రేపు యాదాద్రికి చీఫ్‌ జస్టిస్‌ రమణ

ABN , First Publish Date - 2021-06-13T08:36:53+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వీక్షించనున్నారు.

రేపు యాదాద్రికి చీఫ్‌ జస్టిస్‌ రమణ

  • స్వయంగా కలిసి ఆహ్వానించిన కేసీఆర్‌ 
  • సీజేఐ వెంట రానున్న తమిళిసై, జస్టిస్‌ కోహ్లీ
  • సీజేఐ జస్టిస్‌ రమణకు న్యాయమూర్తుల సన్మానం

హైదరాబాద్‌/యాదాద్రి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వీక్షించనున్నారు. సోమవారం ఆయన యాదాద్రి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకోనున్నారు. యాదాద్రికి సుప్రీం సీజే వెంట గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ వెళతారు. సీఎం కేసీఆర్‌ శనివారం రాజ్‌భవన్‌ అతిథి గృహంలో బసచేసిన సీజేఐ జస్టిస్‌ రమణతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయం సందర్శనకు ఆదివారం రావాల్సిందిగా జస్టిస్‌ ఎన్వీ రమణను ఆహ్వానించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ వైభవాన్ని వివరించారు. రాజుల కాలం తర్వాత ఆధునిక కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కృష్ణరాతి శిలలతో నిర్మితమైన ఆలయాన్ని సందర్శించాలని కోరినట్టుగా తెలిసింది. సీఎం కేసీఆర్‌ అభ్యర్థనకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సానుకూలంగా స్పందించారు. దీంతో తొలుత ఆదివారం యాదాద్రి పర్యటించాలని అనుకున్నప్పటికీ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా సోమవారం ఖరారు చేశారు. 


ఉదయం 11 గంటలకు వేర్వేరు హెలికాప్టర్లలో యాదాద్రికి చేరుకోనున్నారు. పెద్దగుట్ట పైనుంచి రోడ్డు మార్గంలో కొండపైకి చేరుకుని యాదాద్రి ప్రధానాలయాన్ని పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆలయ పునర్నిర్మాణ తీరును స్వయంగా జస్టిస్‌ ఎన్వీ రమణకు వివరించనున్నారు. బాలాలయంలో ప్రధాన న్యాయమూర్తికి ఆలయ మర్యాదల ప్రకారం పరివట్టం, పూర్ణకుంభ స్వాగతం, వేద మహదాశీర్వచనం నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. సీజేఐ యాదాద్రి పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆయనకు ఆలయం వద్ద స్వయంగా గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ఘన స్వాగతం పలకనున్నారు. ప్రధాన న్యాయమూర్తి బస చేయడం కోసం కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహాన్ని సిద్ధం చేశారు.


శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్‌

రాజ్‌భవన్‌లో బస చేసిన సీజే జస్టిస్‌ ఎన్వీ రమణను శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సీజేకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సీజేను కలిసి ఎన్నికల నియమావళిలో మార్పులు తీసుకొచ్చి, రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరారు. మాజీ ఎంపీలు వీహెచ్‌, మల్లు రవి ప్రధాన న్యాయమూర్తిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 


అద్భుత యాదాద్రి.. 

యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే అత్యద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ఇందుకోసం ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రూ.1250 కోట్ల అంచనా వ్యయంతో లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఆయన పలుమార్లు స్వయంగా యాదాద్రి వెళ్లి ఆలయ విస్తరణ పనులను పరిశీలించి, అధికారులు, శిల్పులకు సూచనలు చేశారు. ఇప్పటి వరకు రూ.850 కోట్లు ఖర్చు చేశారు. ఇతిహాస ఘట్టాలను కళ్లముందుంచుతూ, అత్యద్భుత శిల్ప కళా నైపుణ్యంతో ప్రధాన ఆలయాన్ని వైభవంగా తీర్చిదిద్దారు. యాదాద్రీశుడి ఆలయ నిర్మాణం తుది దశకు చేరడంతో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించారు. యాదాద్రిపైకి భక్తులు వెళ్లి, వచ్చేందుకు వీలుగా చేపట్టిన రెండు ఘాట్‌ రోడ్లను వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-06-13T08:36:53+05:30 IST