Advertisement
Advertisement
Abn logo
Advertisement

చేయూతలో.. చేతివాటం

వరద సాయంలోనూ కార్పొరేటర్ల కక్కుర్తి


కడప, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదేనేమో... తుఫానుతో ఇళ్లు, వాకిళ్లు కోల్పోయి కొందరు.. వరద నీరు ఇంటిలో చేరి వస్తువులు పాడైపోయి మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు.. వారిని తాత్కాలికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం నగదు, నిత్యసర వస్తువులు పంపిణీ చేసింది. అయితే ఆ చిరు సాయంలో కూడా కొందరు కార్పొరేటర్లు కక్కుర్తిపడి చేతివాటం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జవాద్‌ తుఫాన్‌ ధాటికి కడప నగరం కూడా ముంపునకు గురైంది. 5,270 ఇళ్లపై వర్షం ప్రభావం చూపించింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు దెబ్బతిన్నాయి. 46 గృహాలు దెబ్బతిన్నాయి. వరద ప్రభావంతో పాతకడప, దేవునికడప, ఉక్కాయపల్లె, వికలాంగుల కాలనీ, పద్మావతినగర్‌, రామకృష్ణనగర్‌, బుడ్డాయపల్లె, చిన్నచౌక్‌, భాగ్యనగర్‌కాలనీ, ఎన్జీవో కాలనీ, ప్రకా్‌షనగర్‌, సరోజినగర్‌, పుట్లంపల్లి, ఎర్రముక్కపల్లె, నాగరాజుపేట, సెవెన్‌రోడ్స్‌, మోచంపేట, రవీంద్రనగర్‌, కాగితాలపెంట, ఊటుకూరు, రామరాజుపల్లెతో పాటు.. మొత్తం 41 డివిజన్లకు చెందిన జనం ఇబ్బంది పడ్డారు.


ప్రభుత్వ సాయం..

వరద బాధితులకు ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.2వేలు ఇచ్చింది. కుటుంబంలో ఒక్కరే ఉంటే రూ.1000 ఇచ్చింది. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్‌ పామాయిల్‌, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు అందించింది. మొత్తం 46 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వీటిలో పూర్తిగా పడిపోయిన 16 ఇళ్లకు రూ.95 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న గుడిసెలకు రూ.4,100, దెబ్బతిన్న గృహాలకు రూ.5,200 పరిహారం ఇచ్చారు. మొత్తం కోటి78 వేల రూపాయలు అందించారు. 


సగం నొక్కేశారు

వరద సాయం పంపిణీలో ఆరుగురు కార్పొరేటర్లు చేతివాటం చూపారనే విమర్శలున్నాయి. బాధితులకు పంపిణీ చేసే డబ్బులో సగం నొక్కేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎదురు తిరిగితే ఆ మొత్తం కూడా రాదనే భయంతో కొందరు సగం డబ్బు  కార్పొరేటర్లకు ఇచ్చేశారని తెలిసింది. ఆ ఆరుగురిలో ముగ్గురు ప్రముఖుల అనుచరులే ఉండడం విశేషం. పరిహారంలో చేతివాటంపై కడప మున్సిపల్‌ కమిషనర్‌ రంగస్వామిని ఆంధ్రజ్యోతి ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. వరద సాయం పంపిణీలో అక్రమాలు జరిగినా, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ శివరామిరెడ్డి వెల్లడించారు. 

Advertisement
Advertisement