మోసగాళ్లు!

ABN , First Publish Date - 2021-07-25T06:17:35+05:30 IST

నమ్మించి మోసం చేస్తున్నారు. నట్టేట ముంచుతున్నారు. రూపాయి, రూపాయి కూడబెట్టుకుని అవసరానికి ఉపయోగపడతాయని మదుపు చేసుకున్న వారి డబ్బులను కొందరు వైట్‌కాలర్‌ నేరగాళ్లు వడ్డీ ఆశపెట్టి దర్జాగా కొట్టేస్తున్నారు.

మోసగాళ్లు!
ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు ఇల్లు

జనం సొమ్ము దోచేసి.. దాచేసి.. జల్సాలు 

పెరిగిన ఆర్థిక నేరాలు

మోసపోతున్న మదుపుదారులు

చీరాలలో సిల్వర్‌సాన్సీ, కొత్తపేటలో శ్రీవారి ఎంటర్‌ప్రైజెస్‌లు

కారంచేడులో మద్యం వ్యాపారి ఐపీ...

పర్చూరు, యద్దనపూడి మండలాలలో రైతులను

మోసగించిన ఇద్దరు మిర్చి వ్యాపారులు 

లబోదిబోమంటున్న బాధితులు.. 

పట్టించుకోని అధికారులు

వేటపాలెం కేంద్రంగా భారీ స్కాంలు

గతంలో శిఖాకొల్లి, ఇప్పుడు శ్రీరామ్‌

సినీఫక్కీలో పోలీసుల ఛేజ్‌... 

అదుపులో ప్రధాన నిందితుడు...!

నమ్మించి మోసం చేస్తున్నారు. నట్టేట ముంచుతున్నారు. రూపాయి, రూపాయి కూడబెట్టుకుని అవసరానికి ఉపయోగపడతాయని మదుపు చేసుకున్న వారి డబ్బులను కొందరు వైట్‌కాలర్‌ నేరగాళ్లు వడ్డీ ఆశపెట్టి దర్జాగా కొట్టేస్తున్నారు. బోర్డులు తిప్పేసి కానరాకుండా పోతున్నారు.  సుమారు దశాబ్దం క్రితం చీరాల పొలిమేర రోడ్డులో బోర్డు తిప్పేసిన సిల్వర్‌ సాన్సీ లిమిటెడ్‌ కంపెనీ నుంచి, తాజాగా వేటపాలెం కోఆపరేటివ్‌ సొసైటీ వ్యవహారం వరకూ ఇదే పరిస్థితి. జనం సొమ్ముతో జల్సా చేస్తున్నారు. శ్రీ వెంకటసాయి ఫైనాన్స్‌ నిర్వాహకుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు శిఖాకొల్లి శ్రీనివాసరావు రెండేళ్ల క్రితం రూ.100కోట్లకు పైగా జనానికి చెల్లించకుండా దుకాణం కట్టేశాడు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని చెబుతూ దర్జాగా తిరుగుతున్నాడు. అలాగే కారంచేడులో వ్యాపారి ఐపీ, కొత్తపేట శ్రీవారి వ్యవహారం ఇలా చీరాల ప్రాంతంలో ఆర్థిక మోసాలు మితిమీరాయి. మంది సొమ్మును అక్రమార్కులు గద్దల్లా తన్నుకుపోతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


