వైద్యులపై వీరంగం

ABN , First Publish Date - 2020-04-10T08:32:33+05:30 IST

కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యసిబ్బందికి తగిన రక్షణపరికరాలు సమకూర్చమని అడిగినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుధాకర్‌ అనే ఓ వైద్యుడిని సస్పెండ్‌ చేసింది...

వైద్యులపై వీరంగం

కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యసిబ్బందికి తగిన రక్షణపరికరాలు సమకూర్చమని అడిగినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుధాకర్‌ అనే ఓ వైద్యుడిని సస్పెండ్‌ చేసింది. నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రికి చెందిన ఈయన చేసిన తప్పిదమల్లా రోగలక్షణాలతో వస్తున్నవారిని పరీక్షిస్తున్న వైద్యులకు మాస్కులు కూడా లేకపోతే ఎలా? అని ప్రశ్నించడమే. కనీస రక్షణలేని స్థితిలో ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేయలేననీ, సెలవు ఇస్తే వెళ్ళిపోతాననీ అన్నాడు. తాను పనిచేస్తున్న ఆస్పత్రిలో తామంతా ఎదుర్కొంటున్న విషమస్థితిని మీడియాతో చెప్పుకుంటూ, తనతో వస్తే వాస్తవాలు చూపుతానన్నాడు. నర్సీపట్నంలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదైన సందర్భంలో స్థానిక అధికారులు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి తనను వెళ్ళనివ్వకపోవడంతో ఈ డాక్టర్‌ అక్కడ చేరిన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇది ప్రభుత్వానికి ఆలోచన బదులు ఆగ్రహం తెప్పించి సదరు వైద్యుడు సస్పెండ్‌ అయ్యారు. వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కించపరిచారంటూ ఆస్పత్రి సూపరెంటెండెంట్‌ ఆయనపై ఓ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఈ దళిత వైద్యుడిపై కేసు కూడా పెట్టారు. ఇదంతా విన్న తరువాత, కరోనా మహమ్మారిని ముందే పసిగట్టి హెచ్చరించిన వైద్యుడిని చైనా ప్రభుత్వం వెంటాడివేధించిన ఘట్టం ఇప్పటికే గుర్తుకొచ్చి ఉంటుంది. ఆ వైద్యుడి హెచ్చరికలను చైనా బేఖాతరు చేసినందువల్లనే, యావత్‌ ప్రపంచం ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నది.


పాలకులకు లోటుపాట్లు ఎత్తిచూపితే నచ్చదు. అంతా సవ్యంగా ఉన్నదన్న తమ వాదనే అందరూ ఆమోదించాలని అనుకుంటారు. అది జరగనప్పుడు ఇలా నోరుమూయిస్తుంటారు. సుధాకర్‌ వాదన సత్యదూరమైతే ప్రభుత్వం ఖండించవచ్చు. ఆ ఆసుపత్రిలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో, ఎన్ని మాస్కులు సమకూర్చారో, వాటిని వారంతా ఎంతకాలం వినియోగిస్తున్నారో, ఇతరత్రా రక్షణకవచాలు అక్కడ ఎన్ని పోగుబడివున్నాయో చెప్పవచ్చు. అదేమీలేకుండా, సస్పెండ్‌ చేయడం, కేసుపెట్టడం వల్ల ఆయన వాదనలను ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టినట్టు కాదు. ప్రభుత్వం అన్నీ సమకూర్చినా సదరు డాక్టర్‌ అనవసరపు ఆరోపణలు చేశాడని ప్రజలు అనుకోకపోగా, ఈ చర్య వారికి నిరంకుశంగా కనిపిస్తుంది. కరోనా నివారణలో దేశానికే ఆదర్శంగా ఉండాలని హితబోధలు చేస్తున్నవారు ఒక వైద్యుడిపై ఇలా వ్యవహరిస్తే ఎలా? కరోనా ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వాలు పడుతున్న కష్టాలు, లోటుపాట్లు ప్రజలకు తెలియనివేమీ కావు. మాస్కులు, పీపీఈల కొరత నిజం. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాల్సింది పోయి కొరత ఎత్తిచూపినవారిని శిక్షించడం దుర్మార్గం. వైద్యులకు రక్షణ అక్కరలేదా అన్న సుధాకర్‌ ప్రశ్న అన్యాయమైనదేమీ కాదు. ఇప్పటికే మూడువందల యాభై పైచిలుకు బాధితులతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యాధి తీవ్రమవుతున్న మాట నిజం. గత వారంలో దేశ సగటు కంటే నాలుగురెట్లు ఎక్కువగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగాయన్న వాదనలున్నాయి. మూడోదశలోకి వస్తున్నామనీ, రెండు లక్షల పరీక్షలు చేయవలసి ఉన్నదని ప్రభుత్వ అధికారులే అంటున్నారు.


కరోనా లక్షణాలతో వస్తున్నవారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ, వైద్యుల్లో భయం హెచ్చి రక్షణ పరికరాల కొరతను ఎత్తిచూపడం సహజం. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితుడికి సేవలు అందించిన డాక్టర్‌, హౌస్‌సర్జన్‌, ఇద్దరు స్టాఫ్‌నర్సులకు వైరస్‌ సోకింది. ఏకంగా నలుగురు వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన తరువాత కూడా మిగతా వైద్యులెవరూ నోరువిప్పకూడదంటే ఎలా? వారి రక్షణ అవసరాలన్నీ ప్రభుత్వం నిజంగానే తీర్చగలుగుతుంటే ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతాయి? సమీక్షించుకోవాల్సి పోయి, వైద్యులపైనే అర్థంలేని ఆరోపణలు చేస్తే ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపట్ల నమ్మకం సన్నగిల్లుతుంది. కర్నూలు జిల్లాలో ప్రభుత్వానికీ, ప్రైవేటు ఆస్పత్రులకు మధ్య రేగిన వివాదం కూడా సరిపడా రక్షణకవచాలు లేని దుస్థితిని తెలియచెబుతున్నది. కొవిడ్‌ రోగులకు తొలుత ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందించి, ఆ తరువాత పెరుగుతున్న అవసరానికి అనుగుణంగా ప్రైవేటు ఆస్పత్రులను వినియోగించుకోవాల్సి ఉంది. కానీ, అత్యధిక కరోనా కేసులతో అగ్రస్థానంలో ఉన్న కర్నూలులో ప్రభుత్వ ఆస్పత్రిని మినహాయించి ఎస్మా తప్పదన్న హెచ్చరికలతో ప్రభుత్వం నేరుగా ప్రైవేటు ఆస్పత్రులమీద పడింది. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రులు నగరం మధ్యలోనే ఉన్నప్పటికీ, కర్నూలు ఆసుపత్రికి మాత్రం అదే కారణంగా చూపుతూ మినహాయింపునిచ్చింది. ఇలా ఒకపక్క ప్రభుత్వ వైద్యులను సిబ్బందినీ వదిలేసి, మరోపక్క తమకు మాస్కులు, పీపీఈలు ఇవ్వకుండా చికిత్స చేయమనడం ప్రైవేటు వైద్యులకు ఆగ్రహం కలిగిస్తున్నది. అరెస్టులకైనా సిద్ధమే కానీ, తగిన రక్షణలు లేకుండా వైద్యం అందించేది లేదని వారంతా అంటున్నారు. కరోనా కష్టకాలంలో వైద్యులను అవమానించడం, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం సమాజానికి ఎనలేని కీడుచేస్తుందని ప్రభుత్వం గుర్తించాలి.

Updated Date - 2020-04-10T08:32:33+05:30 IST