ఎవరిదీ బాధ్యతారాహిత్యం?

ABN , First Publish Date - 2021-05-15T06:05:15+05:30 IST

ప్రతిరోజూ ఇస్తున్న వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య పెరగడానికి బదులు తగ్గిపోతోంది. ఏప్రిల్ 2న 42,65,157 డోసులు ఇచ్చారు. అయితే అదే నెలలో ఇచ్చిన డోసుల రోజువారీ సగటు 30 లక్షలు మాత్రమే....

ఎవరిదీ బాధ్యతారాహిత్యం?

ప్రతిరోజూ ఇస్తున్న వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య పెరగడానికి బదులు తగ్గిపోతోంది. ఏప్రిల్ 2న 42,65,157 డోసులు ఇచ్చారు. అయితే అదే నెలలో ఇచ్చిన డోసుల రోజువారీ సగటు 30 లక్షలు మాత్రమే. మే నెలలో ఈ రోజువారీ సగటు 18.5 లక్షలకు పడిపోయింది. టీకాల కొరతతో ఈ కార్యక్రమానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.


భారత ప్రజలు, అందరూ కాకపోయినా అత్యధికులు ఒక నిశ్చిత నిర్ణయానికి వచ్చేశారు. తమ ప్రాణాలను తామే కాపాడుకోవలసి ఉందని, మరో గత్యంతరం లేదని వారు విశ్వసిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మినహా ప్రభుత్వం తమను ఏవిధంగానూ ఆదుకొనే పరిస్థితి లేదని భారత ప్రజానీకం భావిస్తోంది. కొవిడ్–19పై పోరులో రాజ్యవ్యవస్థ ముఖ్యంగా కేంద్రప్రభుత్వం దాదాపుగా విశ్వసనీయతను కోల్పోయింది. 


ఈ ఘోర పరిస్థితులకు ఎవరు ప్రధానంగా బాధ్యులు? వాదోపవాదాలు సరైన సమాధానాన్ని సమకూర్చవు. ఎందుకంటే ఇది వివేచన లేక హేతువాదాన్ని శిరసావహించిన కాలం కాదు కదా. కొన్ని నిరాక్షేపణీయ వాస్తవాలను నివేదిస్తాను. ఎవరికివారే మంచిచెడ్డలు నిర్ణయించుకోవాలి. టీకాలు అందుబాటులోకి వచ్చిన తొలిదశలో అనేకమంది టీకా వేయించుకోవడానికి సంకోచించారు. వ్యాక్సిన్ డోసులు ఎప్పుడు ఏ పరిమాణంలో అవసరమవుతాయో కచ్చితమైన అంచనాకు వచ్చే వెసులుబాటు ఉన్నది. అయితే ప్రభుత్వం ఈ అవసరాలను కచ్చితంగా లెక్కకట్టడంలో విఫలమయింది. తత్ఫలితమే ప్రస్తుత వ్యాక్సిన్ల కొరత. ఇదొక సంక్షోభం. 


మనదేశంలోని ప్రధాన టీకా ఉత్పత్తిదారులు– -సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్- ఉత్పాదక సామర్థ్యమేమిటో ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. వాస్తవ ఉత్పాదక సామర్థ్యాన్ని, దాన్ని ఏ స్థాయిలో శీఘ్రగతిన పెంపొందించవచ్చన్న విషయాన్ని, సంబంధిత ఫ్యాక్టరీలను పరిశీలించడం, కంపెనీల లెక్కలను నిర్ణీత కాల వ్యవధిలో ఆడిట్ చేయడం ద్వారా ఒక కచ్చితమైన అంచనాకు రావచ్చు. అయితే ప్రభుత్వం ఇలాంటిదేమీ చేయనేలేదు. ఈ ఏడాది జనవరి 11న మాత్రమే సీరం, భారత్ బయోటెక్‌లకు వ్యాక్సిన్ల కోసం ఆర్డర్ ఇచ్చారు. ఆ రెండు కంపెనీలు తొలుత తమ నిల్వల నుంచి టీకాలను సరఫరా చేశాయి. ఏమైనా ఉత్పత్తిని సత్వరమే ఇతోధికం చేసేలా ఆ రెండు కంపెనీలను సకాలంలో ప్రోత్సహించకపోవడంలో విలువైన సమయం వృథా అయింది. 


టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు కనీసం ఒక కంపెనీ (సీరం)కి, బహుశా భారత్ బయోటెక్‌కు సైతం నిధుల అవసరం ఎంతైనా ఉంది. అదనపు ఉత్పాదక సామర్థ్యానికి అవసరమైన నిధులను సమకూ ర్చేందుకు ప్రభుత్వం ఇంతవరకు ఆ కంపెనీలకు ఎలాంటి ఆర్థికసహాయాన్ని మంజూరు చేయలేదు. సప్లయ్ అడ్వాన్స్‌లను గత నెల 19న ప్రకటించారు. అయితే అవి సరఫరాలకు ముందస్తు చెల్లింపులు మాత్రమే గానీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు మంజూరు చేసిన రుణ సహాయం కాదు. మదుపు సదుపాయం అసలే కాదు. 