చీరాల, జూలై 24: డబ్బులు ఏ రూపేణా ఇచ్చినా తిరిగొస్తుందనే నమ్మకమే పోతోంది... ఇది  ప్రస్తుతం చీరాల ప్రాంతంలో సగటు మదుపుదారుడి మాట. వరుసగా చోటుచేసుకుంటున్న ఆర్థిక మోసాలే ఇందుకు కారణం. మోసం స్థాయి కోట్లల్లో ఉంటుండటంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో చీరాలలో బోర్డు తిప్పేసిన సిల్వర్‌ సాన్సీ నుంచి మొదలు ఇటీవలి వేటపాలెం సొసైటీ వరకు అంతా నమ్మకంగా ముంచేస్తున్నారు. కారంచేడులో ఐపీ పెట్టిన మద్యం వ్యాపారి... పర్చూరు, యద్దనపూడి మండలాల్లో మిర్చి రైతులను మోసం చేసిన ఇరువురు కొనుగోలుదారులతోపాటు కొత్తపేటలో శ్రీవారి ఎంటర్‌ప్రైజస్‌ పేరుతో భారీ మొత్తాలు వసూలు చేసి రాత్రికి రాత్రి దుకాణం సర్దుకుని చెక్కేసిన ఘరానా పెద్ధమనుషుల వ్యవహారం తెలిసిందే. రెండేళ్ల క్రితం శిఖాకొల్లి శ్రీనివాసరావు గోల్‌మాల్‌తోపాటు ప్రస్తుతం వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌లో డిపాజిట్లు చేసిన కోట్ల రూపాయల గల్లంతుకు సంబంధించి ఆ సొసైటీ మేనేజర్‌ శ్రీరామ్‌ శ్రీనివాసరావు, కమిటీ సభ్యుల నిర్వాకం వరకూ పరిశీలిస్తే నమ్మించి మోసం చేసినట్లు అర్థమవుతుంది. ఆయా  వ్యవహారాల్లో కోట్లు చేతుల మారాయన్నది బహిరంగ రహస్యం. న్యాయం చేయాల్సిన పోలీసులు కాలయాపన చేస్తున్నారు. ఇదే అదనుగా చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా  చేసుకుని అక్రమార్కులు కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


పరుల సొమ్ముతో పైలాపచ్చీసు..

ఏ సంస్థలోనైనా తమను నమ్మి మదుపుదారులు దాచుకున్న సొమ్ము తమదికాదని నిర్వాహకులకు తెలుసు. కానీ ఆ సొమ్మును తమ విలాసాలకు, స్థిరాస్తుల పెంపునకు వినియోగించుకున్నారు. అలాంటి వారే తర్వాత బోర్డు తిప్పేసి జనాలను మోసం చేస్తున్నారు. రూ.100కోట్లకుపైగా జనాలకు చెల్లించాల్సిన శిఖాకొల్లి శ్రీనివాసరావు సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రూ.25కోట్లకుపైగా నిధులు గోల్‌మాల్‌ ఘటనలో ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ మేనేజర్‌ శ్రీరామ్‌ శ్రీనివాసరావు నెల జీతం రూ.15వేలు మాత్రమే. విలాసవంతమైన జీవితం అతని సొంతం. అది బహిరంగ రహస్యం. రూ.24 కోట్లకు ఐపీ పెట్టిన కారంచేడుకు చెందిన మద్యం వ్యాపారి ఎక్కడ నష్టపోయాడో ఎవరికీ తెలియదు. పర్చూరు, యద్దనపూడి మండలాల్లో మిర్చి రైతులను ఇద్దరు కొనుగోలుదారులు నమ్మించి మోసం చేశారు. తరువాత తప్పని పరిస్థితిల్లో దామాషా పద్ధతిలో చెల్లింపులు చేశారు. సుమారు దశాబ్దం క్రితం చీరాల పొలిమేర రోడ్డులో సిల్వర్‌ సాన్సీ లిమిటెడ్‌ బోర్డు తిప్పేయటం అప్పట్లో సంచలనం రేపింది. ఆ క్రమంలోనే కొత్తపేటలో శ్రీవారి ఎంటర్‌ప్రైజస్‌ పేరుతో భారీగా సొమ్ము కట్టించుకున్న వారు రాత్రికి రాత్రి దుకాణం సర్దేశారు. ఈ అన్ని ఘటనల్లో సొమ్ములిచ్చిన జనం మోసపోయారు.

