పెరటి కోడి.. లాభాల ఒడి

ABN , First Publish Date - 2021-06-23T04:46:00+05:30 IST

ఏడాది పొడవునా ఏ కాలంలోనైనా జీవించే పెరటికోళ్ల పెంపకం

పెరటి కోడి.. లాభాల ఒడి

  • వ్యవసాయ క్షేత్రాల్లో నాటు కోళ్ల పెంపకం
  • ఆదాయం పొందుతున్న పల్లె జనం


షాద్‌నగర్‌ అర్బన్‌: ఏడాది పొడవునా ఏ కాలంలోనైనా జీవించే పెరటికోళ్ల పెంపకం పల్లెవాసులకు ఆదాయ వనరుగా మారింది. ఇంటి పరిసరాల్లో.. వ్యవసాయ క్షేత్రాల్లో సహజ సిద్ధంగా పెరిగే నాటుకోళ్లను పెంచడానికి గ్రామీణులు కూడా ఆసక్తి చూపుతున్నారు. పండుగలు, ఉత్సవాలకు అనుగుణంగా నాటుకోళ్లను పెంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఏ సీజన్‌లోనైనా డిమాండ్‌ తగ్గని నాటుకోళ్లను రైతులు సైతం తమ వ్యవసాయ క్షేత్రాల వద్ద పెంచుతున్నారు. 


వ్యవసాయ క్షేత్రాల్లో కోళ్ల పెంపకం

ఆరుబయట గడ్డి, పురుగులు, గింజలు తిని పెరిగే నాటు కోళ్లను వ్యవసాయ క్షేత్రాల్లోనూ పెంచుతున్నారు. నాటుకోళ్లు త్వరగా పెరగడానికి వడ్లు, జొన్నలు, నూకలు, మొక్కజొన్న పరం పోస్తుంటారు. కిలో కోడిని రూ.400 నుంచి రూ.500 విక్రయిస్తున్నారు. దసరా, సంక్రాంతిలాంటి పండుగలతో పాటు బోనాల సమయంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. కొందుర్గు మండలం పుల్లప్పగూడ గ్రామ శివారులోని సట్టి సంజీవరెడ్డి కుటుంబం తన వ్యవసాయక్షేత్రంలో నాటు కోళ్లను పెంచుతున్నాడు. తోటి రైతులకు ఆదర్శంగా పెంచుతున్న నాటుకోళ్లను పరిసర గ్రామాల ప్రజలు వ్యవసాయ క్షేత్రం వద్దకే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు.


కరోనా కాలంలో నాటుకోళ్లకు డిమాండ్‌

మాంసం, కోడి మాంసం, గుడ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న ప్రచారం జరగడంతో కరోనా సమయంలో నాన్‌వెజ్‌కు భలే గిరాకీ పెరిగింది. ప్రధానంగా నాటు కోడి మాంసం విక్రయాలు పెరిగాయి. స్టెరాయిడ్‌ ఇంజక్షన్లు, దాణాతో 40రోజుల్లో మార్కెట్‌కు సిద్ధం చేస్తున్న బ్రాయిలర్‌ కోడిమాంసం తినడానికి ఇష్టపడని మాంసం ప్రియులు.. నాటుకోళ్లను కొనడానికి పోటీ పడుతున్నారు. మార్కెట్‌లో గిరిరాజా, వనరాజా కోళ్లతోపాటు పౌలీ్ట్రల్లో కలర్‌ కోళ్లను పెంచుతున్నా... నాటు కోళ్లను కొనడానికే ఇష్టపడుతున్నారు. అవకాశం ఉన్న ప్రతి రైతు తమ వ్యవసాయక్షేత్రాల్లో నాటుకోళ్లను పెంచుతున్నారు. 


కోళ్ల పెంపకం లాభదాయకమే...

నాటుకోళ్ల పెంపకం మంచి లాభదాయకంగా ఉంది. ఆరుబయట తిరిగే నాటుకోళ్ల పెంపకానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. పచ్చిగడ్డి, పురుగులు దొరకనప్పుడు గింజలు పోస్తే సరిపోతుంది. ఇంటి వద్దకే వచ్చి మంచి ధరకు కోళ్లను కొంటున్నారు. వ్యవసాయ బావుల వద్ద స్థలం ఉంటే రైతులు నాటు కోళ్లను పెంచితే మంచి లాభదాయకంగా ఉంటుంది. 

- సట్టి శ్యామలమ్మ, పుల్లప్పగూడ

Updated Date - 2021-06-23T04:46:00+05:30 IST