వలసలు మళ్లీ షురూ!

ABN , First Publish Date - 2020-12-05T06:42:01+05:30 IST

చెరకు సీజన్‌ ప్రారంభమైందంటే చాలు ఖేడ్‌ నియోజకవర్గంలో ఏ రహదారిపై చూసినా ‘బండెనుక బండి కట్టి’ అనే పాటను తలపించేలా ఎడ్లబండ్ల బారులు దర్శనమిస్తాయి.

వలసలు మళ్లీ షురూ!
ఖేడ్‌ ప్రాంతం నుంచి కుటుంబాలతో వలస వెళ్తున్న గిరిజనులు

 ఆలస్యంగా ప్రారంభమైన చెరకు సీజన్‌

 తగ్గిన సాగుతో ప్రశ్నార్థకంగా ఉపాధి 

 ఖేడ్‌ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు గిరిజనుల వలసలు

 పత్తి రైతులకు కూలీలు లభించక తప్పని ఇక్కట్లు  

 వలసల నివారణకు చర్యలు శూన్యం


నారాయణఖేడ్‌, డిసెంబరు 4: చెరకు సీజన్‌  ప్రారంభమైందంటే చాలు ఖేడ్‌ నియోజకవర్గంలో ఏ రహదారిపై చూసినా ‘బండెనుక బండి కట్టి’ అనే పాటను తలపించేలా ఎడ్లబండ్ల బారులు దర్శనమిస్తాయి. వలసలు ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతంలోని తండాల్లో నివసించే గిరిజనులు మూట ముల్లె సర్దుకుని పిల్లా జెల్లా అంతా కలిసి  ఉపాధి కోసం ఎడ్లబండ్లపై ఇతర ప్రాంతాలకు తరలివెళ్తారు. ఈ క్రమంలో వెంట పశువులను సైతం తీసుకెళ్తారు. చెరకు సాగు విస్తీర్ణం ఆశాజనకంగా ఉంటే వలస కార్మికులకు ఉపాధి అధిక రోజులు లభిస్తుంది. సాగు తక్కువగా ఉంటే పనులు కూడా అంతంత మాత్రమే లభించి ఉపాధి ప్రశ్నార్థకమవుతుంది. ఈ ఏడాది  చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో వలస వెళ్లిన సీజన్‌ మొత్తం పని లభిస్తుందనే నమ్మకం లేక పోయినా కుటుంబాల పోషణ కోసం వలస వెళ్లక తప్పని పరిస్థితి. అయినప్పటికీ వలసల నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. 

ఉపాధి కరువై..

నారాయణఖేడ్‌ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దుల్లో ఉండటంతో పాటు ఈ ప్రాంతంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. దీంతో సాధారణంగా 30 శాతం ప్రజలు శాశ్వతంగా వలసలు వెళ్లి ఇతర ప్రాంతాల్లో జీవిస్తుంటారు. గిరిజనులు మాత్రం ఏటా చెరకు సీజన్‌లో సీజనల్‌ వలసలు వెళ్తారు.  

ప్రమాదమైనా తప్పని ప్రవాసం

వలసల నివారణకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చేతల్లో కనిపించడం లేదు. దీంతో ఏటా గిరిజనుల వలసలు తప్పడంలేదు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో వలస వెళితేనే తమ కుటుంబాల పోషణతో పాటు పశువులను పోషించుకోగల్గుతామని గిరిజనులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓ వైపు చలి వణికిస్తున్నప్పటికీ కుటుంబ పోషణ కోసం వెళ్లక తప్పని పరిస్థితి ఈ ప్రాంతంలోని గిరిజనులది. ఈ సారి చెరకు సాగు అంతంత మాత్రంగానే ఉండడంతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా వలస వెళ్లాల్సి  ఉంటుంది. తాము చక్కెర కర్మాగారాల వద్ద చిన్న గుడిసెలు వేసుకొని ఉంటామని, ఈ క్రమంలో ప్రమాదాల మధ్య జీవనం సాగించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. గతంలో తాము వలస వెళ్లిన ప్రాంతాల్లో ప్రమాదాలు  చోటు చేసుకొని కొందరు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం తమకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తే వలస వెళ్లాల్సిన అవసరమే లేదని, ఉపాధి లేకనే  వలసలు వెళ్తున్నామని పలువురు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఖేడ్‌ నుంచి నాలుగైదు రోజులుగా మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి. 

తండాల్లోని గుడిసెల్లో ఉండేది వృద్ధులు, పిల్లలే

ఖేడ్‌ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 190 గిరిజన తండాలు ఉన్నాయి.  నియోజకవర్గంలో గిరిజనుల జనాభా 40 వేలకు పైనే చిలుకు ఉంటుంది. సీజన్‌ వచ్చిందంటే  గిరిజన తండాల నుంచి అనేక మంది ఎడ్ల బండ్లతో పాటు తమ వద్ద ఉన్న పశువులను వెంట తీసుకొని వలస వెళ్తుంటారు. వలసల సీజన్‌లో తండాలలో వృద్ధులు, చిన్నారులు మాత్రమే ఉంటారు. ఇళ్లలో చిన్నారులను  చూసుకునేవారు లేనివారు మాత్రమే వారిని తమ వెంట తీసుకెళ్తుంటారు. ఏటా దీపావళి పండుగ తర్వాతే వలసలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం చెరకు సాగు లేకపోవడంతో ఆలస్యంగా ఇప్పుడిప్పుడే వలసలు ప్రారంభమయ్యాయి. వలస వెళ్లేవారు ఎడ్ల బండిపై వాటి పోషణకు అవసరమయ్యే పశుగ్రాసంతో పాటు తిండి గింజలు, ఇతర సామగ్రిని, చిన్నారులను తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం ఖేడ్‌ ప్రాంతంలోని ఏ రహదారి గుండా వెళ్లినా వలస జీవులే దర్శనమిస్తున్నారు. 




కూలీలు లభించక పత్తి రైతుల ఇక్కట్లు

కాగా ఈ సంవత్సరం ఖేడ్‌ ప్రాంతంలో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో  చెరకు కూలీలు ఖేడ్‌ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.  పత్తిని తీయడానికి స్థానికంగా కూలీలు లభించక పత్తిరైతులకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో  ఈ ప్రాంతంలోని పత్తి రైతులు ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి కూలీలను ఈ ప్రాంతానికి తీసుకువచ్చి వారికి స్థానికంగా అన్ని వసతులు కల్పించాల్సి వస్తున్నది. పత్తి కోసం ఇతర ప్రాంతాల కూలీలు ఖేడ్‌కు వస్తే , చెరకు కోసం ఈ ప్రాంతంలోని కూలీలు మరో ప్రాంతానికి వలసలు వెళ్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గిరిజనులకు స్థానికంగా ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటే స్థానిక రైతులతో పాటు గిరిజనులకూ కష్టాలు తప్పుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-05T06:42:01+05:30 IST