 

 పెద్దల మాటతో పోలీస్‌ పంచాయితీ

కారంచేడుకు చెందిన మద్యం వ్యాపారి ఐపీ పెట్టిన నేపథ్యంలో బాధితులు కొందరు రాష్ట్రంలో కీలకంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్దల సిఫార్సుతో చీరాల డీఎస్పీ శ్రీకాంత్‌ స్వీయ పర్యవేక్షణలో మధ్యేమార్గంగా పరిష్కారం చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో డబ్బులిచ్చిన వారు ఏం చేయాలో అర్థంకాక మిన్నకున్నారు.


కీలకనేత పేరు చె బుతున్న స్వాహారాయుళ్లు..!

శ్రీవెంకటసాయి ఫైనాన్స్‌ ద్వారా నిధులు సేకరించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శిఖాకొల్లి శ్రీనివాసరావు, కారంచేడుకు చెందిన మద్యం వ్యాపారులు రాయనీడి సీతారామయ్య, సాంబశివరావులు చీరాల నియోజకవర్గంకు చెందిన ఓ కీలక నేత పేరు చెబుతుండటం గమనార్హం. అతని నుంచి తమకు డబ్బు రావాలని ప్రచారం చేస్తున్నారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిపై సదరు కీలక నేత సీరియస్‌ అయినట్లు తెలిసింది. అయితే వీరు తమ దగ్గర ఉన్న డబ్బును ఇతర రూపాల్లో బ్లాక్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.


 మోసపోయిన వారిలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువ..

గతంలో శ్రీవెంకటసాయి ఫైనాన్స్‌లోనూ, ప్రస్తుతం ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకి సంబంధించి నష్టపోయిన వారిలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఇతరుల్లో కూడా ఎక్కువమంది రూపాయి, రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న పేదవారే.


పోలీసుల అదుపులో శ్రీరామ్‌ శ్రీనివాసరావు..!

ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ నిధుల గోల్‌మాల్‌ కేసు పోలీసులకు  సవాల్‌గా మారింది. ఈ నేపఽథ్యంలో సినీఫక్కీలో ప్రధాన నిందితుడైన సొసైటీ మేనేజర్‌ శ్రీరామ్‌ శ్రీనివాసరావును వేటపాలెం పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత సోమవారం శ్రీనివాసరావు అదృశ్యమయ్యాడు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యింది. ఆ రాత్రి హైదరాబాద్‌లో తన బంధువు ఇంటికి చేరుకున్నాడు. పోలీసులు తమకు తెలిసిన సమాచారంతో హైదరాబాద్‌లో అతని బంధువు ఇంటికి వెళ్లారు. అయితే అంతకు కొన్ని గంటల ముందే శ్రీనివాసరావు అక్కడి నుంచి అనంతపురం వెళ్లాడు. పోలీసులు కూపీ లాగగా ఆ విషయం తెలిసింది. వారు శ్రీనివాసరావును అనుసరిస్తూ అనంతపురం వెళ్లగా అక్కడా లేడు. దీంతో పోలీసులు తమ పద్ధతిలో అక్కడి వారిని విచారించగా అతను ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో విశాఖపట్నం వెళ్లినట్లు తెలిసింది. వెంటనే రిజర్వేషన్‌ చార్ట్‌ ప్రకారం బోగీ నెంబరు, సీటు నంబరు తెలుసుకుని అతను ఆ రైలులో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. అప్పటికే రైలు ఏలూరు దాటింది. దీంతో వెంటనే పోలీసులు తర్వాతి స్టేషన్‌ అయిన తాడేపల్లిగూడెం పోలీసులకు సమచారం తెలిపారు. టెక్నాలజీని వాడారు. అన్ని వివరాలు పంపారు. దీంతో తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో అక్కడి పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. వెనుకనే వెళ్లిన వేటపాలెం పోలీసులు అతన్ని తమ అదుపులోకి తీసుకుని ఇక్కడకు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు విశఽ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.






Updated Date - 2021-07-25T06:17:35+05:30 IST