ఆధార్‌ కష్టాలకు చెక్‌

ABN , First Publish Date - 2021-06-24T06:46:23+05:30 IST

ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌ కార్డు కీలకంగామారింది. ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించాలన్నా ఆధార్‌ తప్పనిసరైంది.

ఆధార్‌ కష్టాలకు చెక్‌
ఒంగోలులోని ఓ ఆధార్‌ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజలు (ఫైల్‌)

ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు 

వచ్చేనెల రెండో వారం నుంచి అమలు  

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 23 : ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌ కార్డు కీలకంగామారింది. ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించాలన్నా ఆధార్‌ తప్పనిసరైంది. అయితే కొన్ని సమయాల్లో ఆధార్‌ కార్డులో సవరణలు, మార్పులు, అనుసంధానాలతోపాటు అక్షర దోషాలను సరిచేసుకునేందుకు కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయినా కొన్నిసార్లు సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఉంది.   అలాంటి కష్టాలకు పుల్‌స్టాప్‌ పెట్టి, సేవలను సులభతరం చేసేందుకురాష్ట్రప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది, ఇప్పటివరకు పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినఆధార్‌ సెంటర్ల వద్ద క్యూలో రోజుల తరబడి ఎదురుచేసే పనిలేకుండా గ్రామ, వార్డు సచివాలయల్లో ఆధార్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి జీవీడబ్ల్యూ అండ్‌ వీఎస్‌డబ్ల్యూఎస్‌ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. భరత్‌గుప్తా జీవోనెం. 156విడుదల చేశారు. సచివాలయాల్లో ఆధార్‌ సేవలు జూలై రెండవ వారంలో సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.


పైలట్‌ ప్రాజెక్టు కింద 500 గ్రామాలు

కొత్త ఆధార్‌ కార్డు జారీ, మార్పులు వంటి సేవలను గ్రామ/వార్డు సచివాల ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.అయితే మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా 500 గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది ఈ బాధ్యతలను జిల్లా సచివాలయల వ్యవస్థ జాయింట్‌ కలెక్టర్‌లకు అప్పగించారు. సచివాలయాల్లో అడ్మిన్‌ సెక్రటరీలు ఆధార్‌ సేవలను అందించనున్నారు. ప్రతి ఇంటిలో ఆధార్‌ సవరణలపై గ్రామ/వార్డు వలంటీర్లు దరఖాస్తులు అందిస్తారు.ఇందుకు సంబంధించి ధరలను ఈ విధంగా నిర్ణయించారు. కొత్తగా ఆధార్‌ కార్డు పొందేందుకు రూ.100, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ కోసం రూ.100, ఇతర సవరణల కోసం రూ.100, ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు రూ.30 ఫీజు వసూలు చేయనున్నారు.

Updated Date - 2021-06-24T06:46:23+05:30 IST