Abn logo
Jun 19 2021 @ 02:51AM

జిల్లాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌

  • రేపు సిద్దిపేట, కామారెడ్డికి.. కలెక్టరేట్లు, పోలీసు భవనాల ప్రారంభం
  • 21, 22ల్లో వరంగల్‌, భువనగిరిలో.. 21న రోజంతా యాదాద్రిలో 
  • ఆలయ పనుల పరిశీలన.. 22న దత్తత గ్రామం వాసాలమర్రిలో


హైదరాబాద్‌, యాదాద్రి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటన ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. తొలుత ఆయన ఈనెల 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో, 21న వరంగల్‌, భువనగిరి జిల్లాల్లో, 22న భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల పర్యటన సందర్భంగా నూతన కలెక్టరేట్‌ భవనాలతోపాటు అత్యాధునిక హంగులతో నిర్మించిన సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌, కామారెడ్డి జిల్లా పోలీస్‌ అధికారి (డీపీవో) కార్యాలయ భవనాలను ప్రారంభించనున్నారు. వీటిని రూ.38 కోట్లతో తెలంగాణ పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ నిర్మించింది.

భువనగిరి జిల్లాలో రెండు రోజులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో జిల్లాలో ఆయన పర్యటన ఉంటుందని అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చా యి. దాంతో, జిల్లా అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 21న యాదాద్రి ఆల యం, 22న సీఎం దత్తత గ్రామం తుర్కపల్లి మం డలం వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించనున్నారు. తుది దశకు చేరుకున్న ప్రధానాలయ పనులను పరిశీలించి తుది మెరుగుకు పలు సూచనలు చేస్తారని భావిస్తున్నారు. కొండపై ఆలయ పరిసరాల అభివృద్ధి, కొండ చుట్టూ రింగ్‌ రోడ్డుతోపాటు గండి చెరువు వద్ద భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన, పనుల పురోగతిని పరిశీలించనున్నారు. పెద్ద గుట్టపై టెంపుల్‌ సిటీ లే అవుట్‌లో భక్తుల వసతి సదుపాయాల కోసం కాటేజీల నిర్మాణాలకు డోనర్‌ పాలసీని సైతం ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రోజంతా యాదాద్రి క్షేత్రంలోనే పర్యటించి.. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహంలో రాత్రిబస చేసే అవకాశం ఉంది. సీఎం పర్యటనకు ముందు.. ఈనెల 19న సీఎంవో కార్యదర్శి ఎంవీ భూపాల్‌రెడ్డి యాదాద్రిని సందర్శించి; వైటీడీఏ, ఆర్‌అండ్‌బీ, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షించనున్నారు.


22న వాసాలమర్రిలో సీఎం పర్యటన

ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడానికి తాను దత్తత తీసుకున్న తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్‌ ఈనెల 22న పర్యటించనున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్‌ పోగుల ఆంజనేయులుకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి తన పర్యటన వివరాలను తెలిపారు. గ్రామంలో అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించుకుందామని చెప్పారు. గ్రామస్థులందరికీ తానే భోజనాలు ఏర్పాటు చేస్తానని, అందరం కలిసి సహపంక్తి భోజనాలు చేద్దామని చెప్పారు. గ్రామ అభివృద్ధిపై సమాలోచనలకు సభ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఇందుకు అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ తన పర్యటనపై స్వయంగా యాదాద్రి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పథితోనూ మాట్లాడారు. దీంతో, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, కలెక్టర్‌ జిల్లా అధికార యంత్రాంగంతో వాసాలమర్రి గ్రామంలో సమీక్షించారు.


‘ప్రగతి’ పరీక్ష!

గ్రామ కార్యదర్శి మొదలు జిల్లా కలెక్టరు వరకూ ఇప్పుడు ‘ప్రగతి’ పరీక్ష గుబులు పట్టుకుంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ రానుండడంతో ఎక్కడివారక్కడ అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌పై బదిలీ వేటు పడడం ఇందుకు మరో కారణం. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 20 నెలల క్రితం ప్రారంభమైన పల్లె ప్రగతి కోసం ప్రతినెలా రూ. 339 కోట్లు; పట్టణ ప్రగతికి నెలకు రూ.148 కోట్లు విడుదల చేస్తున్నారు. ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో పరిపాలనను మెరుగుపరిచి, అభివృద్ధిని పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో అదనపు కలెక్టర్ల వ్యవస్థను పరిచయం చేశారు. ఈ కార్యక్రమాలపై ప్రభుత్వం 40 మార్కులతో సర్వే నిర్వహించగా.. కొన్ని జిల్లాలు మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించాయి. చాలా జిల్లాలకు 23, 24 మార్కులే వచ్చాయి. ఎలాంటి ఆటంకాల్లేకుండా నిధులు మంజూరు చేస్తున్నా.. కొన్ని జిల్లాల్లో మందకొడిగా సాగుతుండడంపై సీఎం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. హరితహారం విషయంలోనూ సర్పంచులు భయంభయంగా ఉన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం-2018 ప్రకారం 85ు మొక్కలు బతకకుంటే.. సర్పంచ్‌, గ్రామ కార్యదర్శిపై చర్యలు తప్పవనే ఆందోళన వారిలో నెలకొంది.