తెల్లనిదంతా.. కల్లు కాదు!

ABN , First Publish Date - 2021-01-10T05:30:00+05:30 IST

ఈత, తాటి చెట్ల నుంచి తీసే స్వచ్ఛమైన కల్లుకు బదులుగా కల్తీ కల్లు

తెల్లనిదంతా.. కల్లు కాదు!

  • చెట్లు తక్కువ... కల్లు ఎక్కువ..  
  • కల్తీతో పేదల ఆరోగ్యంతో చెలగాటం.. 
  • ఇదీ ఉమ్మడి జిల్లాలో కల్లు వ్యాపారం తీరు 
  • పట్టించుకోని ఎక్సైజ్‌ యంత్రాంగం


ఈత, తాటి చెట్ల నుంచి తీసే స్వచ్ఛమైన కల్లుకు బదులుగా కల్తీ కల్లు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెట్లు తక్కువగా ఉన్నా.. కల్లు ఎక్కువగా సరఫరా అవుతోంది. చెట్ల నుంచి వచ్చే కల్లు తక్కువగా ఉంటే, ఆ కల్లును పదింతలు చేసి సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కిక్కెక్కించే మత్తు పదార్థాలు కలిపి ప్రజల ఆరోగ్యాన్ని కబలిస్తున్నారు.  కల్తీబారిన పడి అనేక కుటుంబాలు ‘చితికి’ పోతున్నాయి. లేని రోగాలను ‘కొని’తెచ్చుకుని ఆర్థికంగా కుదేలవుతున్నాయి. మరికొందరు కాలకూట విషం లాంటి కల్తీ కల్లుకు బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారు. 


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌/ ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ / పరిగి / తాండూరు రూరల్‌ /వికారాబాద్‌: 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జనాభా సంఖ్య 52లక్షలు ఉండగా, ప్రస్తుతం మరో 25 లక్షలు పెరి గిందని అంచనా. రోజుకు ఒక ఈతచెట్టు సగటున 5లీటర్ల కల్లు ఉత్పత్తి అవుతుంది. ఈ లెక్కన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 2,87,555 ఈత చెట్లు ఉండగా, వీటి ద్వారా రోజుకు 8,62,665 లీటర్ల కల్లు వస్తుంది. అలాగే ఒక తాటి చెట్టు రోజుకు 5లీటర్ల కల్లును ఇస్తుండగా.. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని 1,09,981 తాటిచెట్లకు 5,49,905లీటర్ల కల్లు ఉత్పత్తి అవు తుంది. ప్రస్తుతం ఉన్న చెట్లలో సగం చెట్ల వరకే కల్లు గీస్తున్నారు. అంటే ఉత్పత్తి అయ్యే కల్లులో సగం కల్లు మాత్రమే వస్తుంది. శ్రమజీవులకు సరిపడా కల్లు ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ఇతర జిల్లాల నుంచి కల్లును దిగుమతి చేసుకుంటున్నారు. చెట్ల నుంచి తీసే కల్లుకు పెద్ద మొత్తంలో నీరు, మత్తునిచ్చే రసాయనాలు కలుపుతూ ప్రజల ఆరోగ్యాన్ని కబలిస్తున్నారు. ఈత చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినహా.. మిగతా కల్లు విక్రయాలు జరిగే చాలాచోట్ల ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారు.


మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ అధికారులు..

ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడిజిల్లాలో రోజుకు ఎంత కల్లు ఉత్పత్తి అవుతుంది... ఎంత వ్యాపారం జరుగుతుంది... ఎన్ని ఈత, తాటిచెట్లు ఉన్నాయి... అందులో ఎన్ని చెట్లు కల్లును ఉత్పత్తి చేస్తున్నాయనే వివరాలు అధికారుల వద్ద లేకపోవడం శోచనీయం. 


కాటేస్తున్న కల్తీ..

తాటి, ఈత చెట్ల నుంచి తీసే స్వచ్ఛమైన కల్లుకు బదులుగా నిషేధిత మత్తు పదార్థాలతో తయారు చేసిన కృత్రిమ కల్లు తాగి కష్టజీవులు బలవుతున్నారు. ఏళ్ల తరబడి కృత్రిమ కల్లు తాగుతున్న వారంతా ఎముకల గూడులా, జీవచ్ఛవాల్లా తయారవుతున్నారు. రసాయన మోతాదు తగ్గితే తట్టుకోలేక కొందరు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందాకు ఎంతోమంది బలైన ఘటనలున్నాయి. తాజాగా శనివారం వికారాబాద్‌ జిల్లాలో కల్తీ కాటుకు ఒకరు బలి కాగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 200 మందికిపైగా తీవ్ర అస్వస్థకు గుర య్యారు.ఉమ్మడిజిల్లాలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎక్సైజ్‌ శాఖ అధికారులు నామా మాత్రపు కేసులు నమోదు చేస్తూ చేతులు దులుపుకుం టున్నారన్న ఆరోపణలు గుప్పు మంటున్నాయి.


