ఆగిన మగ్గం.. బతుకు ఛిద్రం

ABN , First Publish Date - 2021-05-11T05:07:06+05:30 IST

కరోనా చేనేత రంగాన్ని మింగేస్తోంది. గతేడాది నుంచి వరుసుగా రెండేళ్లు వ్యాపారాలు లేక వ్యాపారులతోపాటు చేనేతలు ఆర్థిక ఊబిలో కూరుకుపోయారు.

ఆగిన మగ్గం.. బతుకు ఛిద్రం
వ్యాపారం లేక దుకాణాల్లోనే నిల్వ ఉన్న ఖరీదైన జరీ చీరలు

  చేనేత రంగం అతలాకుతలం

వ్యాపారం లేక నేసిన చీరలన్నీ నిల్వ

ముడిసరుకు ధరలకు రెక్కలు

ఉపాధి లేక ఆర్థిక ఊబిలో నేతన్నలు


జిల్లాలో మగ్గాలు : 6852

చేనేత కుటుంబాలు : పది వేలు

చేనేత వృత్తిపై ఆధారపడిన వారు : 40 వేలు

అనుబంధ వృత్తుల వారు : 30 వేలు


వెంకటగిరి, మే 10 : కరోనా చేనేత రంగాన్ని మింగేస్తోంది. గతేడాది నుంచి వరుసుగా రెండేళ్లు వ్యాపారాలు లేక వ్యాపారులతోపాటు చేనేతలు ఆర్థిక ఊబిలో కూరుకుపోయారు. ఉపాధిలేక ఎంతోమంది కార్మికులు అప్పులపాలయ్యారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్‌ విళయతాండం చేస్తుండటంతో వారిలో మరింత భయాందోళన రేగుతోంది. గత ఏడాది కరోనా విజృంభణతో మందలాది మంది నేత కార్మికులు ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ కోసం కూలీలుగా మారారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ రంగం కాస్త పుంజుకోవడంతో కార్మికులు మగ్గం పనులకు సిద్ధమయ్యారు. మార్చి వరకు నేత పనులు సజావుగా జరగడంతో కార్మికులు కొంత ఊపిరి పీల్చుకొన్నారు. అయితే, వారిలో ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ కావడం, మరణాలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధించింది. దీంతో  ఉత్పత్తులు అమ్ముడుపోక వ్యాపారుల వద్ద వస్త్ర నిల్వలు పేరుకుపోతున్నాయి. 


రూ.కోట్లలో నష్టం

వెంకటగిరిలో 3,500 మగ్గాలు ఉండగా కరోనా తాకిడికి 2వేల మగ్గాల వరకు ఆగిపోయాయి. దీంతో 2వేల కుటుంబాలు ఉపాధి కోల్పోవడంతో సుమారు 10వేల మంది నిరాశ్రయులయ్యారు. ఏప్రిల్‌ నుంచి జులై వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో చేనేత వ్యాపారాలు మూడుపువ్వులు ఆరు కాయలుగా జరగాల్సి ఉంది. రోజుకు సరాసరికి ఒక్క చేనేత వస్త్రాలయం రూ.30-40 లక్షల వరకు వ్యాపారం జరిగేది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో వ్యాపారం మొత్తం పడిపోయినట్టు వ్యాపారులు వాపోతున్నారు. ఇక ఆన్‌లైన్‌ ద్వారా రోజుకు 100 చీరల వరకు కొరియర్‌ ద్వారా బయటి ప్రాంతాలకు వెళ్లేవి. వీటి ద్వారా రూ.5-6 లక్షలు రాబడి ఉండేది. ప్రస్తుతం ఈ వ్యాపారం కాస్త రూ.లక్షకు పడిపోయింది. సుమారు రూ.10 కోట్ల టర్నోవర్‌ జరిగే వ్యాపారం కుదేలైంది. బయట ప్రాంతాల నుంచి రావలసిన అప్పుల లావాదేవీలు కూడా సుమారు రూ.10-15 కోట్లు ఆగిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక వ్యాపారులు తల పట్టుకుంటున్నారు.


ముడిసరుకులకు రెక్కలు

కరోనా తాకిడికి బయట ప్రాంతాల నుంచి ముడిసరుకులు రాలేదు. దీంతో ఆర్డర్లపై నేసిన చీరలు సైతం సగంలో ఆగిపోయాయి. మడిసరుకుల డిమాండ్‌ కావడంతో జరి, పట్టు ధర పెరగడంతో నేసిన చీరలకు ధరలు గిట్టుబాటు కాక కార్మికులు అవస్థలు పడుతున్నారు. పట్టు కేజీకి రూ.1000 నుంచి 1200, జరీ పార్శిల్‌కు రూ.8 వేల నుంచి పదివేలకు పెరిగింది. వెంకటగిరికి రోజుకు 1.50 కోట్ల జరీ, కోటి రూపాయల పట్టు, రూ.15 లక్షలు కాటన్‌ దిగుమతి అయ్యేది. ప్రస్తుతం జరి రూ.60 వేలు, పట్టు రూ.40 వేలు, కాటన్‌ రూ.5 వేలు మాత్రమే దిగుమతి  అవుతోంది.

 

వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి 

కరోనా ప్రభావంతో శుభకార్యాలు లేకుండా పోయాయి. దీంతో వ్యాపారం లేక వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి. బయట ప్రాంతాలకు పంపిన సరుకుల తాలూకు బకాయిలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నార. ఇదే పరిస్థితి కొనసాగితే చాలా వరకు చేనేత వస్త్రాలయాలు మూత పడే దుస్థితి దాపురిస్తుంది. 

- జానపాటి బాలకృష్ణ, చేనేత వస్త్ర వ్యాపారి 


గిట్టుబాటు ధర ఏడీ!?

కరోనా ప్రభావంతో ముడిసరుకులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో నేయించిన చీరలకు గిట్టుబాటు ధర లేదు. అంతకంటే చీరలు అమ్ముడుపోక అవస్థలు పడుతున్నాం. దీంతో ఉన్న మగ్గాలను ఎక్కడివక్కడ ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 

- చింతగింజల సురేష్‌, మాస్టర్‌ వీవర్‌ 


అప్పు చేసి పూట గడుపుకొంటున్నా 

ముడి సరుకుల ధరలు పెరగడం, వ్యాపారాలు లేక పోవడంతో ఆసాములు నేత పనులు ఇవ్వకపోవడంతో ఉపాధి కోల్పోయాం. మగ్గం ఎక్కితేకానీ పూటగడవని బతుకులు మావి. ప్రస్తుతం అప్పు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నా. 

- జింకా రవి, నేత కార్మికుడు


చేనేత రంగాన్ని ఆదుకోవాలి

కరోనా రెండవ దశలో వ్యాపారం లేక వస్త్ర దుకాణాల్లో ఎక్కడి సరుకులు అక్కడే ఉండిపోయాయి. అలాగే ముడి సరుకులు అందక పెరిగిన రేట్లతో నేసిన చీరకు గిట్టు బాటు ధర లేక కార్మికులు కుటుంబ పోషణ కోసం నేత పనులను ఆపేసి పరిశ్రమల్లో పనుల కోసం పరుగులు తీసున్నారు. మరి కొందరు కూలీలుగా మారుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చేనేత రంగం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. పరిశ్రమను కాపాడు కొనేలా ప్రభుత్వం చేయూత అందించాలి.

- కూనా మల్లికార్జున్‌, అవార్డు గ్రహీత  



Updated Date - 2021-05-11T05:07:06+05:30 IST