నేడు రాష్ట్రానికి చీఫ్‌ జస్టిస్‌ రమణ

ABN , First Publish Date - 2021-06-11T09:36:51+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శుక్రవారం రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా

నేడు రాష్ట్రానికి చీఫ్‌ జస్టిస్‌ రమణ

సుప్రీం సీజేగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి రాక

ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు

మూడు రోజులపాటు రాజ్‌భవన్‌ అతిథి గృహంలో విడిది

శ్రీవారి సేవలో సుప్రీం సీజే.. టీటీడీ చైర్మన్‌, ఈవో స్వాగతం


 సీజేఐకు ధన్యవాదాలు

జడ్జిల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్‌ 2019 ఫిబ్రవరి 15న ప్రధానికి, సీజేఐకి లేఖ రాశారు. 2 సంవత్సరాల తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టగానే నిర్ణయం తీసుకున్న జస్టిస్‌ రమణకు ధన్యవాదాలు.

వినోద్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు


హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శుక్రవారం రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల పర్యటనలో ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులతో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఇతర అధికార ముఖ్యులు ఆయనకు స్వాగతం పలకనున్నారు. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి జస్టిస్‌ ఎన్వీ రమణ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, ఇతర ప్రముఖులు సాదర స్వాగతం పలకనున్నారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్‌ ప్రకారం, సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ మూడు రోజుల పాటు రాజ్‌భవన్‌ అతిథి గృహంలో విడిది చేయనున్నారు. అక్కడే ఆయన ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తారని సమాచారం.


సుప్రీం సీజే ఎన్వీ రమణ రెండు రోజుల క్రితమే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై న్యాయవాద వర్గాలు, ప్రభుత్వ ముఖ్యుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారంతా రాష్ట్ర పర్యటనకు తొలిసారి విచ్చేస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయటానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రం గా న్యాయవాద వృత్తి నుంచి దేశంలోనే అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు ఎదిగిన జస్టిస్‌ ఎన్వీ రమణను ఈ సందర్భంగా స్నేహితులు, సన్నిహితులు కలిసి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.  




సీజేఐ చొరవ మరచిపోలేనిది

తెలంగాణ హైకోర్టు జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 పెంచడానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఆ ప్రతిపాదనలపై స్పందించి హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచడానికి సీజే జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చూపిన చొరవ ఎప్పటికీ మరచిపోలేనిది. పెరిగిన న్యాయమూర్తుల సంఖ్యతో పెండింగ్‌ కేసుల పరిష్కారంలో తెలంగాణ హైకోర్టు ప్రథమ స్థానంలో ఉంటుంది. 

బీఎస్‌ ప్రసాద్‌, అడ్వకేట్‌ జనరల్‌


న్యాయవాదుల కల నెరవేర్చారు

40 వేల మంది తెలంగాణ న్యాయవాదుల కలను జస్టిస్‌ రమణ నెరవేర్చారు. సీజేఐగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి అద్దం పడుతున్నాయి. ఆయనకు తెలంగాణ బార్‌ కౌన్సిల్‌, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రుణపడి ఉంటాయి. 

విష్ణువర్థన్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు


సమన్యాయంతో పూరించాలి

తెలంగాణ జ్యుడీషియరీకి జస్టిస్‌ రమణ సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివి. పెరిగిన సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే 30 మంది జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక న్యాయం పాటించి వాటిని భర్తీ చేయాలి. అది ఆయన వల్లే సాధ్యం. 

వెంకట్‌ యాదవ్‌, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు

స్వాగతిస్తున్నాం

హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను సీజేఐ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నాం. 

జి.మోహనరావు, టీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌


శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు సీజే 

తిరుమల, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాత్రి 8.20కు   పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పుష్పాగుచ్ఛాన్ని అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అతిథిగృహం నుంచి జస్టిస్‌ ఎన్వీ రమణ సంప్రదాయ దుస్తులు ధరించి భార్యా సమేతంగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. చైర్మన్‌, ఈవో, అదనపు ఈవో, అర్చక స్వాములు సాదర స్వాగతం పలికారు. జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారి మూలమూర్తిని దర్శించుకుని ఏకాంత సేవలో పాల్గొన్నారు. దాదాపు 50నిమిషాల పాటు జస్టిస్‌ ఎన్వీ రమణ ఆలయంలో గడిపారు. కాగా, శ్రీవారికి పరమ భక్తుడైన జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పేరు ఖరారైన నేపథ్యంలో ఏప్రిల్‌ 11న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా సీజేఐ హోదాలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.  

Updated Date - 2021-06-11T09:36:51+05:30 IST