అష్ట దిగ్బంధనంతో తగ్గిన కాలుష్యం... చెన్నైవాసులకే అధిక సంతోషం...

ABN , First Publish Date - 2020-06-03T23:30:35+05:30 IST

మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం

అష్ట దిగ్బంధనంతో తగ్గిన కాలుష్యం... చెన్నైవాసులకే అధిక సంతోషం...

చెన్నై : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం వల్ల వాయు కాలుష్యం తగ్గింది. దీంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల ప్రజలు హాయిగా శ్వాస పీల్చుకోగలుగుతున్నారు. అయితే ఈ మూడు నగరాలకు చెందినవారిలో ఎక్కువ సంతోషంగా ఉన్నది మాత్రం చెన్నైవాసులేనని ఓ అధ్యయనం వెల్లడించింది. 


గ్రీన్‌పీస్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అందజేసిన సమాచారాన్ని విశ్లేషించారు. గత ఏడాది, ఈ ఏడాది ఏప్రిల్ నెలల్లో వాయు కాలుష్యం వివరాలను పరిశీలించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పీఎం 2.5 గత ఏడాది ఏప్రిల్‌లో పీఎం 2.5 కన్నా 55.56 శాతం తగ్గిందని వెల్లడైంది. అదే విధంగా నైట్రోజన్ డయాక్సైడ్ 23.86 శాతం తగ్గినట్లు వెల్లడైంది. 


ఇదే సమయంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో పీఎం 2.5, నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయుల కన్నా చెన్నై నగరంలో వీటి స్థాయులు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 


ఈ ఏడాది ఏప్రిల్‌లో పీఎం 2.5 లెవెల్స్ చెన్నైలో 17.79 మైక్రోగ్రామ్స్ పెర్ క్యూబిక్ మీటర్, బెంగళూరులో 24.72 మైక్రోగ్రామ్స్ పెర్ క్యూబిక్ మీటర్, హైదరాబాద్‌లో 30.38 మైక్రోగ్రామ్స్ పెర్ క్యూబిక్ మీటర్ ఉన్నాయి. 


ఈ ఏడాది ఏప్రిల్‌లో నైట్రోజన్ డయాక్సైడ్ లెవెల్స్ చెన్నైలో 8.52 మైక్రోగ్రామ్స్ పెర్ క్యూబిక్ మీటర్, బెంగళూరులో 12.00 మైక్రోగ్రామ్స్ పెర్ క్యూబిక్ మీటర్, హైదరాబాద్‌లో 12.00 మైక్రోగ్రామ్స్ పెర్ క్యూబిక్ మీటర్ ఉన్నాయి. 


గ్రీన్‌పీస్ ఇండియా సీనియర్ క్యాంపెయినర్ అవినాశ్ చంచల్ మాట్లాడుతూ, దీర్ఘకాలిక వాయు నాణ్యత సమస్యలను పరిష్కరించవలసి ఉందన్నారు. దీని కోసం మెరుగైన విధానాలు అవసరమన్నారు. కోవిడ్-19 మహమ్మారి వంటి సంక్లిష్ట సమయంలో మనం పరిశుభ్రమైన గాలిని పీల్చుకోగలిగామని చెప్పారు. వాయు కాలుష్యంలో భారీ తగ్గుదల కనిపించిందన్నారు. మానవుడి కార్యకలాపాలే వాయు కాలుష్యానికి కారణమని తెలుస్తోందని చెప్పారు. అవసరమైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మెరుగైన గాలిని పీల్చుకోవడం సాధ్యమవుతుందన్నారు.


Updated Date - 2020-06-03T23:30:35+05:30 IST