చీరాలపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-03-01T16:05:04+05:30 IST

చీరాల మున్సిపల్‌ ఎన్నికల విషయంలో..

చీరాలపై ఉత్కంఠ

వైసీపీ అధిష్ఠానం అభిప్రాయ సేకరణ

ముఖ్యులతోపాటు కిందిస్థాయి నేతలను కలిసిన పరిశీలకులు

నేడు మంత్రి బాలినేనికి నివేదిక ఇచ్చే అవకాశం


ఒంగోలు, ఆంధ్రజ్యోతి: చీరాల మున్సిపల్‌ ఎన్నికల విషయంలో వైసీపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నియమించిన పార్టీ పరిశీలకుల బృందం చీరాలలో విస్తృత పరిశీలన చేపట్టింది. అవసరమైతే సోమవారం మధ్యాహ్నం వరకు కూడా సమాచారాన్ని సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదనుగుణంగా మంత్రి బాలినేనికి వారిచ్చే నివేదికను పరిశీలించిన తర్వాత మంగళవారం సాయంత్రానికి చీరాల విషయం తేల్చడంతోపాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. 


చీరాల మునిసిపాలిటీ ఎన్నికల విషయంలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీ జిల్లా పరిశీలకుడు వేమిరెడ్డి ఇటు బలరాం, అటు ఆమంచితో చర్చలు జరపడం, ఆతర్వాత జగన్‌ సూచన మేరకు మంత్రి బాలినేని పరిశీలకులను చీరాలకు పంపడం తెలిసిందే. రాజకీయంగా అపార అనుభవం ఉన్న సంతమాగులూరుకు చెందిన అట్లా చినవెంకటరెడ్డి, బాలినేని వ్యక్తిగత బృందంలో ఒకరైన శేషారెడ్డిలకు ఆ బాధ్యతలు అప్పగించారు. వారు శనివారం రాత్రికి చీరాల చేరి పరిశీలన ప్రారంభించారు. ఉన్నత స్థాయి నుంచి కిందిస్థాయి వరకూ ఉన్న నాయకులను కలిశారు. కీలకమైన నేతల్లో ఎమ్మెల్యే బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌, అలాగే మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ఎమ్మెల్సీ పోతుల సునీతతోపాటు, మాజీ మంత్రి పాలేటి, వైసీపీ రాష్ట్ర నేతలు అమృతపాణి, ఏఎంసీ చైర్మన్‌ గ్రెగోరితోపాటు అన్ని వర్గాల్లో ఆది నుంచి వైసీపీలో ఉన్న నాయకులు, ముఖ్యులతో మాట్లాడారు.


ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే బలరాంకు ఉన్న పట్టు, ప్రజల్లో ఉన్న ఆదరణ.. అలాగే ఆమంచి, ఇటు పోతుల సునీతకున్న ఆదరణపై కూడా సమాచారాన్ని సేకరించడంతోపాటు ముఖ్యంగా నామినేషన్లు వేసిన వారిలో ఏవార్డులో ఎవరు సమర్థులు అనే దానిపై సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. 33 వార్డుల్లో పార్టీ పేరుతో నామినేషన్‌ వేసిన వారిలో ఎవరు సమర్థులు, ఎవరైతే సునాయాసంగా గెలుస్తారన్న అంశానికి ప్రాధాన్యం  ఇచ్చి వారు సమాచారాన్ని సేకరించారని  చెప్తున్నారు. తదనుగుణంగా ఇటు బలరాం, అటు ఆమంచి మధ్యలో సునీతల ప్రభావాలు తెలియజేయడంతోపాటు, ఏవార్డులో ఎవరిని కొనసాగిస్తే ఫలితం సానుకూలంగా ఉంటుందనే అంశాన్ని తెలియజేసే నివేదికను వారు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఆయా సందర్భాల్లో వారికి వ్యక్తమైన అనుమానాలపై కూడా ఎప్పటికప్పుడు మంత్రి బాలినేనితో మాట్లాడి సూచనలు తీసుకున్నట్లు తెలిసింది.


విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రికి వారు పరిశీలన పూర్తి చేసుకుని నివేదికను రూపొందిస్తున్నారు. ఆ సందర్భంగా ఎదురైన సమస్యలు కూడా సోమవారం ఉదయం నివృత్తి చేసుకుని తదనంతరం వారి నివేదికను పూర్తి చేసి సోమవారం ఒంగోలు రానున్న మంత్రి బాలినేనికి ఇవ్వనున్నారు. దాని ఆధారంగా  సమాచారాన్ని సీఎం జగన్‌కు, అవసరమైన మేరకు వేమిరెడ్డికి ఇచ్చి మంగళవారం చీరాల నేతలతో మాట్లాడి తుది నిర్ణయాన్ని బాలినేని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

Updated Date - 2021-03-01T16:05:04+05:30 IST