల్లో 1215మందికి ఐడీ క్రియేట్‌ చేయడంతో నాలుగైదురోజులుగా నిధుల డ్రా కూడా మొదలైంది. ముగ్గురి వివరాల నమోదులో చిక్కులు ఏర్పడగా మిగిలిన 151 మంది ఐడీ క్రియేషన్‌ శుక్ర, శనివారాల్లో పూర్తవుతుంది. దాంతో వారికి కూడా చెక్‌ పవర్‌ రానుంది. ఖజానా శాఖలో సీఎ్‌ఫఎంఎస్‌ అమల్లోకి రావడంతో సర్పంచులు ఇక చెక్‌ రాయాల్సిన పనిలేదు. చేసిన పనులకు బిల్లులు పెట్టాల్సి ఉంది. బిల్లులపై పంచాయతీ కార్యదర్శి సంతకం చేసి సర్పంచ్‌ లాగిన్‌లోకి అప్‌లోడ్‌ చేయాలి. దాన్ని ఆయన పరిశీలించి బయోమెట్రిక్‌ విధానంతో ఆధార్‌ లింక్‌ చేసి తన ఐడీ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లో సంబంధిత ఎస్‌టీవోకు పంపాలి. ఎస్‌టీవో వాటిని పరిశీలించి సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా పంపిస్తారు. బిల్లు పాసై ఖాతాల్లో డబ్బు జమవుతుంది. ఆ తరువాత డ్రా చేసుకోవచ్చు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏ పద్దుల కింద ఖర్చు చేయాలో ప్రభుత్వం స్పష్టంగా సర్క్యులర్‌ జారీ చేసింది. పంచాయతీల్లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, టెక్నికల్‌ స్టాఫ్‌కు, టౌన్‌ ప్లానింగ్‌, పంచాయతీ డెవల్‌పమెంట్‌ బృందానికి, సోషల్‌ ఆడిట్‌ బృందానికి, కంప్యూటర్ల కొనుగోలుకు నిధులు ఖర్చు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2021-06-11T07:54:12+05:30 IST