కోల్‌కతాపై చెన్నై అనూహ్య విజయం

ABN , First Publish Date - 2020-10-29T05:30:00+05:30 IST

ఐపిఎల్ 2020లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ అనూహ్య విజయం సాధించింది. కోల్‌కతా సనాయసంగా ఈ మ్యాచ్ గెలుస్తుందనుకున్న తరుణంలో చివరి రెండు ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఫలితాన్ని తారుమారు చేశాడు...

కోల్‌కతాపై చెన్నై అనూహ్య విజయం

దుబాయ్: ఐపిఎల్ 2020లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై  చెన్నై సూపర్ కింగ్స్‌ అనూహ్య విజయం సాధించింది. కోల్‌కతా సనాయసంగా ఈ మ్యాచ్ గెలుస్తుందనుకున్న తరుణంలో చివరి రెండు ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఫలితాన్ని తారుమారు చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో 10 పరుగుల అవసరం ఉండగా క్రీజులో ఉన్న జడేజా ఆ రెండు బంతులకు రెండు సిక్స్‌లు బాది చెన్నై జట్టుని విజయతీరానికి చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన కోల్‌కతాకు ఇక ప్లే ఆఫ్స్ ఛాన్సు్ లేనట్లే. 


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసి చెన్నై సూపర్ కింగ్స్‌కి సవాలు విసిరింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణాలు చెలరేగి ఆడారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 17 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన గిల్.. కర్న్ శర్మ బౌలింగులో బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్ (7), రింకు సింగ్ (11), ఇయాన్ మోర్గాన్ (15)‌లు రాణించకపోయినా క్రీజులో కుదురుకున్న రాణా చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేసి లుంగి ఎంగిడి బౌలింగులో శామ్ కరన్‌కు దొరికిపోయాడు. దినేశ్ కార్తీక్ (21), రాహుల్ త్రిపాఠి (2) నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 2 వికెట్లు పడగొట్టగా, శాంట్నర్, రవీంద్ర జడేజా, కర్న్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.



చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే 173 పరుగుల లక్ష్యం సాధించడానికి  వచ్చిన ఓపెనర్లు వాట్సన్, రుతురాజ్ గైక్వాడ్ మంచి ఆరంభానిచ్చారు. ఇద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేశారు. వాట్స్‌న్ 14(19 బంతుల్లో)  పరుగులు చేసి ఓటయ్యాడు. క్రీజులో ఉన్న గైక్వాడ్  ఆ తరువాత వచ్చిన రాయుడుతో కలిసి బౌండరీల వర్షం కురిపించాడు. 10వ ఓవర్‌లో రాయుడు ఏకంగా హ్యాట్రిక్ బౌండరీలు కొట్టాడు. ఆ వెంటనే ఫెర్గూసన్  వేసిన ఓవర్‌లో గైక్వాడ్ అర్థసెంచరీ పూర్తిచేసుకున్నాడు.  దూకుడుగా ఆడుతున్న రాయుడు కమిన్స్ బౌలింగ్‌లో నరైన్ చేతికి చిక్కాడు. రాయుడు 38(20 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) చేసి ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన ధోనీ 1(4) పరుగు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  ఆ వెంటనే గైక్వాడ్ 72(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ర్లు) కూడా ఔటయ్యాడు. ఇక మ్యాచ్ కష్టతరం అనుకున్న సమయంలో ఎప్పటిలాగే జడేజా 31(11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో గెలుపు సాధించాడు. గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.


Updated Date - 2020-10-29T05:30:00+05:30 IST