భారత్‌లో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లను ఎగుమతి చేసేందుకు 2021 మార్చి వరకు అనుమతినిచ్చారు. టీకాల ఎగుమతిని 2021 మార్చి 29న మాత్రమే నిషేధించారు. ఈ లోగా మనదేశం నుంచి 5.8 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఎగుమతి అయ్యాయి. ఫైజర్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేశారు. ఫలితంగా తమ టీకాను ఉత్పత్తి చేసేందుకు భారత ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తును ఫైజర్ ఉపసంహరించుకుంది. ఇక మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్‌వి (రష్యన్ ఉత్పత్తి)ని ఉపయోగించుకునేందుకు 2021 ఏప్రిల్ 12న మాత్రమే అనుమతి ఇచ్చారు. రష్యా నుంచి ఆ టీకాల తొలివిడత సరఫరా 2021 మే 5న జరిగింది. ఇతర టీకాలను ఉపయోగించుకోవడానికి గానీ, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి గానీ కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఎవరికీ ఎలాంటి అనుమతినివ్వలేదు. 


కరోనా మహమ్మారి తొలిదశ నెమ్మదించడం ప్రారంభమయిందో లేదో రోగనిర్ధారణ పరీక్షలు సైతం గణనీయంగా తగ్గిపోయాయి. దాంతో ఆ వైరస్ కొత్తగా ఎంతమందికి సంక్రమించిందో కచ్చితంగా తెలుసుకునే అవకాశమూ లేకపోయింది లేదా తగ్గిపోయింది. టెస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయనేలేదు. మహమ్మారి ప్రభావం తగ్గిపోయినప్పటికీ టెస్టింగ్‌ను ముమ్మరంగా కొనసాగించి ఉంటే ప్రస్తుత విపత్కర పరిస్థితులకు ఆస్కారముండేది కాదు కదా. 


ప్రతిరోజూ ఇస్తున్న వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య పెరగడానికి బదులు తగ్గిపోసాగింది! 2021 ఏప్రిల్ 2న 42,65,157 డోసులు ఇచ్చారు. అయితే అదే నెలలో ఇచ్చిన డోసుల రోజువారీ సగటు 30 లక్షలు మాత్రమే. మే నెలలో ఈ రోజువారీ సగటు మరింతగా తగ్గిపోయింది. ఈ వ్యాసం రాస్తున్న రోజున అది కేవలం 18.5 లక్షలకు పడిపోయింది. టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. 


అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా వనరులను సక్రమంగా ఉపయోగించుకునేందుకు, అత్యవసర ఉపయోగానికి అనుగుణంగా సదుపాయాలను మెరుగుపరచుకునేందుకు ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదు. ఉదాహరణకు ఆక్సిజన్ వనరుల విషయాన్నే చూడండి. ఆక్సిజన్ వనరులను పెంపొందించుకోవడానికి వీలుగా నైట్రోజన్ ట్యాంకర్లను ఆక్సిజన్ ట్యాంకర్లుగా మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. అలాగే ఆక్సిజన్ కోసం విదేశాల నుంచి పిఎస్‌ఏ ప్లాంట్లను దిగుమతి చేసుకునే ప్రయత్నాలూ జరగలేదు. ఆక్సిజన్ కాన్‌సంట్రేటర్లు, వెంటిలేటర్ల దిగుమతికీ ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయలేదు. అధిక సంఖ్యలో నర్సుల, పారామెడికల్ సిబ్బందిని నియమించడానికి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. 


కరోనా రెండోదఫా విజృంభణ ప్రారంభమయినప్పుడు అది కూడా మొదటి దశలో వలే క్రమంగా ఉధృతమై, ఆ తరువాత నెమ్మదించి, అనంతరం తగ్గిపోతుందని భావించారు. అయితే ఈ మహమ్మారి రెండో విజృంభణ భయానకంగా ఉండగలదని ఎవరూ ఉహించలేదు. అనూహ్యమైన విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసివస్తుందన్న విషయమై ఎవరికీ సరైన అవగాహన లేదు. ఈ అవగాహనారాహిత్యంతోనే రెండో దఫా విజృంభణను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోలేదు. సరే, మూడవ, నాల్గవ దఫాల విజృంభణను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని భావించడానికి ఏమైనా ఆస్కారముందా? 


ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వానికి ఐఇసి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్- దృక్పథమే లేదు! కరోనా మొదటిదశలో ప్రభుత్వం ప్రచారానికి అగ్ర ప్రాధాన్యమిచ్చింది. మహమ్మారి అదుపులో తాము అసాధారణ విజయాలను సాధిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంది. రెండోదశలో నిరాకరణే ప్రభుత్వ వైఖరిగా ఉంది! ‘టీకాల కొరత అనేది లేనేలేదు, రాష్ట్రాల వద్ద టీకాల నిల్వలు సమృద్ధంగా ఉన్నాయి’ వంటి ప్రకటనలను గమనించారా? మరింత స్పష్టంగా చెప్పాలంటే సత్యాలను కప్పిపుచ్చడం, బాధ్యతను రాష్ట్రాల పైకి నెట్టివేయడమే కేంద్రం వైఖరిగా ఉంది. తత్ఫలితమే కరోనాపై పోరులో ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితులు, జవాబుదారీ రాహిత్యం. ఇదేగనుక మరో దేశంలో అయితే పాలకులు తమ అధికారాన్ని కోల్పోయి ఉండేవారు. పాఠక మహాశయా, మరి మీ తీర్పు ఏమిటి?




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-05-15T06:05:15+05:30 IST