పెరిగిన చికెన్‌ వినియోగం- నిలకడగా ధరలు

ABN , First Publish Date - 2021-08-29T20:13:55+05:30 IST

సాధారణంగా శ్రావణ మాసంలో నాన్‌వెజ్‌ వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చికెన్‌ వినియోగం మరింత పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు.

పెరిగిన చికెన్‌ వినియోగం- నిలకడగా ధరలు

హైదరాబాద్‌ః సాధారణంగా శ్రావణ మాసంలో నాన్‌వెజ్‌ వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చికెన్‌ వినియోగం మరింత పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. గత కొంత కాలంగా చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. కానీ ప్రస్తుతం రిటైల్‌మార్కెట్‌లో కిలో చికెన్‌ దర 240 నుంచి 250 రూపాయలు పలుకుతోంది. గత సంవత్సరం శ్రావణ మాసంతో పోలిస్తు ధర దాదాపు 80 రూపాయలు ఎక్కువ. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చికెన్‌ ధరలు రిటైల్‌ మార్కెట్‌లో 140 నుంచి 160 రూపాయలు పలుకుతుంది. కానీ ఈసారి మాత్రం కిలో 250 రూపాయలకు చేరింది. చికెన్‌ వినియోగా భారీగా పెరగడంవల్లనే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. 


గత నెల రోజుల క్రితం కిలో చికెన్‌ ధర 260 నుంచి 280 రూపాయలు పలకింది. కానీ ప్రస్తుతతం 250 వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో చికెన్‌ వినియోగం గత సంవత్సరంతో పోలిస్తే మూడురెట్లు ఎక్కువ ఉన్నట్టు హోల్‌సేల్‌ చికెన్‌ వ్యాపారి మహమ్మద్‌ సాజిత్‌ తెలిపారు. ముఖ్యంగా కరోనా విజృంభణ సమయంలో చికెన్‌ వినియోగం బాగా పెరిగింది. చికెన్‌ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో నాన్‌వెజ్‌ ప్రియులు అధికంగా చికెన్‌ వైపు మళ్లారు. ఇక శ్రావణ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్న కారణంగా కూడా వినియోగం అధికం కావడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. 


ఈ కారణంగానే ఈసారి ధరలు తగ్గడం లేదని చెబుతున్నారు. సాధారణ రోజుల్లో ఒక్కహైదరాబాద్‌ నగరంలోనే రోజుకు లక్ష కేజీల చికెన్‌ వినియోగం జరుగుతుండగా, పండగలు, ప్రత్యేక సందర్బాల్లో వినియోగం రెట్టింపు అవుతుందని వ్యాపారులు చెప్పారు. కాగా ప్రస్తుతం చికెన్‌ వినియోగం రోజుకు 2..5 నుంచి 3లక్షల కేజీలకు పెరిగిందని వ్యాపారులు తెలిపారు. ఇంతగా చికెన్‌ వినియోగం పెరగడానికి మటన్‌ ధరలు పెరగడం మరో కారణంగా చెబుతున్నారు. మటన్‌ కొనుగోలు చేసే స్థోమత లేనివారు చికెన్‌కే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రోజు రోజుకూ చికెన్‌ వినియోగం మరింత పెరిగే అవకాశం వుందని వ్యాపారుల అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2021-08-29T20:13:55+05:30 IST