చెన్నైలో భారీవర్షాలు...ప్రభుత్వ ఉద్యోగులకు Work from home

ABN , First Publish Date - 2021-11-08T13:02:51+05:30 IST

తుపాన్ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించారు...

చెన్నైలో భారీవర్షాలు...ప్రభుత్వ ఉద్యోగులకు Work from home

చెన్నై: తుపాన్ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించారు. గత కొద్ది రోజులుగా చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.శనివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చెన్నై నగరంలో పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.చెన్నైలోని పాడి, పురసవల్కం, కొలత్తూరు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. మదురై, కడలూరు జిల్లాల్లో అత్యవసర సేవల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) నాలుగు బృందాలను మోహరించినట్లు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.


 రానున్న 48 గంటల్లో తమిళనాడులోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.ఆదివారం ఉదయం నుంచి 44 పునరావాస కేంద్రాల్లో 50 వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశామని సీఎం చెప్పారు.రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నందున ప్రజలు తమ ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 


అధికారులను అప్రమత్తం చేశామని రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు.నగరంలో వర్షాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ - 1070 ఏర్పాటు చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రారంభంతో అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు రాష్ట్రంలో 334.64 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, ఇది ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం కంటే 44 శాతం ఎక్కువ అని సీఎం స్టాలిన్ చెప్పారు.


Updated Date - 2021-11-08T13:02:51+05:30 IST