Chennaiలో తగ్గని వరద నీరు

ABN , First Publish Date - 2021-11-23T14:57:02+05:30 IST

భారీ వర్షాలతో నగరంలోని పలు వార్డుల్లో చేరిన వరద నీరు తగ్గకపోగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. గత వారం రోజులకు పైగా కురిసిన భారీవర్షాలకు ప్రధాన రోడ్లు సైతం ధ్వంసం కావడం

Chennaiలో తగ్గని వరద నీరు

- పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు

- వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం

- 25, 26 తేదీల్లో మళ్లీ వాన గండం!


ప్యారీస్‌(చెన్నై): భారీ వర్షాలతో నగరంలోని పలు వార్డుల్లో చేరిన వరద నీరు తగ్గకపోగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. గత వారం రోజులకు పైగా కురిసిన భారీవర్షాలకు ప్రధాన రోడ్లు సైతం ధ్వంసం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధిచెందిన టి.నగర్‌ బజుల్లా రోడ్డు, తిరుమలపిళ్లై రోడ్డు, ఉస్మాన్‌ రోడ్డు, భారతి నగర్‌ హౌసింగ్‌ బోర్డు, వివేక్‌ జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండడంతో రోడ్లపై నిలిచిన మురుగునీటిలో పాదచారులు, వాహన చోదకులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయకపోవడంతో బస్సులు, ఆటోలు తదితర వాహనాలు గంటల తరబడి నిలిచిపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారు. మధురవాయిల్‌, తిరువేర్కాడు, నెర్‌కుండ్రం, పులియాన్‌తోపు, కొరుక్కుపేట తదితర ప్రాంతాల్లో కనీసం వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో స్థానికులు రాత్రి సమయాల్లో భయాందోళనలు చెందుతున్నారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న 200 వార్డుల్లో చేరిన వరద నీటి తొలగింపు పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్న కారణంగా నగరం ఇంకా తేరుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరింపజేయాలని ప్రజలు కోరుతున్నారు.


 మళ్లీ వాన ముప్పు

రాష్ట్రానికి మరో వాన ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటికే రెండు వారాల పరిధిలో రెండుసార్లు వాయుగుండాల రూపంలో భారీ, అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతలం చేసిన నేపథ్యంలో, మళ్లీ ఈ నెల 25, 26 తేదీల్లో ఐదు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం సోమవారం హెచ్చరించింది. దీనిపై ఆ కేంద్రం డైరెక్టర్‌ పువిఅరసన్‌ మీడియాతో మాట్లాడుతూ, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో 25వ తేది అల్పపీడనం ఏర్పడనుందని, బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 కి.మీ ఎత్తు వరకు కేంద్రీకృతం కానున్న అల్పపీడనం ప్రభావం వల్ల ఈరోడ్‌, సేలం, నామక్కల్‌, కళ్లకుర్చి, పెరంబలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశముందని ఆయన ప్రకటించారు. మిగతా జిల్లాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని, మంగళవారం మదురై, రామనాథపురం, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. అలాగే, కోస్తా, డెల్టా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు 25, 26 తేదీల్లో సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని, వెళ్లిన వారు ఆలోపు తిరిగి రావాల్సిందిగా వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - 2021-11-23T14:57:02+05:30 IST