కిక్కు కోసం అల్ఫాజోలం..

కొందరు కల్లు వ్యాపారులు నిషేధిత డైజోఫాం, అల్ఫజోలం వంటి మత్తు పదార్థాలు కలుపుతూ ప్రజలకు కిక్కు పెంచి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మత్తు పదార్థాలు కలపడం ప్రమాదకర మని తెలిసినా.. ధనార్జనే లక్ష్యంగా వ్యాపారులు కల్తీకల్లు తయారు చేస్తున్నారు. ఎక్కువగా రైతు కూలీలు, పేదలు రోజంతా పడిన కష్టాన్ని మరిచిపోయేందుకు కల్లు తాగుతారు. ఒక్కరోజు తాగకపోయినా వారు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తుంటారు.


పెద్ద మొత్తంలో కల్తీ వ్యాపారం..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద మొత్తంలో కల్తీకల్లు వ్యాపారం సాగుతుంది. స్థానిక పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటం, జిల్లాస్థాయి అధికారులు కల్లు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తుండటంతో ఈ వ్యాపారం దర్జాగా సాగుతోంది. బిజినెస్‌ పెంచుకునేందుకు వ్యాపారులు నిషేధిత మత్తు పదార్థాలను వాడుతున్నారు. 


కల్తీ జరిగే ప్రాంతాలివే..

వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం పరిధిలోని తాండూరు మండలంలోని మల్కాపూర్‌, కొత్లాపూర్‌, ఓగీపూర్‌, కరన్‌కోట్‌, బెల్కటూర్‌, నారాయణపూర్‌, చెంగోల్‌, బిజ్వార్‌, అంతారం, జినుగుర్తి, ఉద్దండాపూర్‌, చెనిగేష్‌పూర్‌, కొణాపూర్‌ తదితర గ్రామాల్లో కల్తీ కల్లు వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. 


ఇతర రాష్ర్టాల నుంచి నిషేధిత మత్తు పదార్థాలు

ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్లోరోఫాం, అల్ఫాజోలం, డైజోఫాంలను కలిపి కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి ఈ రసాయన మత్తు పధార్థాలను కొందరు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు. తాండూరు మండలం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి నుంచి ఓగీపూర్‌, కొత్లాపూర్‌, సంగెంకలాన్‌, కరన్‌కోట్‌ గ్రా మాల మీదుగా సులువుగా వ్యాపారులు, దళారులు మత్తు పదార్థాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేరవేస్తున్నారు. పల్లెల్లోని కల్లు దుకాణాల యజమానులు, నిర్వహకులు రహస్యంగా నిషేధిత మత్తు పదార్థాలను కొనుగోలు చేసి కల్లులో కలుపుతున్నారు. అయితే ప్రభుత్వం కల్తీకల్లును పూర్తిగా అరికట్టేందుకు పకడ్బందీ చర్యలకు దిగ డంతో కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు కల్తీకల్లు తయారీకి సాహసించడం లేదు. ఫలితంగా ఏళ్లతరబడి కల్తీ కల్లుకు అలవాటు పడిన వారిలో ఒక్కసారిగా మా ర్పులు చోటు చేసుకుంటున్నాయి. కల్తీకల్లు తాగి ఒక్కసారిగా చెట్ల కల్లు తాగేసరికి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.


కనిపించని ఈత మొక్కలు

వికారాబాద్‌ జిల్లాలో అంతారం, ధన్నారం, మర్పల్లి, నాగారం, కరణ్‌కోట, సంగెం కలాన్‌, చంద్రవంచ, బెల్కటూర్‌, దౌల్తాబాద్‌, హస్నాబాద్‌, మహంతిపూర్‌, మన్నేగూడ, టేకులపల్లి, ద్యాచారం, పట్లూర్‌ తదితర ప్రాంతాల్లో ఈత వనాలున్నాయి. గీతకార్మికులకు ఉపాధి కల్పించేందుకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈత వనాలు పెంచడానికి ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంది. జిల్లాలో నాలుగేళ్ల నుంచి 6.72లక్షల ఈత, తాటి మొక్కలు నాటారు. నాటినప్పుడు ఉన్న శ్రద్ధ వాటి పెంపకంపై లేకపోవడంతో చాలావరకు ఎండిపోయాయి. జిల్లాలో టీఎఫ్‌టీలు 342, కల్లు సహకార సంఘాలు 44 ఉన్నాయి. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1,19,358 ఈత చెట్లు, 2,666 తాటి చెట్లు ఉన్నాయి. అధికారులు చెప్పే ఈత చెట్ల లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న ఈత చెట్ల సంఖ్యకు పొంతన లేదు.


