ఆలయ అర్చకుల నియామకంపై స్టే విధించలేం: హైకోర్టు

ABN , First Publish Date - 2021-10-21T13:47:57+05:30 IST

రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయ అర్చకుల నియామకంపై స్టే విధించలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయాల్లో అర్చకులు, పూజారుల నియామకాలకు సంబంధించి దేవా

ఆలయ అర్చకుల నియామకంపై స్టే విధించలేం: హైకోర్టు

చెన్నై(tamilnadu): రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయ అర్చకుల నియామకంపై స్టే విధించలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయాల్లో అర్చకులు, పూజారుల నియామకాలకు సంబంధించి దేవాదాయశాఖ జారీ చేసిన కొత్త నియమావళిని సవాల్‌ చేస్తూ శివాచార్యుల సేవాసంఘంతో పాటు ఎస్‌.శ్రీధర్‌ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెరంబలూరు జిల్లా చిరువాచ్చూరు మధురకాళియమ్మ ఆలయ పారంపర్య పూజారులు ఎనిమిది మంది కొత్తగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో వుండగానే టీఆర్‌ రమేశ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన మరో పిటిషన్‌ ప్రధాన న్యాయ మూర్తి సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి ఆదికేశవులతో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం ఉదయం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున్యాయవాది తన వాదనలను వినిపిస్తూ పారంపర్య ట్రస్టీలను నియమించకుండానే ఆలయాల్లో అర్చకులు, పూజారులను నియమించడం చట్ట వ్యతిరేకమని, పారం పర్య ట్రస్టీలే అర్చకులను నియమించాల్సి వుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో ఆగమ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న అర్చకులు, పూజారుల నియామకాలపై స్టే విధించాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. అన్ని పిటిషన్లపై విచారణ జరిపాకే తగిన నిర్ణయం వెలువరిస్తామని, అప్పటి వరకూ స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-10-21T13:47:57+05:30 IST