Abn logo
Sep 26 2021 @ 00:36AM

సంఘ విద్రోహుల ఆట కట్టించేందుకే తనిఖీలు

సోఫీనగర్‌లో మాట్లాడుతున్న డీఎస్పీ

నిర్మల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 25 : గ్రామాల్లో నివాసం ఉండే ప్రజల మధ్య తెలియకుండా సంచరించే సంఘ విద్రోహశక్తుల ఆట కట్టించేందుకు పోలీస్‌శాఖ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి చెప్పారు. శనివారం నేరగాళ్లను అదుపుచేసి శాంతిభద్రతల పరిరక్షణకు గాను సోఫీనగర్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్త వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే సమీప పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించాలని సూచించారు. ఇంటిఅద్దె కోసం వచ్చే వారి సమాచార సేకరణలో భాగంగా యజ మానులు ఆధార్‌కార్డు, ఓటరుగుర్తింపు కార్డు సరిచూసుకున్న తర్వాతే ఇవ్వాల న్నారు. అపరిచితుల వద్ద వాహనాలు కొనుగోలు చేస్తే సమస్యల్లో చిక్కుకుంటా రన్నారు. నగలకు మెరుగులు దిగ్గడం ఆసరా చేసుకుని వచ్చే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మంత్రాల పేరుతో మభ్యపెడతారని వారిపట్ల బహు జాగ్రత్త వ హించాలన్నారు. ప్రజలు పోలీస్‌శాఖతో స్నేహభావంతో ఉండాలని, ప్రశాంతంగా జీవించాలని కోరారు. సంఘ వ్యతిరేకులను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. ప్రజల సహకారంతో మోసాలు అణచివేసి గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు తమశాఖ కృషి చేస్తుందన్నారు. ఈ తనిఖీల్లో ధృవీకరణ పత్రాలు లేని 87 మోటారుసైకిళ్లు, మూడుకార్లు, ఏడుఆటోలు సీజ్‌ చేసినట్లు డీఎస్పీ వివరించారు. పట్టణ సీఐ శ్రీనివాస్‌, సోన్‌ సీఐ రామ్‌ నర్సింహారెడ్డి, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.