కల్లు గీయని వారికి లైసెన్స్‌లు?

కల్లు గీసేవారికే లైసెన్సు ఇవ్వాలి. కానీ... గీయని వారికీ లైసెన్సులు జారీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడిజిల్లాలో 680 గీతకార్మిక (టీఎఫ్‌టీ) కల్లుదుకాణాల లైసెన్సులున్నాయి. అలాగే కల్లు సొసైటీ (టీసీఎస్‌) లైసెన్సులు 435 ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్సు ఉన్నవారే కల్లు అమ్మకాలు కొనసాగించాలి. ఏ గ్రామంలో చూసినా మూడు నుంచి నాలుగు కల్లు దుకాణాలు కనిపిస్తున్నాయి. ఒక గ్రామానికి లైసెన్సు తీసుకుని నాలుగైదు కల్లుదుకాణాలు నిర్వహిస్తున్నారు. కానీ.. ఒక దుకాణానికి మాత్రమే ప్రభుత్వానికి ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. 


పెరిగిన బాధితులు

వికారాబాద్‌ జిల్లాలో కల్తీకల్లు కలకలం ఇంకా కొనసాగుతోంది. వికారాబాద్‌, నవాబుపేట మండలాల్లో అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శనివారం వరకు 212 మంది అస్వస్థతకు గురికాగా, ఆదివారం మరో 92మంది అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్‌ మండలంలో ఎర్ర వల్లి, కామారెడ్డి, నారాయణపూర్‌, పెండ్లిమడుగు గ్రామాల్లో అస్వస్థతకు గురైన 35 మందిని ఆసుపత్రులకు తరలించారు. నవాబుపేట మండలంలో వట్టిమీనపల్లి, ఆర్కతల, చిట్టిగిద్ద రైల్వే స్టేషన్‌, చిట్టిగిద్ద, కేశవపల్లి, నాగిరెడ్డిపల్లి, ఎకమామిడి, నవాబుపేట, మూలమడ, మమ్మదాన్‌పల్లి, కుమ్మరిగూడ గ్రామాలకు చెందిన 57మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న 21 మందిని ఆసుపత్రుల్లో చేర్పించారు.

కాగా, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న ట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వికారాబాద్‌ ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 


సంఘటన బాధాకరం : ఎంపీ

కల్తీ కల్లు తాగి అస్వ స్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంఘటన చాలా బాధాకరమని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. 


మాఫియాలా రాష్ట్ర పాలన : మాజీ మంత్రి

మాఫియాలా రాష్ట్ర పాలన కొనసాగుతుందని, వికారా బాద్‌ జిల్లాలో కల్తీ కల్లు మాఫియాతో ప్రజలు అనా రోగ్య బారినపడి ఆసుపత్రుల్లో చేరడం బాధాకరమని మాజీమంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. 


ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో కల్లు దందా

ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే కల్లు దందా కొనసాగుతోంది. వికారాబాద్‌ జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడంలేదు. మామూళ్ల మత్తులో ఆబ్కారీ అధికారులు జోగుతున్నారు. గ్రామాల్లో కల్లుతోపాటు బెల్టు షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వికారాబాద్‌, నవాబుపేట మండలాల్లో జరిగిన సంఘటనపై కఠినంగా వ్యవహరించాలి. లేదంటే.. పెద్దఎత్తున ఆందోళన చేపడతాం.      

- జొన్నల రవిశంకర్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి 



2020 సంవత్సరంలో కేసుల వివరాలు

అంశము                 రంగారెడ్డి  మేడ్చల్‌   

నమోదు చేసిన కేసులు 541         219

అరెస్ట్‌ అయిన వారు         430         159

స్వాధీనం చేసుకున్న ప్యాకెట్లు     0         02

తనిఖీ సందర్భంగా తీసిన శాంపిల్స్‌ 62 77

కల్తీకల్లుకు ఉపయోగించిన క్లోరల్‌ హైడ్రేట్‌(కిలోలు) 84 0

డైజోఫామ్‌ (కిలోలు)             0.5 0

అల్ఫాజోలం                     1.5 0

కల్తీకల్లు దుకాణాలపై నమోదైన కేసుల సంఖ్య 46 07

------------------------------------------------------------------------------

టీఎఫ్‌టీ, టీసీఎస్‌ లైసెన్స్‌ వివరాలు

                        రంగారెడ్డి మేడ్చల్‌ వికారాబాద్‌ మొత్తం

గీతాకార్మికులు (టీఎఫ్‌టి) 215         123     342         680

కల్లు సొసైటీ (టీసీఎస్‌)         324         67     44         435

Updated Date - 2021-01-10T05:30:00+05:30 IST