చెంగల్పట్టు వద్ద ఎన్‌కౌంటర్‌

ABN , First Publish Date - 2022-01-08T15:58:04+05:30 IST

చాలాకాలం తరువాత రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. చెంగల్పట్టు జిల్లా ఉత్తిరమేరూర్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలు హతమయ్యారు. వారిద్దరూ రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితులు కావడం

చెంగల్పట్టు వద్ద ఎన్‌కౌంటర్‌

- ఇద్దరు రౌడీల హతం

- వారిద్దరూ హత్య కేసులో నిందితులు

- యువతి సహా మరో ఇద్దరి అరెస్టు


చెన్నై: చాలాకాలం తరువాత రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. చెంగల్పట్టు జిల్లా ఉత్తిరమేరూర్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలు హతమయ్యారు. వారిద్దరూ రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితులు కావడం గమనార్హం. అంతేగాక ఆ రెండు హత్యలు జరిగిన 12గంటల్లోపే ఎన్‌కౌంటర్‌ జరగడం పోలీసు వర్గాలను సైతం దిగ్ర్భాంతి గొలుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీలను వణుకు పుట్టిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా...

చెంగల్పట్టు కేకే వీధికి చెందిన కార్తీక్‌ అలియాస్‌ అప్పు కార్తీక్‌ (30) గురువారం సాయంత్రం టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న దుకాణంలో టీ తాగేందుకు వెళ్ళాడు. ఆ సమయంలో అతడిని బైకులో వెంబడించిన ముగ్గురు వ్యక్తులు బాంబులు విసిరి, వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. కార్తీక్‌ తలను గుర్తుపట్టనంతగా ముక్కలుగా నరికి పారిపోయారు. ఆ తర్వాత ఆ ముగ్గురు దుండగులు చెంగల్పట్టు మేట్టువీధిలోని శీనివాసన్‌ అనే వ్యక్తి ఇంటిలో ప్రవేశించి టీవీ చూస్తున్న అతడి కుమారుడు మహేష్‌ (22)పై వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో మహేష్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. హత్యగావించబడిన వారిద్దరూ కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు హత్యలు చెంగల్పట్టు పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరగడం గమనార్హం. చెంగల్పట్టు పోలీసులు వారి మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించి హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెంగల్పట్టు ఎస్పీ అరవిందన్‌ నేతృత్వంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హంతకులు కాంచీపురానికి పారిపోయి ఉంటారనే అనుమానంతో ఆ జిల్లా పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంచీపురం జిల్లా తిరుపులి వనం వద్ద దాగి ఉన్న మాధవన్‌ అనే రౌడీని, అతడితోపాటు ఉన్న జెస్సికా అనే యువతిని గురువారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు కాయగూరల వ్యాపారుల హత్యకేసు నిందితులైన  బిస్కట్‌ అలియాస్‌ మొయుద్దీన్‌, దినా అలియాస్‌ దినేష్‌ చెంగల్పట్టు అటవీ ప్రాంతంలో దాగి ఉన్నట్లు తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీసులు ఆ అటవీ ప్రాంతానికి వెళ్ళి వారిని నిర్బంధించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారు పోలీసులపై నాటుబాంబులతో దాడికి దిగారు. దీంతో ఆత్మరక్షణకై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్‌ ఉత్తిరమేరూరు సమీపంలో జరి గింది.. హంతకులు ఇద్దరూ పారిపోయే ప్రయత్నంలో నాటుబాంబులు విసరడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం చెంగల్పట్టు ఆస్పత్రికి తరలించారు. కాంచీపురం సర్కిల్‌ డీఐజీ ఎం.సత్యప్రియ, చెంగల్పట్టు ఎస్పీ అరవిందన్‌ తదితర పోలీసు అధికారులు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నప్పటికీ రాష్ట్రంలోని రౌడీలకు హెచ్చరికలు పంపుతుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2022-01-08T15:58:04+05:30 IST