చేతకాకున్నా బతుకు తమ్ముడూ!

ABN , First Publish Date - 2021-04-09T05:40:45+05:30 IST

ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా? చేతికి అందివచ్చాక కోరుకొని కొడుకు కాటికి వెళ్లితే, కనిపెంచిన అమ్మానాన్నలను కళ్లలో పెట్టుకొని చూసేది ఎవరు?...

చేతకాకున్నా బతుకు తమ్ముడూ!

ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా? చేతికి అందివచ్చాక కోరుకొని కొడుకు కాటికి వెళ్లితే, కనిపెంచిన అమ్మానాన్నలను కళ్లలో పెట్టుకొని చూసేది ఎవరు? ఒకవేళ పెండ్లి చేసుకొని ఉంటే, భార్యాపిల్లల భారం ఎవరు మోస్తారు? ప్రాణం విలువ, ప్రభుత్వ ఉద్యోగం విలువ ఒక్కటేనా?!


ప్రభుత్వ ఉద్యోగం అనగానే, భద్రత–ఆర్థిక స్థిరత్వం–కుటుంబానికి భరోసా వంటి అంశాలు స్ఫురణకు వస్తాయి. చదువుకు తగినట్లుగా సర్కారు కొలువులో కుదురుకోవాలనుకోవటం తప్పు కాదు. కానీ, జీవితం కోసం ఉద్యోగమే తప్ప, ఉద్యోగమే జీవితం కాదు కదా! ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే, రాకపోతే బతకలేమా? ఊపిరి ఏమైనా ఆగిపోతుందా? మనలో ఎంత మంది అమ్మానాన్నలు ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు? వాళ్లు బతకలేదా? పిల్లలను బతికించుకోలేదా? మనలోనే ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి? మనం బతుకు బండిని నడిపించటంలేదా? పెండ్లి చేసుకోలేదా? సంతానాన్ని పోషించుకోవటం లేదా? చదువుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం లేదని, రాదని, అది తలుపు తట్టటం ఆలస్యం అవుతుందని బలవన్మరణాలకు పాల్పడుతూపోతే, శ్మశాన వాటికలు సరిపోతాయా? 


నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయటం ఈ ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా క్షణికమైన ఆవేశానికి లోనైతే, అనర్థం తప్ప ప్రయోజనం ఉండదు. 


అందరి లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం, లేదంటే మరణమే శరణ్యం అనుకుంటే, 1980 దశకం ద్వితీయార్థం, 1990 దశకం ప్రథమార్థంలో డిగ్రీ విద్యార్హత కలిగిన యువతలో ఇప్పుడు ఒక్కరూ మిగిలి ఉండేవారు కాదేమో! ఇప్పటితో పోల్చుకుంటే, అప్పుడు జీవన వ్యయం తక్కువే కావచ్చు!! సామాజిక, ఆర్థిక స్థితిగతులు మాత్రం వేరు. నాడు తెలంగాణ పల్లె లోగిళ్లలో విద్యార్థి దశపై కుటుంబ నియంత్రణ చాలా స్వల్పం. అప్పటి ఉడుకు రక్తానికి చదువును మించిన ఆకర్షణలు అందుబాటులో ఉండేవి. ఎగిసిపడుతున్న నక్సలైటు ఉద్యమ అయస్కాంత శక్తిని తట్టుకొని వ్యతిరేక దిశలో నిలబడాలి. లేదంటే కూడు పెట్టని క్రీడల దిక్కు దూకాలి. యుక్త వయసులో మనసు కట్టడి ఎంత కష్టం? ఎవరైనా ఆసక్తితో వానాకాలం చదువులు గట్టెక్కిస్తే, ప్రభుత్వ ఉద్యోగం దేవుడెరుగు! ప్రైవేటులో నామమాత్రపు జీతం సంపాదన కనాకష్టంగా ఉండేది. సర్కారు నౌకరీపై ఆశతో ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజీ గడపలో ఒకరిపై మరొకరు పడుతూ, నోరు తడారి, కాళ్లు పీక్కుపోయే వరకు నిలబడి పేర్లు నమోదు చేయించుకుంటే, ఆర్టీసీ కండక్టర్లు మినహా చెప్పుకోదగ్గ పోస్టులకు కాల్‌ లెటర్లు వచ్చేవి కాదు. ఇంటర్‌–టీటీసీ, డిగ్రీ–బీఈడీ చేసి ఉంటే, టీచర్‌ ఉద్యోగాలు ఊరించేవి! ఇక్కడ నాటి విద్యార్థులందరి పరిస్థితి ఒకే విధంగా ఉండేదని చెప్పటం నా ఉద్దేశం కాదు. 


ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు ఎవరైనా తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరికీ ఏకరీతిన పాఠాలు బోధిస్తాడు. వినటం, వినకపోవటం, ఒంటపట్టించుకోవటం అనేది విద్యార్థి గ్రహణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే విద్యా సంస్థల నుంచి బయటికి వచ్చే విద్యార్థుల ప్రతిభలో వైరుధ్యం సహజం! అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా జీవితం అనే వైకుంఠపాళిలో జ్ఞాన సంపన్నులు మాత్రమే తాము ఎంచుకున్న రంగంలో సులువుగా నిచ్చెనలు ఎక్కుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు. ఒకవేళ తెలివితేటలతో సంబంధం లేకుండా ఆయాచితంగా నిచ్చెనలు ఎక్కితే, కిందికి దించే పాములు ఎందుకు ఉండవు? అయినా నీ శక్తి సామర్థ్యాలు, నీకంటే బాగా ఇంకెవరికి తెలుస్తాయి? 


ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు చెబుతున్న లెక్కల్లో వ్యత్యాసాలు ఉంటే ఉండవచ్చు! ప్రభుత్వాల సహజసిద్ధమైన అవలక్షణాల్లో కొన్నింటిని ఈ ప్రభుత్వమూ పుణికిపుచ్చుకొని ఉండవచ్చు!! కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల భర్తీ ఎంతో కొంత మెరుగు పడింది వాస్తవం కాదా? అంతకు మించి మన రాష్ట్రం మనకు సిద్ధించాక భద్రత–స్థిరత్వం–భరోసా పెరిగింది నిజం కాదా? కడిచిన ఏడు ఏళ్లుగా తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖల్లో క్రమక్రమంగా అయినా మార్పు గోచరించటం లేదా? నెర్రలిచ్చిన నేలలు, పిచ్చి చెట్లతో మూసుకుపోయిన కాల్వల్లో నీటి సవ్వడులు వినిపించటం లేదా? ఈ కరోనా మహమ్మారి అనే కారు కబ్బులు కమ్ముకోకపోయి ఉంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశంలోని అనేక రాష్ట్రాల కంటే ఇసుమంత అయినా భేషుగ్గా ఉండేది సత్యదూరమా? అన్ని రోజులు మనవే అయితే, ఒకేలా ఉంటే, దాని పేరు కాలం ఎలా అవుతుంది? 


విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా, ఓపికను కూడదీసుకొని మనుగడ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించటం, ఎంచుకోవటం, నిలదొక్కుకునే ప్రయత్నం చేయటం ఉత్తముల లక్షణం. బతికి ఉంటే, బలుసాకు తిని బతుకొచ్చు! సమస్యలపై కొట్లాడొచ్చు. ప్రభుత్వం మెడలు వంచొచ్చు. పరిష్కారం సాధించగలిగితే, నలుగురిలో యోధుడిగా గుర్తింపు పొందొచ్చు. అంతేకాని, మిన్ను విరిగి మీద పడిందని, సర్వశక్తులు సన్నగిల్లాయని భ్రమించి విపరీత నిర్ణయాలు తీసుకుంటే, స్వీయ జీవితం విషాదాంతమే అవుతుంది. సమాజానికీ మేలు చేయదు!


ప్రమాదాల్లో చావులను అరికట్టటానికి తపిస్తున్న పరిస్థితుల్లో బలవన్మరణాలు క్షమార్హం ఎలా అవుతాయి? ఒకరిని చూసి మరొకరు ఆత్మహత్యలు చేసుకోవటానికి ఇదేమైనా గొలుసుకట్టు వ్యాపారమా? మరణానికి వీరత్వం ఆపాదించటానికి జరుగుతున్నది దేశ సరిహద్దు పోరాటమా?


చావుల్లోనూ ఫాయిదా కోసం దేవులాడే నీచమైనవి రాజకీయాలు. లబ్ధి చేకూరుతుందని అనుకుంటే, నిప్పులు చెరిగే ఎండల్లోనూ చలి మంటలు కాచుకోవటానికి వెనుకాడవు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలోకి వెళ్లినప్పుడు ఇంకోలా..ఊసరవెల్లి వలె రంగులు మార్చుకోవటానికి సిగ్గు పడవు. వాటికి విలువలు వలువలతో సమానం. జనం కోసం తెగించినట్టే కనిపిస్తాయి. ఎప్పుడూ తెర వెనుకే కాదు, అప్పుడప్పుడు తెర ముందు కూడా దిగజారటానికి సంశయించవు. అదొక మాయా ప్రపంచం! ఓటరుగా రాజకీయాల్లోని మంచీ చెడును వేరు చేసి చూసే హంస అవతారం ఎత్తాల్సిందే! లేదంటే వేటగాడి ఉచ్చులో చిక్కుకున్న జింక పిల్లలా గిలగిలలాడాల్సిందే!


‘పలానా నిరుద్యోగి చనిపోతే, అంత్యక్రియలకు వేల మంది తరలివచ్చారు. అందులో రాజకీయ పార్టీల ప్రముఖులు ఉన్నారు. పాడె మోశారు. ఆర్థికసాయం చేశారు. సంతాప సభలు పెట్టారు’ అని ఇంకెవరైనా ఆత్మార్పణానికి తెగించటం కంటే, మతిభ్రమణం మరొకటి ఉండదు! బలవన్మరణం వల్ల అమరత్వం సిద్ధిస్తుందనుకోవటం కంటే పెద్ద అపోహ ఇంకోటి ఉండదు!!


ఆఖరి చూపు కోసం వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు, చనిపోయిన వారి కుటుంబాలకు తోడూనీడగా కడవరకు ఉంటారన్న నమ్మకం లేదు! బాండు పేపర్‌ రాసి ఇచ్చిన వాళ్లే, నాలుక మడత వేస్తున్న కలికాలం ఇది!! మరణించాక యేటా తద్దినం పెడతారని ముందే తృప్తి చెందేరు సుమా! దశ దిన కర్మలోపు పిండాలను పిట్టకు పెట్టటానికి కూడా ఎవరూ రాబోరని తెలుసుకోండి!! అమ్మ కన్నీటి చెమ్మను ఆమె చీర కొంగే తుడవాలి! నాన్న గుండెల్లోని బాధను ఆయనే దిగమింగుకోవాలి!! ఆలి మదిలోని ఆవేదనను బిడ్డ బోసి నవ్వే తీర్చాలి!!!


అందుకే మిత్రమా! చేజేతులా అర్ధాయుషు చరిత్రను లిఖించుకోకు. చేతనైతే కాదు, చేత కాకున్నా బతుకు. బతుకునివ్వు. నూరేళ్లు వర్ధిళ్లు!!

మెండు శ్రీనివాస్‌

Updated Date - 2021-04-09T05:40:45+05:30 IST