తిరుపతిలోని ఆ అపార్ట్‌మెంట్‌లో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే షాక్!.. నడుముకు లుంగీ చుట్టుకుని, దానికి చెప్పులు కట్టుకుని నక్కినక్కి నడుస్తూ..

ABN , First Publish Date - 2021-10-05T06:23:50+05:30 IST

తిరుపతిలో చెడ్డీగ్యాంగ్‌ ప్రవేశించడంపై పోలీసు యంత్రాంగం ఆందోళన చెందుతోంది.

తిరుపతిలోని ఆ అపార్ట్‌మెంట్‌లో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే షాక్!.. నడుముకు లుంగీ చుట్టుకుని, దానికి చెప్పులు కట్టుకుని నక్కినక్కి నడుస్తూ..
నడుముకు లుంగీ చుట్టుకుని, చెప్పులు కట్టుకుని నక్కినక్కి వెళ్తున్న దొంగలు

 చెడ్డీలు, బనియన్లు ధరించి.. నడముకు లుంగీలు చుట్టుకుని, అందులో రాళ్లు నింపుకొని.. చేతిలో రాడ్లు, కత్తులు పట్టుకుని ఇళ్లలో దోపిడీలకు పాల్పడే చెడ్డీగ్యాంగ్‌ తిరుపతిలో అడుగు పెట్టిందా? నగరంలోని ఓ అపార్టుమెంటులో ఆదివారం తెల్లవారుజామున చోరీకి వచ్చిన ముఠా సభ్యుల సీసీ ఫుటేజీలను చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. దీంతో అర్బన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలుకూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 4: చెడ్డీగ్యాంగ్‌ దొంగతనాలు 1999 నుంచి  చోటుచేసుకుంటున్నాయి. కరడుగట్టిన దొంగల ముఠా చెడ్డీగ్యాంగ్‌. వీరిని బనియన్‌ గ్యాంగ్‌ అని కూడా అంటారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని దాహోడ్‌తోపాటు సుమారు 20 గ్రామాల్లో దొంగల ముఠాలున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసించే కొన్ని తెగలవారు చెడ్డీ గ్యాంగులుగా దేశవ్యాప్తంగా దోపిడీలకు పాల్పడుతుంటారు. పేదరికం, నిరక్ష్యరాస్యత, ఉపాధి లేకపోవడంతో వీరు దొంగతనాలే వృత్తిగా జీవిస్తుంటారు. ముఖ్యంగా విజయదశమి, సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఎక్కువగా చోరీలకు పాల్పడుతుంటారు. ఒక్కో ముఠాలో 10 నుంచి 15 మంది ఉంటారు. నాలుగు నుంచి ఆరుగురు ఓ బృందంగా చోరీలకు పాల్పడతారు. వీరు చెడ్డీలు, బనియన్లు వేసుకుంటారు. ఏమాత్రం అలికిడి రాకుండా ఉండేందుకు తమ చెప్పులను నడుముకు కట్టుకుంటారు. పట్టుబడకుండా ఉండేందుకు ఒంటికి నూనె లేదా గ్రీజు పూసుకుంటారు. కత్తులు, గొడ్డళ్లు, ఇనుపరాడ్లను వెంట తెచ్చుకుంటారు. కొందరివద్ద నాటుతుపాకులు కూడా ఉంటాయట. లుంగీని నడుముచుట్టూ జోలెలాగ కట్టుకుని, అవసరమైతే దూరంనుంచే దాడిచేసేందుకు అనువుగా రాళ్లు నింపుకుంటారు. అపార్టుమెంట్లలో చోరీ చేయదలచిన ప్లాట్‌కు పక్కనే ఉన్న మిగతా ఇళ్లకు బయటినుంచి గొళ్లాలు వేస్తారు. ఎంతటి తాళాన్నైనా ఒక్క ఉదుటన పగులగొట్టేస్తారు. చోరీ సమయంలో ఎవరైనా వారిని అడ్డగిస్తే దాడికి దిగతారు. హత్యలకూ వెనుకాడరు. 


శివారు ప్రాంతాలు, తాళాలువేసిన ఇళ్లే టార్గెట్‌

పలు రాష్ట్రాల్లో చోరీలకు, దోపిడీలకు పాల్పడేవీరు ముందుగా ఓ నగరాన్ని ఎంచుకుంటారు. ముఠా సభ్యులందరూ ఆ నగరానికి చేరుకుని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లలో మకాం వేస్తారు. నగర శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకుంటారు. పీచుమిఠాయి, బుడగలు, బొమ్మలు, దుప్పట్లు, కంబళ్లు విక్రయిస్తూ, చిన్నచిన్న వ్యాపారులుగా ఆయా ప్రాంతాల్లో తిరగతారు. ప్రధానంగా శివారు ప్రాంతాలు.. ఒంటరి వ్యక్తులున్న.. తాళాలు వేసున్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడతారు. ఏ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వారికి ఎంత సంపద ఉండొచ్చనేది ముందుగా అంచనా వేస్తారు. నిఘాపెట్టిన ఇళ్లలోని మహిళలద్వారా బంగారం తదితర వాటిని అంచనావేస్తారు. ఇంటి ఆవరణలోను, బాల్కనీల్లో ఆరేసిన బట్టల ద్వారా కూడా ఇంటివారి ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఇంట్లోవారు ఎప్పుడు బయటకు వెళ్తారు.. ఎప్పుడు వస్తున్నారనే విషయాలను బాగా గమనించి రాత్రిపూట దాడిచేస్తారు. ఈ క్రమంలో ఒంటరివారు, శివారుప్రాంతాలవారు జాగ్రత్తగా ఉండాలి. 

