అరుదైన శస్త్రచికిత్స..ఒకే వ్యక్తిలో ఐదు కిడ్నీలు

ABN , First Publish Date - 2021-08-12T01:25:46+05:30 IST

మనిషి శరీరంలో సహజంగా రెండు కిడ్నీలు ఉంటాయి. బంధువులనో, ప్రాణ స్నేహితులనో ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు కిడ్నీ దానం చేస్తే ఒకే ఒక కిడ్నీ మిగులుతుంది. కానీ చెన్నైకి చెందిన ఓ వ్యక్తిలో మాత్రం ఏకంగా ఐదు కిడ్నీలు ఉన్నాయి..!

అరుదైన శస్త్రచికిత్స..ఒకే వ్యక్తిలో ఐదు కిడ్నీలు

చెన్నై: మనిషి శరీరంలో సహజంగా రెండు కిడ్నీలు ఉంటాయి. బంధువులనో, ప్రాణ స్నేహితులనో ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు కిడ్నీ దానం చేస్తే ఒకే ఒక కిడ్నీ మిగులుతుంది. కానీ చెన్నైకి చెందిన ఓ వ్యక్తిలో మాత్రం ఏకంగా ఐదు కిడ్నీలు ఉన్నాయి..! ఏంటి ఆశ్చర్యపోతున్నారా..? అసలు ఒక వ్యక్తిలో ఐదు కిడ్నీలు ఎందుకు ఉన్నాయి..? అవన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయా లేదా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా..? అయితే.. ఈ కథనం మీకోసమే..!


ఈ అరుదైన ఘటనకు చెన్నైలోని మద్రాస్ మెడికల్ మిషన్ ఆస్పత్రి వేదికగా మారింది. అక్కడి వైద్యులు జులై 10న సదరు పేషెంట్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. అనంతరం..పలు మార్లు అతడిని పరీక్షించి కోలుకుంటున్నాడని నిర్ధారించారు. ఈ క్రమంలో పేషెంట్‌ పరిస్థితికి సంబంధించి, ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.


1994లో..సదరు పేషెంట్‌కు 14 ఏళ్లు ఉన్నప్పుడు అతడి రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో..అతడికి తొలిసారిగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇలా అమర్చిన కిడ్నీ తొమ్మిదేళ్ల పాటు సక్రమంగానే పనిచేసింది. ఆ తర్వాత అది కూడా చెడిపోవడంతో.. 2005లో మరోసారి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయనకు మరో కిడ్నీ అమర్చారు. ఇది కూడా ఒక 12 ఏళ్ల పాటు బాగానే పనిచేసింది.


ప్రస్తుతం పేషెంట్ వయసు 41. గడిచిన నాలుగేళ్లలో ఈ కిడ్నీ పనితీరు కూడా సన్నగిల్లింది. దీంతో ఆయన పూర్తిగా డయాలిసిస్‌పైనే ఆధారపడాల్సి వచ్చింది. వారానికి ఏకంగా మూడు సార్లు డయాలిసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘‘రక్తపోటు నియంత్రణలో లేకపోవడంతో గతంలో అమర్చిన రెండు కిడ్నీలు విఫలమయ్యాయి. దీనికితోడు ఈ ఏడాది మార్చిలోనే ఆయన ట్రిపుల్ బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నాడు. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.’’ అని మెడికల్ మిషన్ ఆస్పత్రి సర్జన్ డా. ఎస్ శరవణన్ వ్యాఖ్యానించారు. 


కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లు చేసినప్పుడు చెడిపోయిన కిడ్నీలను తొలగించడం జరగదు. దీని బదులు.. పాత వాటికి సమీపంలోనే కొత్త కిడ్నీలను అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ పాత వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తే రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. తద్వారా మరిన్ని సమస్యలు వచ్చిపడతాయని వైద్యులు చెబుతున్నారు. ‘‘పాత కిడ్నీలు తొలగిస్తే రక్తస్రావం కావచ్చు. దీన్నుంచి బయటపడేందుకు మళ్లీ రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలోని రోగనిరోధక శక్తి కొత్త కిడ్నీపై దాడి చేసే(కిడ్నీ రిజెక్షన్) ప్రమాదం ఉంటుంది. దీని వల్ల కొత్త కిడ్నీ చెడిపోయే పరిస్థితి తలెత్తవచ్చు’ అని డా. శరవణన్ పేర్కొన్నారు.


ఇప్పటికే నాలుగు కిడ్నీలు ఉండటంతో కొత్త కిడ్నీని అమర్చడం కోసం శరీరంలో జాగాను గుర్తించేందుకు వైద్యులు చాలా శ్రమించాల్సి వచ్చింది. ‘‘ఐదో కిడ్నీలోని రీనల్ రక్తనాళాలను శరీరంలోని రక్తనాళాలకు జోడించడం మరింత కష్టంగా మారింది. ఇప్పటికే పనిచేయని నాలుగు కిడ్నీలు రోగి శరీరంలో ఉన్నాయి. దీంతో కొత్త కిడ్నీకి రక్తప్రసరణ ఏర్పాటు చేసేందుకు శరీరంలోని ఆర్టరీ, వెయిన్స్‌పై చోటు చాలక ఇబ్బంది పడాల్సి వచ్చింది.’’ అని శరవణన్ తెలిపారు. 



వైద్యులు.. కొత్త కిడ్నీని రోగి పేగులకు సమీపంలో అమర్చారు. అయోర్టా రక్తనాళం రెండుగా విడిపోయే చోట కొత్త కిడ్నీలోని రీనల్ ఆర్టరీని(సిర) జోడించారు. రీనల్ వెయిన్(ధమని)ను ఇన్‌ఫీరియర్ వెనకావాతో జోడించారు. ట్రాన్స్‌పెరిటోనియల్ అప్రోచ్ విధానంలో జరిగిన ఈ శస్త్రచికిత్స అత్యంత అరుదైనదని డా. శరవణన్ పేర్కొన్నారు. రోగి పరిస్థితిని మరి కొన్ని నెలల పాటు నిశితంగా పరిశీలిస్తామని వైద్యులు తెలిపారు.

Updated Date - 2021-08-12T01:25:46+05:30 IST