 

రిసీవర్లను ఏర్పాటు చేసుకుంటారు

దొంగల నుంచి చోరీ సొత్తు కొనుగోలు చేయడం చాలా లాభకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు చాలా తక్కువధరకు అమ్మేస్తుంటారు. ముఖ్యంగా చెడ్డీగ్యాంగ్‌ నుంచి కొనుగోలుచేయడం మరింత లాభకరం. అందువల్ల మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రాంతాల్లో చోరీ సొత్తును కొనుగోలుచేసేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. ఒక్కోగ్యాంగ్‌ తమకంటూ ఓ వ్యాపారితో ఒప్పందం కుదర్చుకుంటారు. ఆ వ్యాపారులను రిసీవర్లు అంటారు. చెడ్డీగ్యాంగ్‌ చోరీ చేసిన సొత్తును ఎప్పటికప్పుడు రిసీవర్లకు పంపిస్తూ సొమ్ము చేసుకుంటారు. 


నిఘాపెరిగితే మరో ప్రాంతానికి

ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ చెడ్డీగ్యాంగ్‌ అప్రమత్తంగా ఉంటుంది. తాము చేసిన చోరీలు, దోపిడీలపై వస్తున్న వార్తలు, పోలీసుల నిఘా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఒకవేళ పరిస్థితులు తమకు ప్రతికూలంగా మారినట్టు, నిఘాపెరిగినట్టు భావిస్తే మరో నగరానికి వెళ్లిపోతారు. మళ్లీ ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు ఆ ప్రదేశానికిరారు.  


రెండేళ్లక్రితం అర్బన్‌జిల్లాలో.. 

రెండేళ్ల క్రితం తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లాలో చెడ్డీగ్యాంగ్‌ చోరీలకు పాల్పడింది. 2017 నుంచి 2019 లోపు సుమారు 15 చోరీలు చెడ్డీగ్యాంగ్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ పోలీసులు చెడ్డీగ్యాంగ్‌ సభ్యులను అరెస్ట్‌ చేసినక్రమంలో వారిలో ఒకరు తిరుపతి అర్బన్‌జిల్లాలో జరిగిన చోరీలో నిందితుడిగా బయటపడింది. ఈ ఒక్క కేసుతప్ప మిగతా కేసులకు సంబంధించిన ఆధారాలేవీ ఇప్పటి వరకు లభించలేదు.


విద్యానగర్‌కాలనీ వీపీఆర్‌ టవర్స్‌లో చోరీ 

అరగొండకు చెందిన విజయలక్ష్మి (73) భర్త రాజేంద్రనాయుడు ఏడాది కిందట కొవిడ్‌తో మృతిచెందారు. అప్పట్నుంచి ఆమె స్వగ్రామంలో ఉంటోంది. ఆదివారం వేకువజామున సుమారు 2.25 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు చెడ్డీలు, బనియన్లు వేసుకుని, నడుముకు చెప్పులు కట్టుకుని అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డారు. విజయలక్ష్మికి చెందిన ప్లాట్‌ తాళాలు పగులగొట్టి 4 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీచేశారు. తెల్లవారి అపార్ట్‌మెంట్‌ వాసులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎం.ఆర్‌.పల్లె పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు రికార్డయిన చెడ్డీగ్యాంగ్‌ దృశ్యాలుచూసి అవాక్కయ్యారు. నలుగురు ఆగంతకుల వేషధారణ, ఇతర వ్యవహారాలు చూస్తే చెడ్డీగ్యాంగ్‌కు చెందినవారేనని తెలుస్తోంది. చెడ్డీగ్యాంగ్‌గా స్పష్టం కాకున్నా.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


భయపడాల్సిందిలేదు.. అప్రమత్తంగా ఉండండి 

నగరంలో చోరీకి పాల్పడింది చెడ్డీగ్యాంగ్‌ అని చెప్పలేం. నలుగురిలో ఇద్దరు నిక్కర్లు వేసుకున్నారు. అంతమాత్రాన చెడ్డీగ్యాంగ్‌ అనలేం. అయినప్పటికీ చెడ్డీగ్యాంగ్‌ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. నిఘాపెంచి అనుమానితులను గుర్తిస్తున్నాం. అనేక సాంకేతిక పరికరాలద్వారా నిఘాపెట్టాం. ప్రజలు భయపడాల్సిన పనిలేదుగానీ అప్రమత్తంగా ఉండాలి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే, మావంతుగా మీకు భద్రత కల్పిస్తాం. ముఖ్యంగా ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించుకోవాలి. పోలీసులకు తెలియజేస్తే మీరు ఊరినుంచి వచ్చేవరకు మీ ఇంటికి కాపలాగా ఉండి మీ ఆస్తిని కాపాడతాం. 

- వెంకటఅప్పల నాయుడు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ



Updated Date - 2021-10-05T06:23:50+05:30 IST